Begin typing your search above and press return to search.

వైసీపీ టీడీపీ సీట్లలో మళ్లీ మార్పులు ...!?

ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని సమయం తక్కువ ఉంటుంది కాబట్టి అభ్యర్ధుల ప్రచారం కోసం అని ఉన్నంతలో గట్టి అభ్యర్ధులను పోటీకి పెట్టాలనుకుని లిస్ట్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   17 March 2024 8:51 AM GMT
వైసీపీ టీడీపీ సీట్లలో మళ్లీ మార్పులు ...!?
X

రాజకీయాల్లో ఎపుడు ఏమైనా జరగవచ్చు. రాజకీయ పార్టీలకు గెలుపు ఒక్కటే ప్రమాణం. దాని కోసం ఏమైనా చేయవచ్చు. అందువల్ల ఇపుడు ఏపీలో చర్చ ఒకటి సాగుతోంది. ఏపీలో చూస్తే టీడీపీ మొత్తం 128 ఎమ్మెల్యే సీట్లలో తన అభ్యర్ధులను ప్రకటించింది. వైసీపీ అయితే మొత్తం 175 సీట్లలో అభ్యర్ధుల జాబితాను రిలీజ్ చేసింది.

ఇవన్నీ ముందస్తు ఏర్పాట్లుగానే జరిగాయి. ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని సమయం తక్కువ ఉంటుంది కాబట్టి అభ్యర్ధుల ప్రచారం కోసం అని ఉన్నంతలో గట్టి అభ్యర్ధులను పోటీకి పెట్టాలనుకుని లిస్ట్ ఇచ్చారు. అయితే మే 13న ఎన్నికలు కావడంతో కావాల్సినంత టైం ఇపుడు దొరుకుతోంది. దాంతో పాటు మరింత మెరుగైన అభ్యర్ధులు ఉంటే కనుక ఆయా చోట్ల మార్పు చేర్పులు చేస్తారా అంటే ఆశావహులు అయితే చేయవచ్చు అనే రెండు పార్టీలలో అంటున్నారు.

అధికార వైసీపీలో చూస్తే కొన్ని చోట్ల అభ్యర్థుల లిస్ట్ మీద కొంత అసంతృప్తి కనిపిస్తోంది అని అంటున్నారు. మరి కొన్ని చోట్ల సిట్టింగులకే సీట్లు ఇవ్వడం వల్ల గెలుపు అవకాశాలు ఎంతమేరకు ఉంటాయన్నది కూడా పార్టీలో చర్చ సాగుతోంది. దాంతో మళ్లీ సర్వేలు లాంటివి నిర్వహించి అవసరం అనుకుంటే మార్పుచేర్పులు చేస్తరా అంటే వై నాట్ అంటున్నారు ఆశావహులు.

గాజువాక ఇంచార్జిగా ఉరుకూటి చందుని నియమించారు. ఆ తరువాత ఆయన్ని తప్పించి మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ఇచ్చారు. ఫైనల్ లిస్ట్ లో ఆయన్ని అభ్యర్ధిగా ప్రకటించారు. అయితే దీని మీద ఉరుకూటి చందు తన అనుచరులు అభిమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తాను అని చెప్పారు.

తనకు మూడు నెలల పాటు సహకరించిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలియచేశారు. మరో వైపు చూస్తే ఇంకా టైం ఉందని అధినాయకత్వం తనకు అన్యాయం చేయదని ఉరుకూటి చందు అన్న మాటలు ఇపుడు సంచలనం రేపుతున్నాయి. అంటే మంత్రి గుడివాడను కూడా మార్చేసి మళ్లీ చందుకు అవకాశం ఇస్తారా అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం. మరి చందుకు ఏ రకమైన భరోసా దక్కిందో తెలియదు కానీ మార్పులు ఉంటాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు అంటున్నారు.

అదే విధంగా చూస్తే విశాఖ జిల్లాలో ఎక్కడా యాదవులకు టికెట్ వైసీపీ ఇవ్వలేదు. దాంతో ఆ సామాజిక వర్గం రగులుతోంది. దీనిని సరిచేసేందుకు అయినా మార్పు చేర్పులు ఉండవచ్చు అంటున్నారు. ఇక ఉత్తరాంధ్రాతో సహా ఏపీలో కొన్ని చోట్ల అవసరం అనుకుంటే గెలుపు అవకాశాలను చూసుకుని మార్పులు చేయవచ్చు అని కూడా ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంత ఉందో చూడాలి.

ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీలో కూడా అసంతృప్తులు ఉన్నాయి. పెందుర్తి టికెట్ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వాలని టీడీపీ క్యాడర్ అంతా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియచేస్తోంది. బండారుకి సీటు ఇస్తే తాము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెబుతోంది. చంద్రబాబు పునరాలోచిస్తారు అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటివే జిల్లాలో మరికొన్ని సీట్లు ఉన్నాయని ఏపీలో కూడా మార్పు చేర్పులకు టీడీపీ సిద్ధపడవచ్చు అని ఆశావహులు అయితే అంటున్నారు. నిజంగా అలా జరుగుతుందా అంటే గెలుపు కోసం వైసీపీ టీడీపీ పట్టుదలగా ఉన్నాయి. చూస్తూ చూస్తూ ఓడిపోతారు అని సర్వే నివేదికలు వస్తే ఆగలేరు కదా అని అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.