ఏంది నిజామా చైనా ? చైనా ఏమి చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు !
చైనా టెలికాం, హువావే కలిసి ఈ 10G బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ అభివృద్ధి చేశామని చెబుతున్న ఈ ప్రకటన మీద పలువురు టెక్ నిపుణులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 22 April 2025 11:35 AM ISTపొరుగు దేశం చైనా మరోసారి టెక్నాలజీలో మేమే తోపులమని చెప్పుకుంటుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి 10Gbps బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించినట్లుప ప్రకటించింది. బీజింగ్ సమీపంలోని హెబీ ప్రావిన్స్ లో పరీక్షించగా 9834 Mbps గరిష్ట వేగంతో ఇంటర్నెట్ పనిచేసిందని చైనా మీడియా ఘనంగా ఊదరగొడుతోంది. ఈ స్పీడుతో రెండు 4K క్వాలిటీ సినిమాలను ఒక్క సెకన్ లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చని కూడా చెబుతోంది. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీమెడిసిన్ రంగాలకు ఇది ఎంతో మేలు చేస్తుందని చైనా చెబుతోంది. అయితే, చైనా చెబుతున్న ఈ అద్భుత కథను అంత తేలిగ్గా నమ్మే పరిస్థితిలో ప్రస్తుతం ప్రపంచం లేదనే చెప్పాలి.
చైనా టెలికాం, హువావే కలిసి ఈ 10G బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ అభివృద్ధి చేశామని చెబుతున్న ఈ ప్రకటన మీద పలువురు టెక్ నిపుణులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చైనా ఇలాంటి అనేక ప్రకటనలు చేసిందని, వాటిలో చాలా వరకు వాస్తవానికి దూరంగా ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా డేటా ప్రైవసీ, సేఫ్టీకి సంబంధించిన విషయాలో చైనా ట్రాక్ రికార్డు మాత్రం అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ కొత్త టెక్నాలజీ వెనుక కూడా ఏదో మతలబు ఉండే ఉండొచ్చని కొందరు అనుమానపడుతున్నారు.
ఒక్క సెకనులో రెండు 4K క్వాలిటీ సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవడం అంటే నిజంగా అబ్బురపరిచే వేగం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వేళ ఇది నిజమైతే క్లౌడ్ కంప్యూటింగ్, టెలీమెడిసిన్, ఇతర లేటెస్ట్ టెక్నాలజీలకు ఇది ఒక గొప్ప ముందడుగు అవుతుంది. అయితే ఈ వేగాన్ని నిజంగా సాధించారా లేదా ఇది కేవలం ప్రచార ఆర్భాటమా అనే ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ టెక్నాలజీపై దృష్టి సారిస్తున్నాయి. అవి ఇంకా 6G దగ్గరే ఉన్నాయి. కానీ, చైనా చెబుతున్నంతటి వేగాన్ని మరే దేశమూ ఇంతవరకు ప్రకటించలేదు. ఒకవేళ చైనా నిజంగానే ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి ఉంటే, దానిని పారదర్శకంగా నిరూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రపంచం ఈ కొత్త టెక్నాలజీని నమ్ముతుంది. లేకపోతే ఇది కేవలం 'చైనా డ్రాగన్' చెప్పిన మరో కథలా మిగిలిపోతుంది.
