Begin typing your search above and press return to search.

సవాలు చేస్తే.. ముఖ్యమంత్రే.. ఎన్టీఆర్ నుంచి రేవంత్ వరకు!

ప్రజాస్వామ్యానికి ఒక అందం ఉంది. రాజరికంలో ప్రశ్నించినా.. సవాలు విసిరినా ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

By:  Tupaki Desk   |   9 Dec 2023 5:30 PM GMT
సవాలు చేస్తే.. ముఖ్యమంత్రే.. ఎన్టీఆర్ నుంచి రేవంత్ వరకు!
X

ప్రజాస్వామ్యానికి ఒక అందం ఉంది. రాజరికంలో ప్రశ్నించినా.. సవాలు విసిరినా ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాఅని మనకున్న ప్రజాస్వామ్యంలోనూ.. అందునా ఇప్పుడున్నరాజకీయ వాతావరణంలో సవాలు విసిరితే కష్టాల్ని కోరి కొనితెచ్చుకున్నట్లే. అయినప్పటికీ కొందరు అధినేతలు మాత్రం అందుకు భిన్నంగా.. తమకు ఎదురయ్యే సవాళ్లను.. కేసుల్ని.. ఆంక్షల్ని అధిగమించి పోరాడుతుంటారు. సాహసం చేయరా డింభకా.. రాజకుమారి వరిస్తుందన్నట్లుగా.. సాహసం చేసిన నేతలకు అధికార దండం వరిస్తుందన్న విషయం మరోసారి నిరూపితమైంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికకావటం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను చూస్తే.. అప్పుడెప్పుడో ఎన్టీవోడు నుంచి ఇప్పటి రేవంతన్న వరకు.. సవాలు విసిరినోళ్లకు సీఎం పదవి లభించటం కనిపిస్తుంది. అప్పట్లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్నకాంగ్రెస్ ను ప్రశ్నించి.. ఇందిరమ్మకు సవాలు విసిరి మరీ.. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిద్ర లేపిన ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారాన్ని సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత.. ఆ స్థాయిలో విపక్షంతో పాటు.. సొంత పార్టీ నేతలతోనూ పోరాడి.. సవాళ్లు విసిరి మరీ అధికారాన్ని సొంతం చేసుకున్న మహానేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలుస్తారు. తన తండ్రి మరణం వేళ.. అధికారం తనకు ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వని సోనియాగాంధీని ప్రశ్నించటమే కాదు.. ఆమెపై పోరాడి.. సొంతంగా పార్టీ పెట్టి అధికారాన్ని సొంతం చేసుకున్న ఘనత వైఎస్ కొడుకు వైఎస్ జగన్ కు ఉందని చెప్పాలి.

ఇక.. కేసీఆర్ ప్రస్థానమే వేరు. రాజకీయపార్టీ నేతగా సుపరిచితుడైన ఆయన.. ఉన్నట్లుండి ఉద్యమ నేతగా మారటమే కాదు.. సవాలు విసిరి మరీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా సొంతంగా పార్టీ పెట్టటమేకాదు.. ఢిల్లీ దిగి వచ్చేలా చేసి తన డిమాండ్ కు తగ్గట్లే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించే వరకు విశ్రమించలేదు. ఇందుకు బహుమతిగా తెలంగాణ ప్రజలు ఒకసారికాదు రెండుసార్లు అధికారాన్ని చేతికిచ్చారు.

ఇక.. రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. పోరాటమే పరమావధిగా చేసుుకొని.. రాజకీయాల్లో ఉండే అన్ని కళలు తనకు సొంతమన్నట్లుగా వ్యవహరించే ఆయన్ను.. అడ్డంగా బుక్ చేసి.. రాజకీయ సమాధి కట్టే ప్రయత్నం చేసినా.. ఫెమ్లింగ్ పక్షి మాదిరి.. మొత్తం అయిపోయిందనుకున్న దగ్గర నుంచి కొత్తగా మొదలు పెట్టి.. కాంగ్రెస్ లోకి చేరిన రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడేలా చేయటమేకాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారు. వీరందరిని చూసినప్పుడు.. వీరందరిలో కామన్ ఫ్యాక్టర్ ఒక్కటే కనిపిస్తుంది. అదే.. సవాలు విసరటం.. సమస్యకు ఎదురెళ్లటం. దీనికి తోడు అంతులేని దూకుడు. అందుకే వారంతా ముఖ్యమంత్రులు అయ్యారని చెప్పాలి.