Begin typing your search above and press return to search.

విక్ర‌మ్‌, ప్ర‌జ్ఞాన్ సైలెంట్ మోడ్‌.. చంద్రయాన్ 3 చాప్ట‌ర్ క్లోజ్‌?

ఈ క్రమంలోనే నిద్రాణస్థితిలో ఉన్న ల్యాండర్‌, రోవర్‌తో అనుసంధానం అయ్యేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పంద‌న రావ‌డంలేదు. దీంతో ల్యాండ‌ర్‌, రోవ‌ర్ చాప్ట‌ర్ క్లోజ్ అయిందా?

By:  Tupaki Desk   |   26 Sep 2023 2:53 PM GMT
విక్ర‌మ్‌, ప్ర‌జ్ఞాన్ సైలెంట్ మోడ్‌.. చంద్రయాన్ 3 చాప్ట‌ర్ క్లోజ్‌?
X

అగ్ర‌దేశాలు ఆశ్చ‌ర్య‌పోయేలా చంద్ర‌యాన్ 3 ప్ర‌యోగం విజ‌య‌వంతం చేసి చూపించిన భార‌త్‌... త‌దుప‌రి ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఒకింత ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌ను ఎదుర్కుంటోంది. చంద్ర‌యాన్ 3 ద్వారా జాబిల్లిపై అడుగిడిన‌ విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ తాజాగా స్త‌బ్ధుగా మారిపోయాయి. 14 రోజుల పాటు జాబిల్లిపై పరిశోధనలు జరిపి అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని భూమికి పంపించగా..... జాబిల్లి స‌మ‌యం ప్ర‌కారం సూర్యోద‌యం అయిన‌ప్ప‌టికీ ఈ రెండూ ఎలాంటి సంకేతాలు పంప‌క‌పోవ‌డంతో...చంద్ర‌యాన్ తుది ఫ‌లితం గురించి క‌ల‌వ‌రం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ విక్రమ్‌ దిగిన సంగతి తెలిసిందే. చంద్రుడి వాతావ‌ర‌ణం ప్ర‌కారం 14 రోజులు ఒక ప‌గ‌టి స‌మ‌యం అవుతుంది. ఆ ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లు 14 రోజులు పనిచేసేలా వీటిని రూపొందించ‌గా ఈ మేర‌కు విజ‌య‌వంతంగా నిర్దేశిత 14 రోజుల పాటూ జాబిల్లి రహస్యాలను భూమికి చేర్చాయి. చంద్ర‌యాన్ 3 యొక్క‌ శివశక్తి పాయింట్ నుంచి రోవర్ 100 మీటర్లకు పైగా ప్రయాణం చేసి.. చంద్రునిపై సల్ఫర్, ఇనుము, ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికిని నిర్ధారించి అక్కడి ఉష్ణోగ్రత వివరాలను కూడా భూమికి పంపించాయి. అయితే, 'చంద్రుడిపై పగటి సమయం' ముగిసిపోవ‌డంతో సెప్టెంబర్‌ 2వ తేదీన ల్యాండర్‌, రోవర్‌ను నిద్రాణ స్థితిలోకి చేర్చారు. అయితే, ఆ త‌దుప‌రి వాటిని నిద్రాణ స్థితి నుంచి మేల్కొలిపేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నించాల్సి వ‌స్తోంది.

చంద్రుడిపై తెల్లవారుజాము ఈ నెల 20 నుంచి మొదలయింది. చంద్రుడిపై మైనస్‌ 200 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండటం వ‌ల్ల అత్యంత శీతల పరిస్థితులకు గురైన ల్యాండర్‌, రోవర్‌.. ఈనెల 22వ తేదీన మేల్కోవాల్సి ఉన్న‌ప్ప‌టికీ వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందడం లేదు. ఈ క్రమంలోనే నిద్రాణస్థితిలో ఉన్న ల్యాండర్‌, రోవర్‌తో అనుసంధానం అయ్యేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పంద‌న రావ‌డంలేదు. దీంతో ల్యాండ‌ర్‌, రోవ‌ర్ చాప్ట‌ర్ క్లోజ్ అయిందా? చంద్రయాన్‌-3 కథ కంచికేనా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

మ‌రోవైపు ఈ ప్రచారంపై ఇస్రో స్పందించింది. సెప్టెంబర్‌ 30న చంద్రుడిపై సూర్యాస్తమయం కానుంద‌ని పేర్కొంటూ తదుపరి సూర్యాస్తమయం వరకు ల్యాండర్, రోవర్‌లతో కాంటాక్ట్ అయ్యేందుకు తమ‌ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామ‌ని తెలిపింది. ఇప్పుడు ఆ పాయింట్ వ‌ద్ద‌నుంచే సెప్టెంబ‌ర్ 30 మేల్కొనే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నామ‌ని ఈ మేర‌కు ప్ర‌యోగాలు చేస్తున్నామ‌ని వెల్ల‌డించింది. సూర్యాస్తమయానికి మరో ఐదు రోజులు సమయం ఉంద‌ని పేర్కొంటూ శివశక్తి పాయింట్ వద్ద నిద్రావస్థలో ఉన్న ఆ రెండూ తిరిగి మేల్కొంటాయని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావంతో ఉన్నారు.