Begin typing your search above and press return to search.

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. ఒకే సారి రికార్డు స్థాయిలో లొంగుబాటు

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బుధవారం ఒకేసారి 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో వీరంతా జనజీవన స్రవంతిలో కలిశారు.

By:  Tupaki Desk   |   24 Sept 2025 7:10 PM IST
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. ఒకే సారి రికార్డు స్థాయిలో లొంగుబాటు
X

దేశంలో వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను ఏరివేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరికలు పనిచేస్తున్నట్లే కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టుల ఏరివేత చురుగ్గా సాగుతుండగా, మరోవైపు ప్రాణభయంతో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. కొద్ది రోజులుగా మావోయిస్టు పార్టీలో ఉద్యమం కొనసాగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ ఎన్కౌంటర్ తర్వాత ఉద్యమం మరింత బలహీనపడిందని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్దసంఖ్యలో మావోయిస్టులు ప్రభుత్వానికి సరెండర్ అవుతున్నారు.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బుధవారం ఒకేసారి 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో వీరంతా జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన వారిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరిలో 30 మందిపై ఏకంగా రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా దగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వివరించారు.

మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో లొంగిపోవడం తప్ప వారికి మరో మార్గం కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో చాలా మందికి గతంలో పలు విధ్వంసక కార్యకలాపాల్లో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే మావోయిస్టులు హింసాత్మక విధానాలను వదిలేసేలా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నందున.. లొంగిపోయిన వారిపై ఎలాంటి చర్యలు ఉండవని వెల్లడించారు.

విప్లవ జీవితాన్ని వదిలి జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు చూపుతామని పోలీసులు ప్రకటించారు. వచ్చే మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం ప్రకటించింది. దండకారుణ్యంలో భారీగా బలగాలను మోహరించి ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. బలగాల ప్రత్యేక ఆపరేషన్లతో మావోయిస్టులు చెల్లాచెదరయ్యారు. ఇప్పటివరకు కొన్ని వందల మంది గత ఏడాది కాలంలో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనట్లు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు కూడా విగతజీవులు అవుతున్నారు.

మావోయిస్టులకు పట్టున్నట్లు చెప్పిన ప్రాంతాల్లోనూ బలగాలు పాగా వేశాయి. వారిని తరిమికొట్టాయి. దీంతో చాలామంది అడవులను వదిలేస్తున్నారు. అజ్ఞాత జీవితాన్ని ముగించి జన జీవన స్రవంతిలో కలుస్తామని పోలీసులకు లొంగిపోతున్నట్లు చెబుతున్నారు. ఇక మావోయిస్టు కేంద్ర కమిటీలో కూడా ఈ లొంగుబాట్లు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యురాలు ఒకరు లొంగిపోగా, పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.