Begin typing your search above and press return to search.

తెలంగాణ వ్యక్తికి ఏపీలో చంద్రబాబు టికెట్‌!

కాగా ఎస్సీలకు రిజర్వు చేసిన బాపట్ల ఎంపీ సీటును తెలంగాణకు చెందిన బీజేపీ నేతకు కేటాయించడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

By:  Tupaki Desk   |   23 March 2024 5:05 AM GMT
తెలంగాణ వ్యక్తికి ఏపీలో చంద్రబాబు టికెట్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు మూడో విడత జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో విడతలో 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా నాలుగు పార్లమెంటు స్థానాలకు, ఐదు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

కాగా ఎస్సీలకు రిజర్వు చేసిన బాపట్ల ఎంపీ సీటును తెలంగాణకు చెందిన బీజేపీ నేతకు కేటాయించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. బాపట్ల ఎంపీ సీటును విశ్రాంత ఐపీఎస్‌ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్‌ కు చంద్రబాబు కేటాయించారు. ఈ నిర్ణయంతో టీడీపీ శ్రేణులే ఆశ్చర్యపోయాయంటున్నారు.

కృష్ణప్రసాద్‌ తెలంగాణ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి కాకుండే ఆయన పుట్టి పెరిగింది అంతా తెలంగాణలోనే అని చెబుతున్నారు. బాపట్ల స్థానానికి అభ్యర్థి దొరక్కపోవడంతోనే చాలారోజులపాటు అన్వేషణ కొనసాగించి చివరకు ఆయనను ఎంపిక చేశారని అంటున్నారు.

కృష్ణప్రసాద్‌ అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్‌ నేత శమంతకమణి అల్లుడు అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఆయన తెలంగాణ కేడర్‌ కు వెళ్లారని చెబుతున్నారు. అక్కడ డీజీపీ హోదాలో ఆయన పదవీ విరమణ చేశారని అంటున్నారు.

వాస్తవానికి బాపట్ల సీటును మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావుకు ఇవ్వాలని చూశారు. అయితే ఆయనకు చిత్తూరు సీటు ఇచ్చి ఆఖరి నిమిషంలో కృష్ణప్రసాద్‌ కు బాపట్ల సీటు ఇచ్చారు. వాస్తవానికి.. వరంగల్‌ ఎంపీ సీటు నుంచి బీజేపీ తరఫున పోటీచేసేందుకు కృష్ణప్రసాద్‌ ప్రయత్నించారని చెబుతున్నారు. అయితే ఆయనకు బీజేపీ అక్కడ సీటు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అ­నూహ్యంగా బాపట్ల సీటు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చిత్తూరు అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి. 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన బాపట్ల టికెట్‌ ఆశించారు. కానీ చిత్తూరులో గట్టి అభ్యర్థి అవుతారన్న ఉద్దేశంతో చంద్రబాబు అక్కడ చాన్సు ఇచ్చారు.