విజయవాడ ఆస్పత్రిలో చేరిన చెవిరెడ్డి.. టెన్షన్ లో వైసీపీ
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియో థెరపీలో మాజీ ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
By: Tupaki Desk | 21 Jun 2025 4:01 PM ISTలిక్కర్ కేసులో అరెస్టు అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి శనివారం ఉదయం గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ముందుగా జైలులో ఉన్న వైద్యులతో ఆయనను పరీక్షించారు. ఆపై ముందస్తు జాగ్రత్తగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియో థెరపీలో మాజీ ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని పోలీసులకు ఆస్పత్రి వైద్యులు సూచించారు. అయితే ప్రస్తుతానికి ప్రాణాపాయం ఏమీ లేదని, సాయంత్రం వరకు అబ్జర్వేషన్ లో ఉంచి మందులిచ్చి తిరిగి పంపిస్తామని వైద్యులు చెబుతున్నారు. ఇక చెవిరెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ శుక్రవారం పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఐదు రోజులు విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆ పిటిషనులో కోరారు.
మరోవైపు చెవిరెడ్డి తరపు న్యాయవాదులు ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం దృష్ట్యా ఆయనకు ఇంటి భోజనం సౌకర్యం కల్పించేలా వెసులుబాటు ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై సోమవారం విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. కాగా, ఇప్పటికే చెవిరెడ్డికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టు గతంలో ఆదేశించింది.
