'సిట్' విచారణలో చెవిరెడ్డి రచ్చ.. నిజమెంత?
వైసీపీ సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని మద్యం కుంభకోణంలో 38వ నిందితు డి(ఏ- 38) గా పేర్కొంటూ.. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే
By: Tupaki Desk | 19 Jun 2025 3:00 AM ISTవైసీపీ సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని మద్యం కుంభకోణంలో 38వ నిందితు డి(ఏ- 38) గా పేర్కొంటూ.. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు లో మంగళవారం సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సిట్‌కు అప్పగించారు. దీం తో మద్యం కుంభకోణంలో ఆయన పాత్రపై బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు విచారించారు.
అయితే.. ఈ విచారణ సమయంలో చెవిరెడ్డి రచ్చ చేశారని.. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నించారని కథనాలు వస్తున్నాయి. అయితే.. వీటిలో నిజం ఎంత అనేది ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు స్పందిస్తూ.. తమకు సహకరించని మాట వాస్తవమేనని చెప్పారు. తాము మొత్తం 27 ప్రశ్నలు అడిగామని.. కానీ.. దేనికీ ఆయన సరైన సమాధానం చెప్పలేదని తెలిపారు.
పైగా.. తాను అన్నీ చదివిన తర్వాత... ``ఈ ప్రశ్నలకు నేనే ఆన్సర్ చేయలేదు`` అని ఇంగ్లీష్‌లో రాసి సంతకం చేశారని పేర్కొన్నారు. కాగా... ఈ మద్యం వ్యవహారంలో చెవిరెడ్డికి ఒకప్పటి డ్రైవర్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్.. మదన్ మోహన్‌రెడ్డి.. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ఆయనను కూడా సిట్ అధికారులు రెండు సార్లు విచారించారు. అప్పట్లోనూ సిట్ అధికారులకు ఆయన ఎదురు సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం డీజీపీ సమక్షంలో ఉందన్నారు.
మరోవైపు.. మద్యం కుంభకోణంలో వచ్చిన లంచాలు, ముడుపుల వ్యవహారంలో చెవిరెడ్డి కొంత మేరకు పాత్ర పోషించారన్నది సిట్ అధికారులు చెబుతున్న మాట. ఎన్నికలకు ముందు ఆయన ఈ సొమ్మును పలు నియోజకవర్గాలకు రహస్యంగా పంపిణీ చేశారని తమకు సమాచారం ఉందని అంటున్నారు. అయితే.. చెవిరెడ్డిఇలాంటి పనులు చేయరని.. ఆయనకు ఆ అవసరం లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డిని సిట్ అధికారులు ఏ-38గా పేర్కొంటూ.. విచారణకు పిలిచారు.
