AI రేసులో తగ్గిన చాట్‌జీపీటీ హవా.. దూసుకెళుతున్న జెమిని-క్లాడ్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి.. చాట్‌బాట్ రేసులో చాన్నాళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహించిన ఓపెన్ ఏఐ కి చెందిన `చాట్‌జీపీటీ`కి ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది.
By: Sivaji Kontham | 18 Jun 2026 12:30 AM ISTఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి.. చాట్‌బాట్ రేసులో చాన్నాళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహించిన ఓపెన్ ఏఐ కి చెందిన `చాట్‌జీపీటీ`కి ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది. చాట్‌బాట్ రంగంలో అందరికంటే ముందే అడుగుపెట్టి ఇన్నాళ్లూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన చాట్‌జీపీటీ మార్కెట్ వాటా ఇప్పుడు క్రమంగా క్షీణిస్తోంది. చరిత్రలోనే మొదటిసారిగా AI చాట్‌బాట్ మార్కెట్లో దీని వాటా 50 శాతం కంటే కిందకు పడిపోయింది. ప్రత్యర్థి సంస్థలు సాంకేతికంగా సరికొత్త మైలురాళ్లను అందుకుంటూ దూసుకుపోతుండటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
తాజా గణాంకాల ప్రకారం... మే నెల నాటికి మార్కెట్లో చాట్‌జీపీటీ వాటా 46.4 శాతానికి పడిపోయింది. చాట్‌జీపీటీ రేసు మొదలుపెట్టినప్పుడు 100 శాతం మార్కెట్ వాటాతో ఒంటరిగా ప్రయాణాన్ని ప్రారంభించిన సంగతిని ఇక్కడ మరువకూడదు. ప్రస్తుత మార్కెట్లో చాట్‌జీపీటీ తర్వాతి స్థానంలో గూగుల్ కి చెందిన `జెమిని` 27.7 శాతం మార్కెట్ వాటాతో గట్టి పోటీనిస్తోంది. ఇక ఆంత్రోపిక్ సంస్థకు చెందిన `క్లాడ్` చాట్‌బాట్ 10.3 శాతంతో మూడవ స్థానంలో నిలిచింది. చాట్‌జీపీటీకి ఇప్పటికీ 46 శాతానికి పైగా మార్కెట్ ఉండటం విశేషమే అయినా.. గతంతో పోలిస్తే దాని ఆధిపత్యం తగ్గిందనేది స్పష్టమవుతోంది.
మార్కెట్ వాటా తగ్గినా ప్రపంచవ్యాప్తంగా ఏఐ చాట్‌బాట్లను ఉపయోగించే వారి సంఖ్య మాత్రం రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. ఈ నెల ప్రారంభంలో చాట్‌జీపీటీ ఏకంగా 1.1 బిలియన్ల (110 కోట్ల) మంత్లీ యాక్టివ్ యూజర్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన మొదటి AI యాప్‌గా నిలవడమే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందిన ఆన్‌లైన్ యాప్ సర్వీస్‌గా ఇది చరిత్రకెక్కింది. మరోవైపు గూగుల్ జెమిని ప్రస్తుతం 662 మిలియన్ల యాక్టివ్ యూజర్లను కలిగి ఉండగా... క్లాడ్ చాట్‌బాట్ 245 మిలియన్ల యూజర్లతో పుంజుకుంటోంది.
ప్రస్తుతం యూజర్లు ఒకే చాట్‌బాట్‌కు పరిమితం కాకుండా తమ అవసరాలకు తగ్గట్టుగా విభిన్న బాట్లను మార్చి మార్చి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఈ రంగంలో వ్యాపారం, వినియోగదారుల ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది. గత ఏడాది మొదటి ఆరు నెలల్లో ఈ యాప్స్ పై యూజర్లు చేసిన ఖర్చు 1.83 బిలియన్ డాలర్లు కాగా.. ఈ ఏడాది ప్రథమార్థంలో అది ఏకంగా 4.2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.35,000 కోట్లకు పైగా) పెరిగింది. ఇందులో విచిత్రం ఏమిటంటే.. క్లాడ్ చాట్‌బాట్ తన ఉచిత ప్లాన్‌పై కఠినమైన లిమిట్స్ విధించడం వల్ల... దాని మొత్తం యూజర్లలో అత్యధికంగా 13 శాతం మంది పెయిడ్ యూజర్లుగా మారారు.
మరోవైపు.. చాట్‌జీపీటీ తన ఉచిత యూజర్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా యాప్‌లో ప్రకటనలను భారీగా పెంచేసింది. మే నెల నాటికి సగటున 17 శాతం మంది రోజువారీ యూజర్లకు చాట్‌జీపీటీ యాడ్స్ చూపిస్తోంది. కేవలం యాడ్స్ మాత్రమే కాకుండా... గ్లోబల్ రిటైల్ దిగ్గజాలైన వాల్‌మార్ట్, టార్గెట్, కాస్ట్‌కో వంటి సంస్థలకు సంబంధించిన రెఫరల్ లింక్‌లను కూడా చాట్‌జీపీటీ తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రమోట్ చేస్తూ ఆదాయ వనరులను పెంచుకుంటోంది.
