Begin typing your search above and press return to search.

నా వయసు డెబ్బయ్యేళ్ళు... కేసీయార్ మన్ కీ బాత్...!

రెండు సార్లు తెలంగాణాలో అధికారం ఇచ్చి సీఎం ని కూడా చేసింది. ఇక కేసీయార్ మూడవ సారి కూడా గెలవాలని చూస్తున్నారు

By:  Tupaki Desk   |   26 Nov 2023 3:55 PM GMT
నా వయసు డెబ్బయ్యేళ్ళు... కేసీయార్ మన్ కీ బాత్...!
X

కేసీయార్ ఏది మాట్లడినా సబ్జెక్ట్ మీదనే ఉంటుంది. ఆయన బోళాగా ఏదీ మాట్లాడరు. గంటల తరబడి స్పీచ్ ఇచ్చినా అందులో పాయింట్లే ఉంటాయి తప్ప సోది ఏదీ అసలు ఉండదు. ఇక కేసీయార్ తన గురించి అంటే వ్యక్తిగతం గురించి చెప్పుకున్నది తక్కువ. ఆయన గురించి జనాలు మీడియా ద్వారా తెలుసుకోవాల్సిందే. అలాగే కేసీయార్ లో ఆత్మ విశ్వాసం ఎక్కువ. ఆయన ధీమాయే తెలంగాణాను తెచ్చింది

రెండు సార్లు తెలంగాణాలో అధికారం ఇచ్చి సీఎం ని కూడా చేసింది. ఇక కేసీయార్ మూడవ సారి కూడా గెలవాలని చూస్తున్నారు. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉన్న కేసీయార్ లో గత రెండు దశాబ్దాలో ఎన్నడూ చూడని కొత్త పోకడలు ఇపుడు కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఆయన తెలంగాణా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ చాలానే చెప్పేశారు. ముఖ్యంగా భయం కొంత కలవరం కొంత ఆయన ప్రసంగాలలో తెలియకుండానే దొర్లుతున్నాయని అంటున్నారు ఆ మధ్యన ఆయన ఒక సభలో మాట్లాడుతూ ఓడితే ఇంట్లో కూర్చుంటాం, నాకేంటి నష్టం అన్నారు. ఆ తరువాత కూడా అనేక సభలలో మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయని ఆగం కావద్దు. ప్రతిపక్షాల మాటలను విని మోసపోవద్దు అని హెచ్చరించారు.

మరింత ముందుకు వెళ్ళి ఇపుడు కేసీయార్ ఏకంగా తన గురించి చెప్పుకున్నారు. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు అని ఆయన అంటున్నారు. నా వయసు ఇపుడు డెబ్బై ఏళ్ళు. తెలంగాణా రాష్ట్రం తెచ్చాను అన్న పేరు ఆకాశమంత ఉంటుంది. దాని కంటే ఈ పదవులూ పేర్లూ నాకు ఎక్కువ కాదు అని ఆయన తన మన్ కీ బాత్ ని జనాలకు వినిపించారు.

తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రిగా పదేళ్ళ పాటు ఉన్నాను. నా కంటే ఎవరూ ఎక్కువగా పాలించలేదని కూడా ఆయన అంటున్నారు. నాకు ఏమీ లేదు అన్న బాధ లేదు. అయితే తెలంగాణాను కొట్లాడి తెచ్చుకున్నాం, ఇంకా చేయాల్సినవి చాలానే ఉన్నాయని కేసీయార్ అంటున్నారు. కేరళ మాదిరిగా మొత్తం నూరు శాతం అక్షరాస్యత సాధించడమే నా లక్ష్యం అన్నారు. పేదలను అందరినీ ధనవంతులను చేసి రాష్ట్రాన్ని సంపన్నంగా చేయాలన్నది నా కోరిక అంటూ తన గురించి చెప్పుకున్నారు.

తనకు అవసరం ఏదీ లేదు ప్రజల కోసమే తాను మళ్ళీ అధికారం కోరుతున్నాను అని కేసీయార్ అంటున్నారు. సరిగ్గా ఇదే మాటను 2019 ఎన్నికల వేళ ఏపీలో చంద్రబాబు కూడా అన్నారు. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు అని కూడా నాడు చెప్పారు, నేడూ చెబుతున్నారు. ప్రజల కోసమే అంటున్నారు. మరి ప్రజలు చంద్రబాబుని ఓడించేశారు.

ఇక తెలంగాణాలో కేసీయార్ కూడా మెల్లగా చంద్రబాబు ధోరణిలోనే స్పీచ్ ఇస్తున్నారు. ఆ మధ్య దాకా కనిపించిన అతి విశ్వాసం స్థానంలో ఇపుడు కొంత కలవరం కనిపిస్తోంది అని అంటున్నారు. ఓటమి అన్న మాటలు ఆయన నోటి వెంట వచ్చాయి. ఇపుడు నాకు కాదు మీ కోసమే అధికారం అంటున్నారు. తన వయసుని కూడా ఆయన జనం ముందు ఉంచారు. మరి డెబ్బై ఏళ్ల కేసీయార్ కి ఈ వయసులో సీఎం పదవి భారమా లేక అనుభవమా అన్నది జనాలు ఆలోచించి తీర్పు చెబుతారు అని అంటున్నారు

భారత రాజకీయ వ్యవస్థలో అయితే వయసు అన్నది ఎపుడూ పదవులకు అడ్డంకి కాదు, ప్రస్తుత ప్రధాని వయసు కూడా ఏడు పదులు దాటింది. ఏపీలో చంద్రబాబు కూడా కేసీయార్ కంటే పెద్ద వారే. కాబట్టి నాకు ఏడు పదులు నిండాయి నిండు జీవితం నాది ఇక అంతా మీ కోసమే అని కేసీయార్ చెబుతున్న మాటల వెనక ఆయన ఆలోచనలను జనాలు అర్ధం చేసుకుని అధికారం మూడవసారి ఇస్తారా లేదా అన్నది మరి కొద్ది రోజులలో తేలిపోనుంది.