Begin typing your search above and press return to search.

రాజ్యంగమే సుప్రీం.. రాష్ట్రపతి లేఖ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు

దేశంలో ఏ వ్యవస్థా గొప్పది కాదని, భారత రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   19 May 2025 12:07 PM IST
రాజ్యంగమే సుప్రీం.. రాష్ట్రపతి లేఖ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు
X

దేశంలో ఏ వ్యవస్థా గొప్పది కాదని, భారత రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాలుగా శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు పనిచేయాలని, ఆ మూడు సమానమేనని ఆయన స్పష్టం చేశారు. పరస్పరం గౌరవం, ఇచ్చిపుచ్చుకొనే విధానంలో కీలకమైన మూడు వ్యవస్థలు పనిచేయాలని సీజేఐ అభిప్రాయపడ్డారు.సుప్రీంకోర్టు అధికార పరిధిని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల లేఖ రాసిన నేపథ్యంలో చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నట్లు భావిస్తున్నారు. అదే సమయంలో న్యాయవ్యవస్థ తన అధికార పరిధిని అతిక్రమిస్తోందని జరుగుతున్న చర్చపైనా సీజేఐ వ్యాఖ్యలు ప్రభావం చూపనున్నాయని అంటున్నారు.

ఈ నెల 14న సుప్రీం సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ బీఆర్ గవాయ్ తొలిసారిగా తన సొంత రాష్ట్రం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. అక్కడ బార్ కౌన్సిల్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపం జోలికి అది వెళ్లడానికి వీల్లేదన్నారు. ‘‘రాజ్యాంగం సర్వోన్నత అధికారం, చట్టపాలన, న్యాయవ్యవస్థకు ఉన్న స్వేచ్ఛ వంటివాటిని రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు సవరించడం గానీ, రద్దు చేయడం గానీ చేయజాలదు. రాజ్యాంగ మౌలిక నిర్మాణం దృఢమైనది. దాని మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు మూడు సమానమే. కలిసిమెలిసి పనిచేయాలి’’ అంటూ చీఫ్ జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.

రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో తాను సీజేఐగా బాధ్యతలు స్వీకరించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని మూడు స్తంభాలు తమ తమ పరిధులకు లోబడి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. శాసన, న్యాయవ్యవస్థలు చేసిన పలు చట్టాల కారణంగానే సామాజిక-ఆర్థిక న్యాయం భావన నెరవురుతుందని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు.

చట్టసభలు పంపిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట కాలపరిమితికి లోబడి ఆమోదించాల్సిందేనని 142వ అధికరణ కింద తనకు సంక్రమించిన అధికారాన్ని వినియోగించి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇటీవల చరిత్రాత్మక తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీన్ని ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్ తీవ్రంగా విమర్శించారు. ఇంకోవైపు రాష్ట్రపతిని సైతం నిర్దేశించే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉందా? రాష్ట్రపతి లేదా గవర్నర్ తమ విధుల నిర్వహణలో ఏ కోర్టుకూ జవాబుదారీ కాదని రాజ్యాంగంలోని 361వ అధికరణం చెబుతోందని, 201వ అధికరణ కింద విచాక్షణాధికారాలు ఉన్న రాష్ట్రపతికి న్యాయస్థానాలు గడువు నిర్దేశించవచ్చా? తదితర 14 ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల సుప్రీంకోర్టును వివరణ కోరిన విషయం తెలిసిందే. ఇది కోర్టును ధిక్కరించడమేనంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా, 142వ అధికరణపై జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.