Begin typing your search above and press return to search.

ఏఐ మాయలో మన 'బ్రెయిన్'.. మనల్ని తెలివితక్కువ వాళ్లుగా మారుస్తోందా?

ఈ రోజుల్లో ఏదైనా చిన్న సందేహం వస్తే చాలు.. పక్కనున్న వాళ్లను అడగడం మానేసి.. వెంటనే చాట్ జీపీటీని పలకరిస్తున్నాం.

By:  A.N.Kumar   |   23 Sept 2026 7:00 PM IST
ఏఐ మాయలో మన బ్రెయిన్.. మనల్ని తెలివితక్కువ వాళ్లుగా మారుస్తోందా?
X

ఈ రోజుల్లో ఏదైనా చిన్న సందేహం వస్తే చాలు.. పక్కనున్న వాళ్లను అడగడం మానేసి.. వెంటనే చాట్ జీపీటీని పలకరిస్తున్నాం. ప్రేమలేఖల దగ్గరి నుంచి ఆఫీస్ మెయిల్స్, ఆఖరికి లంచ్ బాక్స్‌లోకి ఏం వండుకోవాలో చెప్పేందుకు కూడా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) మన జీవితాల్లోకి దూసుకొచ్చింది. అయితే ఈ స్మార్ట్ సమాధానాల వెనుక మన సొంత జ్ఞానం 'డిలీట్' అయిపోతుందా? అంటే.. "అవుననేలా ఉన్నాయి" కొన్ని తాజా పరిశోధనలు..

ప్రఖ్యాత మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ ) మీడియా ల్యాబ్ వారు "యువర్ బ్రెయిన్ ఆన్ చాట్ జీపీటీ’’ అనే పేరుతో ఓ ఆసక్తికరమైన ప్రయోగాన్ని నిర్వహించారు. దీనికోసం 54 మందిని పిలిచి మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో పూర్తిగా చాట్ జీపీటీ సహాయంతో వ్యాసాలు రాశారు. గ్రూప్ 2లో సెర్చ్ ఇంజిన్ గూగుల్ వాడుతూ సొంతంగా రాశారు. గ్రూప్ 3లో ఎటువంటి సాధనాలు లేకుండా కేవలం తమ సొంత మెదడునే వాడి వ్యాసాలు పూర్తి చేశారు.

వీరందరి మెదడు కదలికలను ఈఈజీ పరికరంతో పరిశీలిస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సొంతంగా ఆలోచించి రాసిన మూడో గ్రూప్ వారి మెదడులో న్యూరాన్లు దీపావళి బాణసంచాలా ధగధగమెరిసిపోగా ఏఐ వాడిన మొదటి గ్రూప్ వారి మెదడులో మాత్రం తీవ్రమైన 'శాంతి సమాధానాలు' అంటే చాలా తక్కువ కనెక్టివిటీ కనిపించాయి!

నేను రాసిందెంతో.. నాకు గుర్తుందే ఎంతో..

ఈ రీసెర్చ్‌లో మరో విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఏఐ సాయంతో వ్యాసం రాసిన వారిని "కొద్దిసేపటి క్రితం మీరేం రాశారో చెప్పండి?" అని అడిగితే.. వాళ్లు తెల్లముఖం వేశారు. తాము కాపీ-పేస్ట్ చేసిన విషయాలు కొద్ది నిమిషాల్లోనే మర్చిపోవడమే కాకుండా "ఇది అసలు నేనే రాశానా?" అనే అనుమానం కూడా వారిలో వ్యక్తమైంది. నాలుగు నెలల పాటు వరుసగా ఏఐ వాడిన వారిలో లాంగ్వేజ్, మెమరీ స్కిల్స్ తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

మరి మనం నిజంగానే తెలివితక్కువ వాళ్లంగా మారిపోతున్నామా?

వెంటనే భయపడిపోయి ఏఐని పక్కన పడేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ అధ్యయనం ఇంకా ఆమోదముద్ర పడలేదు. పైగా కేవలం 54 మంది పైనే.. అదీ వ్యాస రచనపైనే ఈ ప్రయోగం చేశారు. కాబట్టి ప్రయోగాత్మకంగా ఇది తుది తీర్పు కాకపోవచ్చు.

కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అసలు విషయమేమిటంటే.. ఏఐని మన ఆలోచనకు "ప్రత్యామ్నాయంగా" వాడితే మెదడు నిజంగానే తుప్పు పట్టిపోతుంది. అలా కాకుండా మన ఆలోచనలను "పదును పెట్టే సాధనంగా" వాడుకుంటే ఏ అభ్యంతరం లేదు. ఏఐ ఇచ్చే కాపీ-పేస్ట్ జ్ఞానాన్ని గుడ్డిగా నమ్మకుండా.. దాన్ని ప్రశ్నిస్తూ విశ్లేషిస్తూ మన 'కార్టెక్స్'కు కొద్దిగా పని పెడితేనే మన మెదడు సేఫ్.. లేకపోతే భవిష్యత్తులో "నా పేరు ఏంటో కాస్త చాట్ జీపీటీ ని అడిగి చెప్పు బాస్" అనే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.