చాట్-జీపీటీ (ChatGPT) బంపర్ ఆఫర్.. ఏడాది పాటు ఉచిత AI
భారతీయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఒక పెద్ద సర్‌ప్రైజ్ లభించింది.
By: Tupaki Desk | 4 Nov 2025 11:13 AM ISTభారతీయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఒక పెద్ద సర్‌ప్రైజ్ లభించింది. నవంబర్ 4 నుంచి ఓపెన్ ఏఐ (OpenAI) తమ చాట్-జీపీటీ (ChatGPT) Go ప్లాన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. నవంబర్ 4వ తేదీకి ముందు Go ప్లాన్ రూ. 400 ఖర్చయ్యేది. ఈ సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు పూర్తిగా ఉచితం. ఓపెన్ ఏఐ ఈ నిర్ణయాన్ని ఒక ఆఫర్‌గా కాకుండా, భారత్‌లో వేగంగా పెరుగుతున్న ఏఐ వినియోగాన్ని గుర్తించి తీసుకున్న వ్యూహాత్మక అడుగుగా పేర్కొంది. ఏఐ ప్రపంచంలో భారత్ పెద్ద వినియోగదారుల దేశంగా ఎదుగుతున్న సమయంలో ఈ ఆఫర్ కొత్త అధ్యాయం తెరిచింది.
ఎందుకు ప్రత్యేకం
ChatGPT Go అనేది ఉచిత వెర్షన్, ప్రో వెర్షన్ మధ్యలో ఉన్న స్మార్ట్ ప్లాన్. ఇది వేగంగా స్పందిస్తుంది, పెద్ద పరిమాణంలో డేటా హ్యాండిల్ చేయగలదు.. సుదీర్ఘ చాట్‌లు నిర్వహించగలదు. వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా ఫైళ్లు అప్‌లోడ్ చేయడం, డాక్యుమెంట్‌లను విశ్లేషించడం, చిత్రాలు సృష్టించడం, వ్యక్తిగత చర్చలను కొనసాగించడం వంటి అధునాతన ఫీచర్లను పొందవచ్చు.
ఇందులోని ప్రధాన ఆకర్షణ ‘మెమరీ ఫీచర్’ ChatGPT మీ గత సంభాషణలను గుర్తుంచుకొని, తదుపరి సమాధానాలను వ్యక్తి గతంగా ఇస్తుంది. ఇది ఇప్పుడు తాజా జీపీటీ-5 మోడల్‌పై నడుస్తోంది. ఫలితంగా, సమాధానాలు మరింత కచ్చితంగా, వేగంగా, సహజంగా వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఇది సాధారణ చాట్‌బాట్ కాదు..
ఓపెన్ ఏఐకి కేంద్రం భారత్..
ప్రపంచంలో అమెరికా తర్వాత ChatGPT ఎక్కువగా వాడే దేశం భారతదేశం. విద్యార్థుల నుంచి ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, కంటెంట్ క్రియేటర్లు, కోడర్లు అందరూ ఈ సాధనాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో OpenAI ఈ ఉచిత ప్లాన్ ద్వారా మరింత మంది భారతీయులకు AI పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకొచ్చింది.
ఇది IndiaAI మిషన్ దిశలో చర్యగానే కనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పాఠశాల స్థాయిలో పరిచయం చేయడం.. గ్రామీణ ప్రాంతాల్లో AI అవగాహన పెంచడం, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఇవన్నీ ఈ యత్నంతో సాగే అవకాశముంది. OpenAI ఇప్పటికే విద్యా సంస్థలు, సివిక్ ఆర్గనైజేషన్లతో కలిసి పని చేస్తోంది. దీని ద్వారా AI యాక్సెస్ నగరాల నుంచి గ్రామాలకూ విస్తరించబోతోంది. ఇది భారత డిజిటల్ మార్పులో ఒక సాఫ్ట్ రివల్యూషన్.
ఎలా Go సబ్‌స్క్రిప్షన్ చేయాలి..
ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేయడం సులభం. వినియోగదారులు కేవలం ChatGPT వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ అయ్యి ChatGPT Go ప్లాన్‌ను ఎనేబుల్ చేయాలి. ప్రస్తుత చెల్లింపు వినియోగదారులు మళ్లీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. వారికి ఆటోమేటిక్‌గా 12 నెలల ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ కాలం పూర్తయ్యాక సాధారణ రేట్లు తిరిగి అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది.
OpenAI వైస్ ప్రెసిడెంట్ నిక్ టర్లే మాట్లాడుతూ.. ‘భారతదేశం సృజనాత్మకత, ఇన్నోవేషన్‌లో ముందంజలో ఉంది. అందుకే మేము అధునాతన AIని అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. ఇది మార్కెటింగ్ కాదు. AI విద్య, సృజనాత్మకత, సామాజిక మార్పుకు ఒక వేదిక.
AI భవిష్యత్తు భారత చేతుల్లో
OpenAI ఈ నిర్ణయం ద్వారా మరోసారి స్పష్టం చేసింది, భవిష్యత్తు AI ఆధారంగా ఉంటుంది. కానీ ఆ భవిష్యత్ రూపకర్తలు భారతీయులే. ఇప్పుడు పట్టణాలే కాదు.. చిన్న పట్టణాలు.. పల్లెల్లో ఉన్న యువత కూడా ChatGPT ద్వారా నేర్చుకోవచ్చు.. సృష్టించవచ్చు, అభివృద్ధి చెందవచ్చు. AI ఇక టెక్ కంపెనీల సాధనం కాదు అది ప్రతి మనిషి చేతిలోని జ్ఞాన సాధనం. భారత యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, ప్రపంచ AI పటంలో భారత్ కేవలం వినియోగదారుగా కాకుండా సృష్టికర్తగా నిలుస్తుంది. AI మన భవిష్యత్తు కానీ ఆ భవిష్యత్తుకు ప్రేరణ భారత్.
