చెవిరెడ్డి వర్సెస్ జగన్.. ఏం జరిగింది.. ?
నెల్లూరు పార్లమెంటు స్థానంలో వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది.
By: Garuda Media | 9 April 2026 10:00 PM ISTనెల్లూరు పార్లమెంటు స్థానంలో వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డికి అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. పార్టీమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై వైసీపీ అధినేత జగన్ పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో తన కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్న చెవిరెడ్డికి నెల్లూరు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే.. ఈ విషయంలో చెవిరెడ్డి విభేదిస్తున్నారని సమాచారం. తనకు అసెంబ్లీనియోజకవర్గం చాలని ఆయన కోరుతున్నట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లోనే తాను పొరపాటు చేశానని తరచుగా చెవిరెడ్డి చెబుతున్నారు. అప్పట్లో ఒంగోలు నియోజక వర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. వాస్తవానికిపార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు ఓటేయాలి. గత ఎన్నికలను గమనిస్తే.. వైసీపీ తరఫున పోటీ చేసిన నలుగురు మాత్రమే విజయం దక్కించుకున్నారు. ఈ నలుగురు స్థానికంగా ఉన్న నాయకులే. పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వారికి ప్రజలు తిరుగోమనం బాట పట్టించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి ఒంగోలులో పోటీ చేయడంతో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఒంగోలు ప్రజలు స్థానిక నాయకుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డికే పెద్దపీట వేశారు. దీంతో చెవిరెడ్డి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు కూడా ఆయనను నెల్లూరు జిల్లాకు బదిలీ చేయాలని భావిస్తుండడంతో ఆయన అధిష్టానంపై తొలిసారి ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. పైకి చెప్పలేక.. పార్టీ అనుచరుల దగ్గర తన అభిప్రాయం వెల్లడిస్తున్నారు.
తను సొంత జిల్లాలోనే ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెవిరెడ్డి అంటున్నారు. వాస్తవానికి చంద్రగిరి ఇవ్వాలని కోరుతున్నా.. కుమారుడు మోహిత్ కోసం.. దానిని వదులుకున్నారు. ఇక, జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ నియోజకవర్గాలకు అవకాశం లేకపోతే.. తను పోటీ నుంచి తప్పుకొంటానని.. కేవలం ఇంచార్జ్‌గా మాత్రమే బాధ్యతలు చేపడతానని అంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతుందన్నది చూడాలి.
