Begin typing your search above and press return to search.

పరువు పట్టించుకోని పెద్ద మనిషి.. సీఎం పదవి వస్తే చాలా?

వయసు రాగానే సరిపోదు. అందుకు తగ్గట్లు హుందాగా వ్యవహరించాల్సి వస్తుంది. తనకు తెలియని ముఖ్యమంత్రి పదవి కూడా కాదు

By:  Tupaki Desk   |   28 Jan 2024 6:30 AM GMT
పరువు పట్టించుకోని పెద్ద మనిషి.. సీఎం పదవి వస్తే చాలా?
X

వయసు రాగానే సరిపోదు. అందుకు తగ్గట్లు హుందాగా వ్యవహరించాల్సి వస్తుంది. తనకు తెలియని ముఖ్యమంత్రి పదవి కూడా కాదు. కానీ.. ఆ పదవి కోసం ఆయన అనుసరిస్తున్న విధానాల్ని.. వేస్తున్న కుప్పిగంతులు చూస్తే.. ఈ పెద్ద మనిషికి ఇంత దిగజారుడుతనమా? అన్న భావన కలుగుతుంది. ఇదంతా బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురించే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆర్జేడీ.. కాంగ్రెస్.. వామపక్షాలతో కూడిన మహాఘట్ బంధన్ సంకీర్ణ సర్కారు సాగుతున్న విషక్ష్ం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ గుడ్ బై చెప్పేసి.. పాత మిత్రుడు బీజేపీతో జట్టు కట్టటంతో ఎన్డీయే కూటమి చేతికి అధికారం రావటం ఖాయమని తేలుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అధికార బదిలీ కోసం నితీశ్ ఆడుతున్న ఆట కీలక దశకు చేరుకుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన సమావేశం ఒకటి నిర్వహిస్తున్నారు. బీజేపీ.. జేడీయూ.. జితిన్ రాం మాంఝీ నాయకత్వం లోని హిందూస్తాన్ అవామీ లీగ్ పార్టీలు సమావేశమై.. తమ నాయకుడిగా నితీశ్ ను ఎన్నుకుంటాయి. వెంటనే ఆయన గవర్నర్ ను కలిసి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారు. అనంతరం ఎన్డీయే పక్షాల మద్దతు లేఖలు గవర్నర్ కు పంపుతారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాన్ని ఇవ్వాలని కోరతారు.

ఉదయం రాజీనామా చేసిన చేత్తోనే.. సాయంత్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీయే సారథ్యంలో ఏర్పడే ఎన్డీయే ప్రభుత్వంలో నితీశ్ ముఖ్యమంత్రి అయితే.. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మాంఝీకి రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఆదివారం అయినప్పటికీ విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లిన వైనం చూస్తే.. ప్రమాణస్వీకారం.. ఆ తర్వాత పరిణామాలకు సిద్దంగా సిబ్బంది ఉండేందుకు వీలుగా ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. మహా ఘట్ బంధన్ లోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్.. ఆర్జేడీలు ప్రభుత్వాన్ని నిలుపుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నితీశ్ చర్యను ఆ పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు. తమ నాయకుడు నితీశ్ ను కాంగ్రెస్ పదే పదే అవమానించిందని.. అందుకే ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చొరవ తీసుకొని.. బిహార్ సీఎం నితీశ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. బిజీగా ఉండటం కారణంగా మాట్లాడటానికి వీలు కావట్లేదని సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో.. బిహార్ లో తదుపరి ప్రభుత్వం ఎన్డీయే హయాంలో ఏర్పాటు కానుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద మనిషిగా పేరున్న నితీశ్.. తన ముఖ్యమంత్రి పదవి కోసం ఇన్ని కుప్పిగంతులు వేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఉదయం వేళలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. సాయంత్రానికి వేరే పార్టీ మద్దతుతో మళ్లీ సీఎం పదవికి ప్రమాణస్వీకారం చేయటం చూస్తే.. అధికారం కోసం విలువలు అన్నవి పట్టించుకోకుండా ఎంతకైనా సరే అన్నట్లుగా వ్యవహరించటం ఏమిటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.