Begin typing your search above and press return to search.

కామారెడ్డిలో కేసీయార్ ని కలవరపెడుతున్నదేంటి....?

ఇవన్నీ పక్కన పెడితే కామారెడ్డిలో బీయారెస్ బలం ఎంత ప్లస్సులు ఏమిటి, మైనస్సులు ఏమిటి అన్న చర్చ సాగుతోంది

By:  Tupaki Desk   |   10 Nov 2023 1:50 AM GMT
కామారెడ్డిలో కేసీయార్ ని కలవరపెడుతున్నదేంటి....?
X

కేసీయార్ గజ్వేల్ నుంచి కామారెడ్డి వైపు చూస్తున్నారు. రెండు పర్యాయాలు మంచి మెజారిటీతో ఆదరించిన గజ్వేల్ ని ఆయన ఒక వైపు ఉంచుకుంటూనే కామారెడ్డి మీద కూడా ఎందుకు దృష్టి సారించారు అన్నదే పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది. గజ్వేల్ లో జనంలో కొంత అసంతృప్తి ఉందని అందుకే అక్కడ ఎందుకు రిస్క్ అని సేఫ్ జోన్ అన్నట్లుగా కామారెడ్డి వైపు చూస్తున్నారు అని కూడా అంటున్నారు.

అయితే కామారెడ్డిలో ఏ కాంగ్రెస్ క్యాండిడేట్ నో పోటీ చేస్తారు అనుకున్నారు. కానీ ఇపుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బరిలోకి దించింది.దాంతో కేసీయార్ కామారెడ్డిని ప్రతిష్టగా తీసుకున్నారు. కామారెడ్డిలో గెలుపు కచ్చితం కావాలి. అంతే కాదు మెజారిటీ కూడా అదిరిపోవాలి.

ఇదీ కేసీయార్ పట్టుదలగా ఉంది. అందుకే నామినేషన్ రోజున ఆయన కామారెడ్డిలో మీటింగ్ పెట్టి మరీ బీయారెస్ సత్తా చూపించారు. ఇక రానున్న కాలమంతా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ కామారెడ్డిలో పాగా వేయాలని అనుకుంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే కామారెడ్డిలో బీయారెస్ బలం ఎంత ప్లస్సులు ఏమిటి, మైనస్సులు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. ప్లస్సులు అంటే 2012 నుంచి చూస్తే మూడు సార్లు బీయారెస్ గెలిచింది.ఇక కామారెడ్డిలో కాంగ్రెస్ కి బలం ఉంది, కానీ 2004 నుంచి ఆ పార్టీ అక్కడ గెలవడం లేదు.అంటే కాంగ్రెస్ గెలిచి రెండు దశాబ్దాలు అయింది అన్న మాట.

అదే టైం లో 2009లో టీడీపీ గెలిచింది. 2012 ఉప ఎన్నికల్లో బీయారెస్, 2014, 2019లలో గెలుస్తూ వస్తోంది. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న గంప గోవర్ధన్ బీయారెస్ లోకి ఫిరాయించడంతో అక్కడ విజయం సాధ్యపడుతోంది. ఇక ఈసారికి చూస్తే టీడీపీ సానుభూతిపరులు అన్నవారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు అని అంటున్నారు. గంప గోవర్ధన్ నాలుగు సార్లు గెలిచారు. ఆయన మీద ఉన్న అసంతృప్తి బీయారెస్ తొమ్మిదిన్నరేళ్ల పాలన మీద అసంతృప్తి అంతా కేసీయార్ మీదకు టర్న్ అవుతుంది అని అంటున్నారు.

దీంతో కేసీయార్ పూర్తి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీలో ఏమి జరుగుతోంది, ఎదుటి పార్టీలో పరిస్థితి ఎలా ఉంది అన్నది గమనిస్తున్నారు. ఇక బీయారెస్ లో వర్గ పోరు అయితే తారస్థాయిలో ఉంది అని కేసీయార్ గ్రహించారు.

కామారెడ్డిలోని బీయారెస్ లో రెండు వర్గాలు ఢీ కొడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో స్థానికంగా కొందరు నేతలు విబేధిస్తున్నారు. అలా పార్టీలో రెండు వర్గాలు ఆధిపత్యం కోసం కొట్లాటకి బాహాటంగా దిగుతున్నాయి.

దీంతో బీయారెస్ షాక్ తింటోంది. పోటీ చేస్తున్నది సాక్ష్తాత్తూ కేసీయార్. పార్టీ అధినాయకుడు. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. ఇలాంటి నేపధ్యంలో సొంత పార్టీలో వర్గ పోరు తీవ్రంగా ఉంటే ఎలా అని మదనపడుతున్నారు. కేసీయార్ తానుగా పోటీలోకి దిగుతున్నానని ప్రకటించినా వర్గాలు ఒక్కటి కాకపోవడమే ఇపుడు కేసీయార్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోందిట.

దీంతో కేసీయార్ స్వయంగా జోక్యం చేసుకుంటున్నారు. బీయారెస్ కి చెందిన కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాలపై కేసీఆర్ పార్టీ నేతలను నిలదీశారు. పార్టీ క్రమశిక్షణను ఎవరూ కూడా ఉల్లంఘించవద్దని ఆయన కోరారు. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు.

నిజానికి కేసీయార్ కామారెడ్డిలో పోటీకి దిగడానికి వ్యూహం కూడా బీయారెస్ కి పట్టు పెంచడమే అంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్టీ బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా కేసీఆర్ ఈ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా కేసీయార్ అనుకున్న తీరులో నిజమాబాద్ మొత్తం సంగతి పక్కన పెడితే కామారెడ్డి ఇపుడు సవాల్ గా మారుతోందా అన్నదే చర్చగా ఉంది.