బ్లడ్ క్యాన్సర్ భయపెడుతున్నా టెన్త్ లో స్టేట్ ఫస్ట్!
ఛత్తీస్ గఢ్ సెంకడరీ బోర్డు పరీక్షల్లో 99.17 శాతం మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది.
By: Tupaki Desk | 11 May 2025 10:31 AM ISTప్రాంతంతో సంబంధం లేకుండా కొన్ని అంశాలు ఇట్టే కనెక్టు చేస్తాయి. ఈ బాలిక గురించి తెలిసిన వారు ఎవరైనా అయ్యో పాపం అనుకోకుండా ఉండలేరు. చిన్నవయసులో పెద్ద కష్టం వచ్చి పడినా.. అనారోగ్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. ఈ చదువుల తల్లి మాత్రం చదవు మీద తన ధ్యాసను తగ్గించలేదు. బ్లడ్ క్యాన్సర్ బాధ పెడుతున్నప్పటికీ.. ఆ బాధను అదిమి పట్టి మరీ.. పదో తరగతి పరీక్షలు రాసి.. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచిన ఉదంతం అందరిని ఇట్టే కనెక్టు అయ్యేలా చేస్తోంది.
ఓవైపు ప్రాణాంతక వ్యాధి సవాలు చేస్తున్నా.. చదువులో తగ్గని ఆ టీనేజ్ బాలిక పేరు ఇషికా. చత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాకు చెందిన ఆమె.. బ్లడ్ క్యాన్సర్ కారణంగా ఏడాది పాటు చదువుకు దూరమైంది. తల్లిదండ్రులు ప్రోత్సహించటంతో మళ్లీ చదవటం మొదలు పెట్టింది. తాజా జరిగిన పదో తరగతి బోర్డు పరీక్షల్లో రాసి.. తన సత్తా ఏమిటో చూపే ప్రయత్నం చేసింది.
ఛత్తీస్ గఢ్ సెంకడరీ బోర్డు పరీక్షల్లో 99.17 శాతం మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఐఏఎస్ కావాలన్నది తన కలగా ఆమె చెబుతోంది. సామాన్య రైతు అయిన ఇషికా తండ్రి.. ఆమె బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటివరకు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ప్రాణాంతక వ్యాధి సవాలు విసురుతున్నా తగ్గని పట్టుదలతో పరీక్ష రాసి.. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించటం చూస్తే.. వావ్ అనకుండా ఉండలేరు.
ఆమె ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన సాయాన్ని ప్రధానమంత్రి స్వాస్థ్య సహాయత యోజన కింద సాయం అందేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చదువుల తల్లి కోసం సర్కారు.. మనసున్న పెద్దలు స్పందిస్తే.. ఆమె మరింత మెరుగైన ఫలితాల్ని సాధించటమే కాదు.. క్యాన్సర్ భూతం నుంచి బయటపడే వీలుంది.
