Begin typing your search above and press return to search.

పార్టీ మారు.. టికెట్టు పట్టు!

ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కావాలి.. మద్దతుగా పార్టీ అధినాయకత్వం ఉండాలి.. ఇక మిగతా పని తాము చూసుకుంటామనే ధీమాతో ఈ లీడర్లున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 1:30 AM GMT
పార్టీ మారు.. టికెట్టు పట్టు!
X

రాజకీయ నాయకుల అంతిమ లక్ష్యం ఎన్నికల్లో పోటీ చేయడం, విజేతగా నిలిచి పదవి అనుభవించడం. రాజకీయాల్లో ఉన్నవాళ్లు, ఇప్పుడు పాలిటిక్స్ లో అడుగుపెడుతున్నవాళ్లైనా ఇదే ధ్యేయంతో ముందుకు సాగుతారు. ఇందులో సందేహం ఏమీ లేదు. పదవి దక్కించుకోవడమే రాజకీయ నాయకుడి లక్ష్యం. అందుకు ఏ పార్టీ అయితే ఏముంది? అంటూ పార్టీలు మారడానికి వీళ్లు వెనుకాడరు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కావాలి.. మద్దతుగా పార్టీ అధినాయకత్వం ఉండాలి.. ఇక మిగతా పని తాము చూసుకుంటామనే ధీమాతో ఈ లీడర్లున్నారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ జంపింగ్ లు చేసే నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనమని చెప్పాలి. అధికార బీఆర్ఎస్ అయినా బలంగా పుంజుకుంటున్న కాంగ్రెస్ అయినా రేసులో వెనుకబడ్డ బీజేపీ అయినా.. ఇలా ఏ పార్టీ అయినా నాయకుల ఆలోచన ఒకటే. ఉన్న పార్టీలో టికెట్ దక్కితే సరే.. లేదంటే గోడ దూకేయడమే. ఎంత పెద్ద నాయకుడైనా ఇదే తీరు. ఒకటే పార్టీలో కొనసాగాలి లేదంటే ఎన్నికల్లో నిలబడే అర్హత ఉండదనే నిబంధన తెస్తే ఎంతమంది రాజకీయాల్లో ఉంటారు?

ఇప్పుడు అధికార బీఆర్ఎస్ లో టికెట్ దక్కలేదనే అసంత్రుప్తులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక ముందుగానే పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన నాయకులు ఎప్పుడో పార్టీ మారారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు, తుమ్మల నాగేశ్వర రావు ఈ జాబితాలోకి వస్తారు. ఇక టికెట్ దక్కలేదని పార్టీ మారిన, మారుతున్న వాళ్లూ ఉన్నారు. మైనంపల్లి హన్మంతరావు తన కొడుక్కి టికెట్ రాలేదని కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రేఖ నాయక్, బాపూరావు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ లో టికెట్లు దక్కే అవకాశం లేని నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకుడు పార్టీ మారారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా టికెట్ల కోసం ఎన్నికల్లో పోటీ కోసం మన లీడర్లు చేసే చిత్రాలు ఎన్నో అని ప్రజలు అనుకుంటున్నారు.