Begin typing your search above and press return to search.

16 ఏళ్ల బాలుడిపై 25 ఏళ్ల వివాహిత లైంగికదాడి.. పోక్సో కేసు నమోదు..

ఈ వార్త విన్న తర్వాత సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా..? అన్న సందేహం కలుగకమానదు.

By:  Tupaki Political Desk   |   15 April 2026 10:18 AM IST
16 ఏళ్ల బాలుడిపై 25 ఏళ్ల వివాహిత లైంగికదాడి.. పోక్సో కేసు నమోదు..
X

ఈ వార్త విన్న తర్వాత సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా..? అన్న సందేహం కలుగకమానదు. సమాజంలో మనం ఇప్పటి వరకు అనుకుంటున్న కొన్ని నమ్మకాలు పూర్తిగా తలకిందులయ్యాయి. సాధారణంగా మైనర్ల భద్రత మరింత ఆందోళనలో పడింది. ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన చూస్తుంటే.. మగపిల్లలు కూడా ఎంతటి ప్రమాదంలో ఉన్నారో అర్థం అవుతుంది. 25 ఏళ్ల వివాహిత, 16 ఏళ్ల మైనర్ బాలుడిని లైంగికంగా, మానసికంగా వేధించడం దారుణమైన విషయం.

మహిళపై పోక్సో కేసు..

ప్రస్తుత ఆధునిక సమాజంలో నేరాలకు లింగభేదం లేదని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. మైనర్ బాలికలను వేధింపుల నుంచి రక్షించడానికి తీసుకువచ్చిన 'పోక్సో' చట్టం, మైనర్ బాలుర రక్షణకు కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తుందని ఈ కేసు చాటి చెప్పింది. 25 ఏళ్ల యువతి.. 16 ఏళ్ల బాలుడిని తన కామవాంఛ కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ, అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

హోటల్ గదులకు తీసుకెళ్లి..

సదరు యువతి పెళ్లికి ముందే ఆ బాలుడితో పరిచయం ఉంది. అయితే, ఆమె వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆ బాలుడిని వదిలిపెట్టలేదు. అతనితో లైంగిక సంబంధం కొనసాగించాలని, లేదంటే ఇద్దరి మధ్య ఉన్న పాత విషయాలను బయటపెడతానని లేదా కేసులు వేసి ఇబ్బందుల్లోకి నెడతానని మానసికంగా ఒత్తిడి చేసేది. హోటల్ గదులకు పిలిపించి, లైంగిక వాంచ కోసం అతడిని వాడుకుంది.

పోలీసుల రంగప్రవేశం!

నిరంతరం సాగిన ఈ లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి కారణంగా ఆ బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఏం జరుగుతుందో ఎవరికీ చెప్పుకోలేక, లోలోపలే కుమిలిపోవడంతో అతని ఆరోగ్యం క్షీణించింది. చివరికి తట్టుకోలేక, విషయాన్ని పోలీసులకు వివరించాడు. ఫిర్యాదు అందిన వెంటనే కబీర్‌ధామ్ పోలీసులు రంగంలోకి దిగారు. మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు సదరు యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంది.

ఈ కేసులో మరో కీలకమైన అంశం ‘సోషల్ మీడియా’. సదరు యువతి సోషల్ మీడియా ద్వారా బాలుడితో నిరంతరం టచ్‌లో ఉంటూ.., అతడిని తన మాయలో పడేసింది. మైనర్ల ఆలోచనా విధానం సున్నితంగా ఉంటుందని గమనించిన ఆమె, డిజిటల్ మాధ్యమాలను వాడుకొని అతడిని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారు..? ఎవరితో మాట్లాడుతున్నారు..? అనే విషయాలపై నిఘా ఉంచకపోతే ఎలాంటి విపరీత పరిణామాలు తలెత్తుతాయో చెప్పడానికి ఈ ఘటనే సాక్ష్యం.

‘అబ్బాయి జాగ్రత్త’ అని కూడా చెప్పాలి..

సాధారణంగా మన సమాజంలో ‘అమ్మాయి జాగ్రత్త!’ అని చెబుతుంటాం. కానీ అబ్బాయిలు కూడా వేధింపులకు గురయ్యే అవకాశం లేకపోలేదన్న నిజాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అబ్బాయిలపై ఇలాంటి దాడులు జరిగినప్పుడు వారు బయటకు చెప్పుకోవడానికి ఆడవారి కంటే ఎక్కువగా సిగ్గుపడతారు. దీనివల్ల నేరస్థులు మరింతగా రెచ్చిపోతుంటారు. ఈ ఘటన తర్వాత ఆ బాలుడు ఎదుర్కొంటున్న మానసిక క్షోభ వర్ణనాతీతం. అతనికి కౌన్సెలింగ్, వైద్య నిపుణుల సాయం అందించాలని నెటిజన్లు కోరుతున్నారు.

ఈ కేసులో యువతి అరెస్టు ఒక హెచ్చరిక లాంటిది. నేరస్తుడు ఎవరైనా కావచ్చు.. అది పురుషుడైనా, మహిళ అయినా.. మైనర్లపై జరిగే ఎలాంటి దాడిని చట్టం సహించదు. తల్లిదండ్రులు తమ కుమారులు, కుమార్తెలు ఇద్దరితోనూ స్నేహపూర్వకంగా ఉంటూ, వారికి 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్' గురించి, డిజిటల్ ప్రపంచంలోని ప్రమాదాల గురించి వివరించాలి. బాలుర విషయంలో కూడా సమాజం తన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.