ప్రీ వెడ్డింగ్ షూట్‌లపై సామాజిక యుద్ధం.. ఛత్తీస్ గఢ్ లో నుంచి మొదలవుతుందా?
ఒకప్పుడు పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య బంధం, సంప్రదాయం, పెద్దల ఆశీర్వాదం. వారం రోజులు ఉండే పెళ్లి గ్రామాల్లో పండగలను తలపించేవి.
By: Tupaki Desk | 23 Jan 2026 12:25 PM ISTఒకప్పుడు పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య బంధం, సంప్రదాయం, పెద్దల ఆశీర్వాదం. వారం రోజులు ఉండే పెళ్లి గ్రామాల్లో పండగలను తలపించేవి. ఇప్పుడు అదే పెళ్లి.. కెమెరా యాంగిల్స్, డ్రోన్ షాట్స్, సోషల్ మీడియా రీల్స్ మధ్య ఒక ఈవెంట్‌లా మారిపోయింది. ఈ మార్పుపై తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర సామాజిక చర్చ మొదలైంది. ప్రీ వెడ్డింగ్ షూట్‌లు అనే ట్రెండ్ ఇప్పుడు అక్కడ ‘ఫ్యాషన్’ స్థాయిని దాటి ‘సామాజిక సమస్య’గా మారుతోంది.
పాశ్చాత్య పోకడల ప్రభావం, సోషల్ మీడియా మోజు కలిసి పెళ్లిని ఒక ప్రదర్శనగా మార్చేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పెళ్లికి ముందు కేవలం ఫొటోలు, వీడియోల కోసమే రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకూ ఖర్చు చేయడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు సామాజిక సంస్థలు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలపై ఇది తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోంది. ఆవేదన వ్యక్తమవుతోంది. ఒకరిని చూసి మరొకరు పోటీ పడడం, ‘మన పెళ్లి కూడా వైరల్ కావాలి’ అన్న మానసికత పెరిగిపోవడం వల్ల పెళ్లిళ్లు ఆనందానికి బదులు ఒత్తిడిగా మారుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. అప్పులు చేసి, అవసరం లేని ఖర్చులు పెట్టి, ఆ తర్వాత జీవితాన్ని అప్పుల బరువుతో ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తోందని సామాజిక పెద్దలు హెచ్చరిస్తున్నారు.
కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న కుల సంఘాలు..
ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని కుల సంఘాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమ సామాజిక వర్గాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు సాహు, కుంబీ, ధంగర్, సిక్కు వంటి పలు సమాజాల నేతలు ప్రకటించారు. “ఇవి మన సంప్రదాయాలకు, మర్యాదలకు విరుద్ధం” అంటూ వారు స్పష్టంగా చెబుతున్నారు. పెళ్లి అనేది పవిత్రమైన బంధం తప్ప, సోషల్ మీడియా కంటెంట్ కాదన్నది వారి వాదన.
హెచ్చరిస్తున్న మహిళా కమిషన్..
మహిళా కమిషన్ మరో కోణాన్ని చర్చలోకి తెచ్చింది. ప్రీ వెడ్డింగ్ షూట్‌లలో తీసిన ఫొటోలు, వీడియోలు భవిష్యత్తులో విడాకుల వంటి పరిస్థితులు వస్తే సోషల్ మీడియాలోకి రావడం ద్వారా మహిళల గౌరవానికి, భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతోందని హెచ్చరించింది. ఒకసారి ఇంటర్నెట్‌లోకి వెళ్లిన కంటెంట్‌ను పూర్తిగా తొలగించడం చాలా వరకు సాధ్యం కాదు.. ఈ వాస్తవాన్ని యువత ముందుగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తోంది.
ఇక్కడ తలెత్తే ప్రశ్న ఒక్కటే..
ప్రీ వెడ్డింగ్ షూట్‌లు చేసుకోవడం తప్పు కాదు. కానీ అవి తప్పనిసరి అన్న భావన, సామాజిక ఒత్తిడి, ఆర్థిక హద్దులు దాటడం, గౌరవం–భద్రత అంశాలను విస్మరించడం అసలు సమస్య. సంప్రదాయాన్ని పూర్తిగా వదిలేసి, ఆడంబరాన్ని ఆచరించడం వల్లే ఈ సంఘర్షణ మొదలైంది. మరో వైపు యువత వాదన కూడా ఉంది. ‘ఇది మా వ్యక్తిగత స్వేచ్ఛ. మా జీవితంలోని ప్రత్యేక క్షణాలను మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకుంటాం’ అని వారు అంటున్నారు. ఈ వాదనను పూర్తిగా కొట్టిపారేయలేం. కానీ వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక బాధ్యత రెండింటి మధ్య సమతౌల్యం అవసరమన్నదే అసలు చర్చ.
ఈ ‘సామాజిక యుద్ధం’ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. పెళ్లి అనే వ్యవస్థ మళ్లీ తన మూలాలకు తిరిగి చూడాల్సిన సమయం వచ్చింది. ఆడంబరాల కోసం అప్పులు, లైక్స్ కోసం జీవితాలను తాకట్టు పెట్టే పరిస్థితి ఎవరికి అవసరం? ఆనందం ఫిల్టర్లలో కాదు.. సంబంధాల్లో ఉండాలి.
ఛత్తీస్‌గఢ్‌లో మొదలైన ఈ చర్చ త్వరలోనే దేశవ్యాప్తంగా వినిపించే అవకాశం ఉంది. ప్రీ వెడ్డింగ్ షూట్లను పూర్తిగా నిషేధించాలా? లేక బాధ్యతతో, పరిమితులతో అనుమతించాలా? అన్న ప్రశ్నకు సమాధానం ఒక్కో కుటుంబం, ఒక్కో సమాజం తన విలువల ఆధారంగా నిర్ణయించుకోవాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం ఖాయం పెళ్లి ఫోటోకోసం కాదు, నూరేళ్లు కలిసి జీవించేందుకు అని తెలుసుకోవాలి..
