Begin typing your search above and press return to search.

అశ్లీల చిత్రాలు చూస్తే నేరం.. ఆరుగురు అరెస్ట్..15 కేసులు నమోదు

నగరంలో పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలు చూస్తున్న యువకుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

By:  Tupaki Desk   |   4 April 2025 7:00 PM IST
అశ్లీల చిత్రాలు చూస్తే నేరం.. ఆరుగురు అరెస్ట్..15 కేసులు నమోదు
X

నగరంలో పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలు చూస్తున్న యువకుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేయగా, మూడు నెలల్లో 15 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు, పెళ్లి వయసులో ఉన్న యువకుడు ఇలా చాలా మంది ఈ నేరంలో పట్టుబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగి కొడుకు, పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన యువకుడు.. ఇలా ఎంతోమంది పిల్లల అశ్లీల చిత్రాలు చూస్తూ జైలు పాలవుతున్నారు. పిల్లల చేతికి ఫోన్లు, డెస్క్‌టాప్‌లు ఇచ్చాక.. వారు ఏం చూస్తున్నారనేది తల్లిదండ్రులు గమనించాలి అని పోలీసులు అంటున్నారు.

చిన్నారులపై లైంగిక దాడులు, అశ్లీల చిత్రాల వ్యవహారం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు వయోబేధం లేకుండా అంతర్జాలం, సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి గడుపుతున్నారు. దేశ, విదేశాల్లో రహస్యంగా చిత్రీకరించి వెబ్‌సైట్లలో ఉంచిన చిన్నపిల్లల అశ్లీల దృశ్యాలను డౌన్‌లోడ్‌ చేసి మిత్రులతో పంచుకుంటున్నారు.

నగరంలో ఈ ఏడాది ఇలా ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. మూడు నెలల వ్యవధిలో 15 కేసులు నమోదయ్యాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో చైల్డ్‌ పో*ర్నోగ్రఫీపై నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లోయిటెడ్‌ చిల్డ్రన్‌ (ఎన్‌సీఎంఈసీ) నిఘా పెడుతోంది. చిన్న పిల్లల అశ్లీల వీడియోల కోసం అంతర్జాలంలో వెతికిన వారి ఐపీ అడ్రస్, ఈ-మెయిల్, ఫోన్‌ నంబర్ల వివరాలను ఆయా జిల్లాల సీఐడీ అధికారులకు పంపుతారు. అక్కడ నుంచి సంబంధిత సైబర్‌క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు.

నిందితులు నకిలీ సామాజిక మాధ్యమాల ఖాతాల ద్వారా అశ్లీల చిత్రాలు పంపుతున్నారు. తమ పేరు, వివరాలు గుర్తించలేరనే ఉద్దేశంతో టెలిగ్రామ్, స్నాప్‌ఛాట్, ఇన్‌స్టాగ్రాం ద్వారా ఒకరికొకరు చేరవేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

పిల్లల చేతికి ఫోన్లు, డెస్క్‌టాప్‌లు ఇచ్చాక.. వారు ఏం చూస్తున్నారనేది తల్లిదండ్రులు గమనించాలి. నిషేధిత వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలి. వారిపై నిఘా ఉంచామనే అనుమానం రాకుండా.. పిల్లలకు జాగ్రత్తగా నచ్చజెప్పాలి. చైల్డ్‌ ఫోర్నోగ్రఫీ వీడియోలు చూడటం, షేర్‌ చేయటం, వెతకడం నేరం. కేసులు నమోదైతే కెరీర్‌ పాడవుతుంది అని పోలీసులు తెలిపారు.