పాస్‌వర్డ్ మనది.. పని ‘ఏఐ’ది.. తిరుమల బుకింగ్ ప్రయత్నం లేవనెత్తిన కొత్త ప్రశ్నలు
టీటీడీ సైట్‌లో రూమ్ బుక్ చేయడానికి మనుషులే సర్వర్ డౌన్లతో కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తుంటే మధ్యలో ఒక చాట్‌బాట్ వచ్చి "నేనున్నాగా.. పాస్‌వర్డ్ ఇవ్వు బాస్ కథ నడిపిస్తా" అని వెబ్‌సైట్‌లోకి దూరింది.
By: A.N.Kumar | 29 Sept 2026 9:18 PM ISTఓ తిరుమల దేవుడా.. నీ దర్శనానికి సరిపోని మానవ తెలివితేటలకు తోడు.. ఇప్పుడు కొత్తగా ఏఐ కూడా లైన్లో నుంచుండ పెట్టావా స్వామి? అని అనే రోజులు వచ్చేశాయి..
టీటీడీ సైట్‌లో రూమ్ బుక్ చేయడానికి మనుషులే సర్వర్ డౌన్లతో కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తుంటే మధ్యలో ఒక చాట్‌బాట్ వచ్చి "నేనున్నాగా.. పాస్‌వర్డ్ ఇవ్వు బాస్ కథ నడిపిస్తా" అని వెబ్‌సైట్‌లోకి దూరింది. కాకపోతే చివరికి పేమెంట్ గేట్‌వే దగ్గర నిలబడి "దర్శనం టికెట్ ఎక్కడ నాయనా?" అనేసరికి పాపం ఏఐ ఏజెంట్‌కి కూడా భక్తి, ముక్తి, భయాల అసలు అర్థం ఏంటో తెలిసివచ్చింది..
ఇప్పటివరకు ఏఐ అనగానే మన సందేహాలకు సమాధానాలు ఇచ్చే ఒక డిజిటల్ అసిస్టెంట్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ అదే ఏఐ మన తరఫున ఒక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి.. బ్రౌజ్ చేస్తూ.. ఆప్షన్లు ఎంచుకుని ఒక పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్‌సైట్‌లో జరిగిన ఒక కాటేజ్ బుకింగ్ ప్రయత్నం సరిగ్గా ఈ కొత్త టెక్నాలజీ పరిణామాన్నే మన కళ్లముందు నిలిపింది.
అసలు తిరుమల బుకింగ్‌లో ఏం జరిగింది?
ఇటీవల చాట్ జీపీటీ -6 ఆస్ట్రా అనే ఏఐ ఏజెంట్ ద్వారా టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్స్ బుక్ చేసేందుకు ఒక ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ స్పష్టం చేయాల్సిన విషయమేమిటంటే.. ఈ బుకింగ్ పూర్తికాలేదు. ప్రక్రియ కేవలం పేమెంట్ స్టేజ్ వరకు మాత్రమే వెళ్లి ఆగిపోయింది. టీటీడీ నియమాల ప్రకారం గది పొందడానికి చెల్లుబాటు అయ్యే దర్శన టికెట్ తప్పనిసరి. కాబట్టి ఏఐ భద్రతా వ్యవస్థలను దాటేసి బుకింగ్ పూర్తి చేసిందని చెప్పలేం.
అయితే ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏఐ ఏజెంట్ పనితీరు. యూజర్ లాగిన్ వివరాలు ఇచ్చిన తర్వాత ఈ ఏఐ ఏజెంట్ స్వయంగా వెబ్‌సైట్‌ను నావిగేట్ చేయడం.. డేట్స్ అందుబాటులో ఉన్న ఆప్షన్లను గుర్తించి సెలెక్ట్ చేయడం.. ప్రాసెస్ ముందుకు తీసుకెళ్లడం వంటి పనులను విజయవంతంగా చేసింది.
సాధారణ చాట్ జీపీటీకి, ఏఐ ఏజెంట్‌కు తేడా ఏమిటి?
ఒక సాధారణ చాట్‌బాట్‌ను "తిరుమలలో రూమ్ ఎలా బుక్ చేయాలి?" అని అడిగితే అది కేవలం బుకింగ్ విధానాన్ని స్టెప్-బై-స్టెప్ వివరిస్తుంది. కానీ ఏఐ ఏజెంట్ అక్కడితో ఆగదు. యూజర్ నుండి తగిన అనుమతులు.. లాగిన్ వివరాలు పొందితే నేరుగా బ్రౌజర్‌ను రన్ చేస్తూ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేజీలను ఓపెన్ చేసి.. మనం చేయాల్సిన పనిని దాదాపుగా పూర్తి చేస్తుంది. అంటే సమాచారం ఇచ్చే స్థాయి నుండి, స్వయంగా పని చేసే స్థాయికి టెక్నాలజీ ఎదుగుతోంది.
భవిష్యత్తు సౌకర్యాలు.. కొత్త సవాళ్లు
ఈ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే రైలు, విమాన టికెట్లు, హోటల్ రిజర్వేషన్లు, ఆన్‌లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపులు వంటి రోజువారీ పనులను మన ప్రతినిధిగా ఏఐ చేసేస్తుంది. దీనివల్ల సమయం చాలా ఆదా అవుతుంది. అయితే నాణేనికి మరోవైపు ప్రమాదాలు కూడా ఉన్నాయి. మన పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఏఐ ఏజెంట్లకు ఇవ్వడం ఎంతవరకు సురక్షితం? ఒకవేళ ఏఐ పొరపాటున తప్పుడు తేదీకి టికెట్ బుక్ చేసినా లేదా ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేసినా ఆ నష్టానికి బాధ్యత ఎవరిది?
బ్యాంకింగ్, ప్రభుత్వ , ఇ-కామర్స్ సైట్లు ఈ ఏఐ ఏజెంట్లను ఎలా గుర్తిస్తాయి? పేమెంట్ లేదా ఫైనల్ కన్ఫర్మేషన్ సమయాల్లో మనుషుల అనుమతి తప్పనిసరి చేసేలా ఎలాంటి నిబంధనలు తీసుకరావాలి? అనే అంశాలపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. తిరుమల బుకింగ్ ప్రయత్నం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. భవిష్యత్తులో మన తరఫున నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఏఐ వెళ్తే దాని నియంత్రణ బాధ్యత మనదే అవుతుంది!
