Begin typing your search above and press return to search.

భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిన అమెరికా.. సునామీ హెచ్చరిక జారీ

ఈ భూకంపం భూమి ఉపరితలం నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించడం వల్ల దాని ప్రభావం చాలా తీవ్రంగా కనిపించింది.

By:  Tupaki Desk   |   2 May 2025 9:38 PM IST
భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిన అమెరికా..  సునామీ హెచ్చరిక జారీ
X

దక్షిణ అమెరికా మరోసారి భూకంపంతో వణికిపోయింది. శుక్రవారం చిలీ, అర్జెంటీనా రాష్ట్రాల్లోని దక్షిణ ప్రాంతాలలో భారీ భూకంపం సంభవించింది. అమెరికన్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. ఈ భూకంపం తీవ్రత 7.4గా నమోదైంది. దీని కేంద్రం అర్జెంటీనాలోని ఉషువాయియా నగరం నుంచి 219 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్‌లోని సముద్రంలో ఉంది. ఈ భూకంపం తర్వాత అనేక ప్రకంపనలు సంభవించాయి. దీంతో సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

చిలీ, అర్జెంటీనా తీర ప్రాంతాల అధికారులు వెంటనే హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్, మగల్లానెస్ ప్రాంతంలోని మొత్తం తీరప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఎక్స్‌లో మాట్లాడుతూ.. "మగల్లానెస్ ప్రాంతంలోని తీరప్రాంత ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సమయంలో అధికారుల సూచనలను పాటించడం మనందరి బాధ్యత" అని అన్నారు.

ఈ భూకంపం భూమి ఉపరితలం నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించడం వల్ల దాని ప్రభావం చాలా తీవ్రంగా కనిపించింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. అనేక ప్రాంతాలలో ప్రజలను 30 మీటర్ల ఎత్తైన ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మార్కెట్లు, వీధులు, తీర ప్రాంతాలలో భయానక వాతావరణం కనిపించింది.

భూకంపం వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలలో చిలీలోని పోర్టో విలియమ్స్ ఒకటి. ఇక్కడ నుంచి ఇప్పటివరకు 1100 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. చిలీ జాతీయ విపత్తు నిర్వహణ వ్యవస్థ (COGRID)అప్రమత్తంగా ఉంది. భూకంప ప్రకంపనలు, సునామీ వచ్చే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలో ఉంది. అయితే ఇప్పటివరకు ఎటువంటి పెద్ద నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. కానీ అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ఈ ప్రాంతంలో సముద్రపు అలజడి కొనసాగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.