Begin typing your search above and press return to search.

చిరంజీవితో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడి భేటీ.. అందుకేనా?

ప్రముఖ నటుడు చిరంజీవితో మాజీ ఐఏఎస్‌ అధికారి, బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ సమావేశమయ్యారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 1:04 PM GMT
చిరంజీవితో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడి భేటీ.. అందుకేనా?
X

ప్రముఖ నటుడు చిరంజీవితో మాజీ ఐఏఎస్‌ అధికారి, బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ సమావేశమయ్యారు. ఈ భేటీ రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. జనసేన పార్టీలో చేరడానికి తోట చంద్రశేఖర్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారని.. ఇందులో భాగంగా చిరంజీవి ఆశీస్సులు పొందడానికి వచ్చారని తెలుస్తోంది.

ఐఏఎస్‌ అధికారి అయిన తోట చంద్రశేఖర్‌ గతంలో మహారాష్ట్రలోని పుణె నగరపాలక సంస్థకు కమిషనర్‌ గా పనిచేశారు. 99 టీవీకి అధినేతగా ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తొలిసారి గుంటూరు ఎంపీగా పోటీ చేసిన తోట చంద్రశేఖర్‌ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. వైసీపీ తరఫున 2014లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ లో విభేదించి ఆ పార్టీకి తోట చంద్రశేఖర్‌ రాజీనామా చేశారు. హైదరాబాద్‌ లో కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని, ఏపీ ప్రజలు కేసీఆర్‌ పాలనను కోరుకుంటున్నారని అప్పట్లో తోట హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఇందులో భాగంగా గుంటూరులో ఏపీ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ లో చేరికలపై దృష్టి సారించినా ఎవరూ చేరలేదు. తోట చంద్రశేఖర్‌ తోపాటు అప్పట్లో బీఆర్‌ఎస్‌ లో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు తాజాగా వైసీపీలో చేరిపోయారు. వైఎస్‌ జగన్‌ సమక్షంలో రావెల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

రావెల రాజీనామాతో ఏపీ బీఆర్‌ఎస్‌ లో తోట చంద్రశేఖర్‌ ఒక్కరే మిగిలారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో తోట కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అందులోనూ టీడీపీ–జనసేన పొత్తు ఉండటంతో ఈసారి గెలవచ్చని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో చేరి గుంటూరు లేదా ఏలూరు ఎంపీగా పోటీ చేయాలని తోట చంద్రశేఖర్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు టీడీపీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. దీంతో తోటకు ఆశలు చిగురించాయి. టీడీపీ అభ్యర్థుల వెతుకలాటలో ఉంది. ఈ నేపథ్యంలో కూటమి తరఫున జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని తోట చంద్రశేఖర్‌ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తోట చంద్రశేఖర్‌.. చిరంజీవిని కలిశారని చెబుతున్నారు. చిరంజీవి ద్వారా పవన్‌ పైన ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. తోట కూడా రాజీనామా చేస్తే ఇక ఏపీలో బీఆర్‌ఎస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని అంటున్నారు.