మరిగిన నూనెపోసి హత్య.. భర్తను అతికిరాతకంగా చంపిన భార్య.. కారణం ఇదే..!
చెన్నై నగరంలోని కొళత్తూర్‌లో కుటుంబ కలహం దారుణమైన హత్యకు దారితీసింది.
By: Tupaki Desk | 20 Aug 2025 6:00 PM ISTసమాజంలో పరిస్థితులు మారాయి. ఒకప్పుడు అత్తింటి వేధింపులు ఎక్కువగా ఉండేవి. ఇవి భరించలేక కొంత మంది కోడళ్లు ఆత్మహత్య చేసుకునేవారు. మరికొంత మందిని అత్తింటివారే హత్య చేసేవారు.. కానీ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారాయి.. అత్తింటి చేతిలో భార్యలు మరణిస్తుండేవారు.. నేడు పుట్టింట్లోనే భర్తలు మరణిస్తున్నారు. వివాహేతర సంబంధాలు, భర్త వేధింపులు కారణం ఏదైనా కావచ్చు.. కానీ ఘటనలు మాత్రం ఒకేలా కనిపిస్తున్నాయ. వేధింపులు సైతం మారాయి. భర్తను అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు భార్యలు..
చెన్నైనగరంలో ఘటన
చెన్నై నగరంలోని కొళత్తూర్‌లో కుటుంబ కలహం దారుణమైన హత్యకు దారితీసింది. మద్యం మత్తులో తరచూ గొడవపడే భర్తను భార్య మరిగిన నూనెతో దాడి చేసి హతమార్చింది. లక్ష్మీనగర్‌కు చెందిన ఖాదర్ బాషా (42) కొన్ని సంవత్సరాల క్రితం నిషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. వివాహానంతరం ఖాదర్ మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవలు సృష్టించేవాడు. భార్యతో వాగ్వాదాలు జరిగేవి.. అవి ఒక్కోసారి తీవ్ర రూపం దాల్చేవి. పలు సార్లు బంధువులు మధ్యవర్తిత్వం చేసినా బాషాలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
హత్య జరిగిందిలా..
ఈ నెల 9న రాత్రి ఖాదర్ మద్యం తాగి ఇంటికి వచ్చి నిషాతో గొడవకు దిగాడు. ఆగ్రహానికి గురైన ఆమె వంటగదిలో మరిగుతున్న నూనె తీసుకచ్చి భర్తపై పోసింది. తీవ్ర గాయాలపాలైన ఖాదర్ కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు అతన్ని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. శరీరంపై 60 శాతం వరకు కాలిన గాయాలవడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయితే అప్పటికి పరిస్థితి విషమించి మృతి చెందాడు.
రంగంలోకి పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు నిషాను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. హత్యకు మద్యం అలవాటు, తరచూ జరిగే గొడవలే కారణమని ఇప్పటికి నిర్ణయించారు. మృతుడు ఖాదర్ బాషా మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
