Begin typing your search above and press return to search.

దేశంలో ఇదే తొలిసారి.. డెలివరీ ఏజెంట్ల కోసం ఓ వినూత్న యత్నం

నేటి ఆధునిక జీవన శైలిలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ సేవలు ఎంత ప్రాధాన్యత సంపాదించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   13 Jun 2025 4:00 AM IST
దేశంలో ఇదే తొలిసారి.. డెలివరీ ఏజెంట్ల కోసం ఓ వినూత్న యత్నం
X

నేటి ఆధునిక జీవన శైలిలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ సేవలు ఎంత ప్రాధాన్యత సంపాదించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సేవల వెనక గిగ్ వర్కర్లు (డెలివరీ ఏజెంట్లు) ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రేయింబవళ్లు వర్షం, ఎండ, చలి అన్నీ మరిచి విరామం లేకుండా పని చేస్తూ తమ కుటుంబ పోషణ కోసం శ్రమిస్తున్నారు. వీరి అవసరాలు, ఇబ్బందులను గుర్తించిన గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ దేశంలోనే తొలిసారిగా వీరి కోసం ప్రత్యేకంగా లాంజ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

చెన్నై నగరంలో ఇప్పటికే రెండు లాంజ్‌లు ఏర్పాటు చేయగా, ఒక్కో లాంజ్‌లో సుమారు 25 మంది కూర్చునే ఏర్పాట్లు ఉన్నాయి. వీటిలో తాగునీటి సదుపాయం, మొబైల్ ఛార్జింగ్ పోర్టులు, శుభ్రమైన వాష్‌రూమ్‌లు లభిస్తాయి. ఎసీ లభ్యమైన ఈ లాంజ్‌లు, పని మద్యలో గిగ్ వర్కర్లు విశ్రాంతి తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి.

తమిళనాడు ఆర్థిక మంత్రి తెన్నరస్సు కూడా ఇటీవల జరిగిన బడ్జెట్ ప్రవచనంలో ఈ లాంజ్‌ల విషయాన్ని ప్రస్తావించారు. చెన్నైతోపాటు కోయంబత్తూరులో కూడా ఈ తరహా లాంజ్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ రెండు లాంజ్‌లు గిగ్ వర్కర్ల నుంచి మంచి స్పందన పొందిన నేపథ్యంలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో మరిన్ని లాంజ్‌లు ఏర్పాటు చేయాలనే యోచనలో చెన్నై కార్పొరేషన్ ఉంది.

ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ తీసుకున్న చర్యను డెలివరీ ఏజెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై వేడి వాతావరణం కారణంగా వేసవిలో పని చేయడం ఎంతో కష్టంగా మారిందని వారు చెప్పుతున్నారు. ఇలాంటి సమయంలో విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కల్పించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాత్రిపూట పనిచేసే గిగ్ వర్కర్లకు ఈ లాంజ్‌లు మరింత ఉపయోగకరంగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.

ఈ అభివృద్ధి ఇతర నగరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని, దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.