Begin typing your search above and press return to search.

'చిలుకూరు బాలాజీ' ధర్మ పోరాట యోధుడికి వీడ్కోలు

ఇప్పుడు ఆయన భౌతికంగా లేకపోయినా.. ఆయన ఏర్పరచిన సంప్రదాయాలు, ఆయన ఆలోచనలు, ఆయన చూపిన మార్గం కొనసాగుతూనే ఉంటాయి.

By:  A.N.Kumar   |   27 Feb 2026 4:54 PM IST
చిలుకూరు బాలాజీ  ధర్మ పోరాట యోధుడికి వీడ్కోలు
X

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎం.వి. సౌందరరాజన్ కన్నుమూయడం కేవలం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు.. ఒక ఆలోచనా ధోరణి.. ఒక ధర్మయుద్ధానికి ప్రతీకగా నిలిచిన యుగానికి ముగింపు లాంటిది. 90 ఏళ్ల వయసులో ఆయన పరమపదించడం భక్తుల హృదయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఆయన జీవితం.. ఆయన పోరాటం, ఆయన సిద్దాంతాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోయే వారసత్వంగా మిగిలిపోయాయి.

హైదరాబాద్ నగర శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దేశవ్యాప్తంగా ప్రత్యేక స్థానంలో నిలిపిన వ్యక్తి సౌందరరాజన్. ఈ ఆలయాన్ని "వీసా బాలాజీ"గా మార్చడంలో ఆయన పాత్ర కీలకం. విదేశాలకు వెళ్లాలనుకునే భక్తులు 11 ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకుని, అది నెరవేరితే 108 ప్రదక్షిణలు చేసే ఆచారం ఆయన ప్రవేశపెట్టినదే. ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు.. భక్తి, నమ్మకం, క్రమశిక్షణల సమ్మేళనం. లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని ఈ ఆలయం సంపాదించడానికి ప్రధాన కారణం కూడా ఇదే.

సౌందరరాజన్ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం చేసిన పోరాటం. దేవుడు ఒక వ్యాపారం కాదు.. భక్తి ఒక వస్తువు కాదు అనే భావనను ఆయన బలంగా నమ్మారు. అందుకే 1998లో చిలుకూరు ఆలయంలో హుండీని తొలగించడం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. సాధారణంగా ఆలయాలు హుండీల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న సమయంలో, "భక్తుల జేబులో చేయి పెట్టని దేవుడు" అనే సిద్ధాంతంతో ఆయన ముందుకు వచ్చారు. ఈ నిర్ణయం ఆ సమయంలో వివాదాస్పదమైనప్పటికీ.. తరువాత ఆయన ధైర్యాన్ని, నిబద్ధతను అనేక మంది ప్రశంసించారు.

ఇంకా ముఖ్యంగా ఆలయాల్లో వీఐపీ సంస్కృతికి ఆయన కఠినంగా వ్యతిరేకించారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో నిలబడి స్వామి దర్శనం చేసుకోవాలనే విధానాన్ని అమలు చేశారు. ఇది సమానత్వానికి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యతను స్పష్టంగా చూపిస్తుంది. భక్తి ముందు ఎవరికీ ప్రత్యేక హక్కులు ఉండకూడదనే సందేశాన్ని ఆయన తన చర్యల ద్వారా ప్రజల్లో నాటారు.

ఆయన ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు.. గొప్ప విద్యావేత్త కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆయన, విద్యా రంగంలోనూ తన ముద్ర వేశారు. తన విద్యను, జ్ఞానాన్ని కేవలం వ్యక్తిగత ప్రగతికే కాకుండా ధర్మ పరిరక్షణకు వినియోగించడం ఆయన గొప్పతనం. దేవాలయాలపై ప్రభుత్వ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, టెంపుల్ ప్రొటెక్షన్ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా చైతన్యం తీసుకువచ్చారు. 2006లో ప్రభుత్వం ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు "తాళాలు తీసుకెళ్లి ముఖ్యమంత్రికే ఇస్తా"అని ధైర్యంగా చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

సౌందరరాజన్ మాటలు కూడా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. "కళ్లుచూసి స్వామిని దర్శించండి.. కళ్లు మూసుకుని కాదు" అనే ఆయన సందేశం భక్తి అంటే అర్థం చేసుకుని అనుభూతి చెందే ప్రక్రియ అని చెప్పేది. దేవుడిని ప్రశాంతంగా, తనివితీరా చూడాలని ఆయన చెప్పిన సందేశం భక్తులలో ఆధ్యాత్మిక అనుభూతిని పెంచింది.

ఇప్పుడు ఆయన భౌతికంగా లేకపోయినా.. ఆయన ఏర్పరచిన సంప్రదాయాలు, ఆయన ఆలోచనలు, ఆయన చూపిన మార్గం కొనసాగుతూనే ఉంటాయి. ఆయన వారసుడు సీఎస్ రంగరాజన్ ఈ బాధ్యతను ముందుకు తీసుకెళ్తున్నారు. చిలుకూరు ఆలయంలో నేటికీ కొనసాగుతున్న హుండీ లేని విధానం, సమాన దర్శనం, ప్రదక్షిణల సంప్రదాయం.. ఇవి ఆయన జీవించి ఉన్నట్లే గుర్తు చేస్తున్నాయి.

మొత్తానికి సౌందరరాజన్ జీవితం ఒక సందేశం.. ధర్మం కోసం నిలబడాలి, భక్తి పవిత్రంగా ఉండాలి, దేవుడు వ్యాపారం కాకూడదు. ఆయన మరణం ఒక లోటు అయినప్పటికీ, ఆయన చూపిన మార్గం తరతరాలకు మార్గదర్శకం అవుతుంది.