Begin typing your search above and press return to search.

ఊహించని రీతిలో నిద్ర మత్తు వీడిన చంద్రయాన్ 3?

తానున్న దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవల్ని పునరుద్దరించుకున్నట్లుగా తెలిపే సంకేతాల్ని పంపటం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 4:29 AM GMT
ఊహించని రీతిలో నిద్ర మత్తు వీడిన చంద్రయాన్ 3?
X

ప్రపంచమే ఆశ్చర్యంలో భారతదేశం వైపు చూసేలా చేసిన అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్ 3. అగ్రదేశాలతో పోలిస్తే.. అత్యంత తక్కువ ఖర్చుతో అతి క్లిష్టమైన టాస్కు తీసుకొని సక్సెస్ అయిన చంద్రయాన్ 3 ప్రయోగం కారణంగా భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్ 3 ప్రయోగ ప్రత్యేకత.. ఇప్పటివరకు మరే దేశం కూడా చంద్రుడిలోని దక్షిణ ధ్రువ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నాలు ఫలించకపోవటం తెలిసిందే.

మిగిలిన వారికి భిన్నంగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 అనూహ్య రీతిలో విజయవంతం కావటమే కాదు.. అంచనాలకు మించి చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాలు పని చేశాయి. ముందుగా అనుకున్నట్లే.. చంద్రయాన్ 3 నుంచి సిగ్నళ్లు ఆగిపోయాయి. అద్భుత రీతిలో సిగ్నళ్లు వస్తాయని ఆశగా కొందరు చూసినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. ఇలాంటి వేళ.. ఇస్రో డైరెక్టర్ మాత్రం తన మాటల్లో చంద్రయాన్ 3 ఏదో రోజున అద్భుతాన్ని ప్రదర్శించే ఛాన్సుల్ని కొట్టిపారేయలేదు.

తాజాగా ఆయన మాటలు నిజమయ్యాయి. అంచనాలకు భిన్నంగా అద్భుతం అన్న రీతిలో.. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయిన చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాల నుంచి తాజాగా సిగ్నళ్లు అందుకున్నట్లుగా చెబుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్ 3 ల్యాండర్ లో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ ను అమర్చారు. ఇందులోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ ఎరే.. తాజాగా తన సేవల్ని పునరుద్ధరించినట్లుగా చెబుతున్నారు.

భూమి మీద పదిహేను రోజులు చంద్రుడి మీద ఒక రోజుతో సమానమన్న సంగతి తెలిసిందే. పగటి వేళ ముగిసిన తర్వాత మొదలయ్యే రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఉండటంతో.. చంద్రయాన్ లోని పరికరాలు స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతాయి. వాటి నుంచి మళ్లీ మేల్కొనటం సాధ్యం కాదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి.. అవి నిద్రాణ స్థితి నుంచి మేల్కొనే వీల్లేదు. తాజాగా చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాలు తమ నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చి.. తానున్న దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవల్ని పునరుద్దరించుకున్నట్లుగా తెలిపే సంకేతాల్ని పంపటం ఆసక్తికరంగా మారింది.

చంద్రయాన్ 3లో పలు సంస్థలకు చెందిన "ఎల్ఆర్ ఏ" (లేజర్ రెట్రో రెఫ్లెక్టర్) అమర్చినప్పటికీ నాసాకు చెందిన ఎల్ఆర్ ఏ మాత్రం తన పని తీరును ప్రదర్శిస్తోంది. దాదాపు 20గ్రాముల బరువు ఉండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే సామర్థ్యంతో రూపొందించారు. అనూహ్యంగా దాని నుంచి సిగ్నళ్లు రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని బెంగళూరుకు చెందిన ఇస్రో అధికారులు తాజాగా ధ్రువీకరించటం అందరిని ఆశ్చర్యంతో పాటు.. ఆనందంలో ముంచేత్తేలా చేస్తోంది.