Begin typing your search above and press return to search.

పీకేతో షేక్ హ్యాండ్ : ఇదేం నేలబారుడు వ్యూహం బాబూ...!?

ఒక వైపు యువగళం ముగింపు సభ సూపర్ సక్సెస్ ఇక అధికారంలోకి రావడం తరువాయి అని అంటూ మళ్లీ ఏమి కొంప మునిగింది అని పీకే వ్యూహాల సాయం టీడీపీకి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు

By:  Tupaki Desk   |   24 Dec 2023 3:44 AM GMT
పీకేతో షేక్ హ్యాండ్ : ఇదేం నేలబారుడు వ్యూహం బాబూ...!?
X

మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికల వేళ చేస్తున్నదేంటి అన్నది చర్చకు వస్తోంది. ఆయన నిన్న తిట్టిన వారిని నేడు దగ్గరకు పిలిచి మంతనాలు జరపడం ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఎంత వ్యూహాలు ఎత్తులు అనుకున్నా ఎంతో కొంత మాట మీద నిలబడి ఉండడం ఉండాలి కదా అని అంటున్నారు.

చంద్రబాబు పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ తో భేటీ కావడాన్ని ఇపుడు అంతా విస్మయంగా చూస్తున్నారు. బీహార్ కి చెందిన పీకే ఏపీని వదిలి చాలా కాలం అయింది. ఆయనకంటూ సొంత టీం లేదు, ఆయన వ్యూహాలు కూడా ఇపుడు పారడంలేదు, తానుగా రాజకీయాలలో రాణిద్దామని అనుకున్నా అది ఆయన వల్ల కావడంలేదు.

బీఆర్ఎస్ వారు సైతం మొదట్లో పీకేని సంప్రదించి ఆయనతో తమ వల్ల కాదని వదులుకున్నారు. జగన్ కూడా 2019 ఎన్నికల తరువాత పీకేని పక్కన పెట్టారు అని అంటున్నారు. అలాంటి పీకే ఇపుడు టీడీపీకి శరణ్యం అయిందా అన్నదే చర్చగా ఉంది. ఒక వైపు యువగళం ముగింపు సభ సూపర్ సక్సెస్ ఇక అధికారంలోకి రావడం తరువాయి అని అంటూ మళ్లీ ఏమి కొంప మునిగింది అని పీకే వ్యూహాల సాయం టీడీపీకి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు

ఇది టీడీపీకి తన పట్ల విశ్వాసం తగ్గిందని చెప్పే పరిస్థితి కాదా అని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే పీకే ఈ టైం లో ఏమి చేయగలరని కూడా అంటున్న వారూ ఉన్నారు. వైసీపీకి పీకే వ్యూహకర్తగా సేవలు అందించినపుడు ఆయనకు గరిష్టంగా రెండేళ్ల టైం ఉంది. పైగా సొంత నెట్ వర్క్ టీం ఉన్నాయి. ఇపుడు కేవలం ఆయన అడ్వైజర్ గానే ఉంటారు.

ఇక పీకే టీడీపీని లేపే ప్రయత్నం అతి తక్కువ సమయంలో చేయగలరా అలా ఆయన చేస్తారూ అనుకుంటే టీడీపీ అయిదేళ్ల పోరాటం సంగతేంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పీకేని నానా మాటలు అని ఇపుడు ఆయనతోనే షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా చంద్రబాబు జనాలు అన్నీ మరచిపోయారు అనుకున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంతే కాదు తన కంటే తన నాయకత్వం కంటే కూడా పీకే వ్యూహాలు ఆయన మేధస్సు ఎక్కువ అని బాబు ఒప్పుకుంటున్నారా అన్నది మరో ప్రశ్నగా ఉంది.

ఇక పీకే విషయంలో టీడీపీ గతంలో ఎన్నో మాటలు అంది. పీకే కోడి కత్తి డ్రామా ఆడించారని అంది. అలాగే వివేకా హత్య కేసు వెనకాల కూడా పీకే ప్లాన్ ఉంది అని విమర్శించింది. ఇపుడు వాటి సంగతేంటి అని మంత్రి గుడివాడ అమరనాధ్ ప్రశ్నిస్తున్నారు. పీకే మీద నాడు చేసిన విమర్శలు అన్నీ తప్పులా లేక ఇపుడు పీకే మంచి వాడు అయితే ఆయన వ్యూహాలు కరెక్ట్ అయితే బాబు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి పేర్ని నాని అయితే మేము వదిలేసిన పీకేని గతిలేక చంద్రబాబు తెచ్చుకున్నారు అంటే టీడీపీ దుస్థితి ఏంటో అర్ధం అవుతోంది అని అంటున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వల్ల కాదని పీకేని సీన్ లోకి తెచ్చారా అని ఆయన అడుగుతున్నారు. మొత్తానికి పీకేని పిలిచి చంద్రబాబు వైసీపీని కార్నర్ అయ్యారా అన్నదే చర్చగా ఉంది. అంతే కాదు జనాలలో జగన్ బలవంతుడని మళ్లీ మళ్లీ చెబుతున్నారా ఈ రకమైన నేలబారుడు వ్యూహాలతో టీడీపీ అటు పార్టీ జనాలకు ఇటు సాధారణ జనాలకు ఏ రకమైన సంకేతం ఇస్తోంది అని కూడా ప్రశ్నిస్తున్నారు.