18 ఏళ్ల లోపే లైంగిక హింస... అబ్బాయిలు, అమ్మాయిల లెక్కలివే!
ఇటీవల కాలంలో మైనర్లపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 5:19 AMఇటీవల కాలంలో మైనర్లపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పాఠశాలల్లోనో, బంధువుల వల్లో, స్నేహితుల కుటుంబ సభ్యుల ద్వారానో.. కారణం ఎవరైనా తెలిసీ తెలియని వయసులో లైంగిక వేధింపులకు బలవుతున్న అమ్మాయిలు, అబ్బాయిల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందని అంటున్నారు. తాజాగా ఓ నివేదిక షాకింగ్ లెక్కలు చెప్పింది.
అవును... 2023లో భారత్ లో 30 శాతం కంటే ఎక్కువ మంది బాలికలు, 13 శాతం మంది అబ్బాయిలు 18 ఏళ్లు నిండకముందే లైంగిక హింసను అనుభవించారని ది లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైన విశ్లేషణ వెల్లడించింది. ఈ విషయంలో దక్షిణాసియాలో బాలికలు ఈ హింసను ఎక్కువగా అనుభవిస్తున్నారని అధ్యయనం తెలిపింది!
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఐదుగురు బాలికలలో ఒకరు, ప్రతీ ఏడుగురు అబ్బాయిలలో ఒకరు 18 ఏళ్లు నిండకముందే లైంగిక వేధింపుల బారిన పడుతున్నారని అంచనా ఉన్న నేపథ్యంలో... అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీలోని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ & ఎవాల్యుయేషన్ పరిశోధకులు ఆఫ్రికాలో 18ఏళ్ల లోపు అబ్బాయిలు ఎక్కువగా లైంగిక హింసకు గురవుతున్నారని తెలిపారు.
ఇదే సమయంలో... 2023లో ప్రపంచవ్యాప్తంగా వయస్సు - ప్రామాణిక ప్రాబల్యం మహిళలకు 18.9 శాతం, పురుషులకు 14.8 శాతం ఉందని నివేదిక అంచనా వేసింది. 1990-2023 మధ్య 200 కంటే ఎక్కువ దేశాలలో పిల్లలపై లైంగిక వేధింపులను అంచనా వేస్తూ.. దక్షిణాసియాలో బాలికలపై లైంగిక హింస రేటు బంగ్లాదేశ్ లో 9.3 శాతం నుంచి భారత్ లో 30.8% వరకూ ఉందని నివేదిక తెలిపింది.