Begin typing your search above and press return to search.

చంద్రయాన్ 4 టార్గెట్ ఫిక్స్: ఎప్పుడు.. ఏం చేస్తారు?

చంద్రయాన్ ప్రయోగంలో 30 కేజీల బరువు ఉన్న రోవర్ ను పంపగా.. చంద్రయాన్ 4లో మాత్రం ఏకంగా 350 కేజీల బరువు ఉన్న రోవర్ ను పంపనున్నారు

By:  Tupaki Desk   |   20 Nov 2023 5:10 AM GMT
చంద్రయాన్ 4 టార్గెట్ ఫిక్స్: ఎప్పుడు.. ఏం చేస్తారు?
X

భారీ అంచనాల మధ్య జరిగిన చంద్రయాన్3 ప్రయోగం సూపర్ సక్సెస్ కావటం తెలిసిందే. ఈ విజయం రగిలించిన స్ఫూర్తితో చంద్రయాన్ 4 ప్రయోగానికి సిద్ధమవుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). చంద్రయాన్ 4 కు లుపెక్స్ పేరుతో సరికొత్త లక్ష్యాన్ని సిద్ధం చేసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి పై నుంచి రాళ్లు.. మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలన్న టార్గెట్ గా పెట్టుకుంది. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీల్ దేశాయ్ వెల్లడించారు.

పూణెలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రయాన్ 3 విజయంతో తాము చంద్రుడి ఉపరితలంపై అన్వేషనకు సిద్ధమవుతున్నామని.. ఇందుకోసం లునార్ పోలార్ ఎక్స్ ప్లోరేషన్ మిషన్ ను రెఢీ చేస్తున్నట్లు చెప్పారు. చంద్రయాన్ 3లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సుమారు 70 డిగ్రీల దక్షిణ ఆక్షాంశం వద్ద ల్యాండర్ దిగటం తెలిసిందే. అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియను నేర్పును ప్రదర్శించటం ద్వారా ఇస్రో చరిత్రను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఆ ప్రాంతానికి ప్రపంచంలో మరే దేశం తన రోవర్ ను పంపి.. విజయం సాధించింది లేదు. చంద్రయాన్ 4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ ను దించనున్నారు.

చంద్రయాన్ ప్రయోగంలో 30 కేజీల బరువు ఉన్న రోవర్ ను పంపగా.. చంద్రయాన్ 4లో మాత్రం ఏకంగా 350 కేజీల బరువు ఉన్న రోవర్ ను పంపనున్నారు. దాదాపు కిలో మీటరు మేర చంద్రుడి మీద తిరగనుంది. చంద్రయాన్ 3 మిషన్ జీవిత కాలం ఒక లూనార్ డే కావటం తెలిసిందే. భూమి మీద పద్నాలుగు రోజులకు చంద్రుడి మీద ఒక రోజు సమానమన్న విషయం తెలిసిందే. చంద్రయాన్ 4 ప్రయోగంలో ఏడు లూనార్ రోజులు పని చేసేలా రూపొందిస్తున్నారు. అంటే.. భూమి మీద వంద రోజులకు సమానమన్నమాట.

అంతేకాదు.. ఈ ప్రయోగంలో రోవర్ లోని పరికరాలు చంద్రుడి మీద రాళ్లు.. మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి. ఇందుకు అవసరమైన రెండు లాంచ్ వెహికల్స్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ ప్రయోగం ఇప్పట్లో సాధ్యం కాదనే చెప్పాలి. తాజా అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు కోసం కనిష్ఠంగా ఐదేళ్లు.. గరిష్ఠంగా పదేళ్లు పట్టే వీలుంది. చంద్రయాన్ 3 విజయం తర్వాత మరింత పెద్ద సవాలుకు సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు సూచన చేశారని చెబుతున్నారు. చంద్రయాన్ 4 కోసం జపాన్ అంతరిక్ష సంస్థ తో కలిసి ఇస్రో పని చేయనుంది.