Begin typing your search above and press return to search.

బాబు దందా స్టైల్: స్టీల్ అంటే డబ్బు.. టన్ను అంటే కోటి!

By:  Tupaki Desk   |   5 Sep 2023 4:19 AM GMT
బాబు దందా స్టైల్: స్టీల్ అంటే డబ్బు.. టన్ను అంటే కోటి!
X

సాధారణంగా సినిమాల్లో రౌడీలూ, గూండాలు, స్మగ్లర్లు వంటివారు కోడ్ భాషతో డ్రగ్స్, అక్రమ ఆయుధాలు వంటివి సరఫరా చేస్తుండే సన్నివేశాలు ఉండటం తెలిసిందే. ఇదే క్రమంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా పట్టుబడుతున్న డ్రగ్స్ దందాలలో కూడా ఇలాంటి విషయాలే వెలుగులోకి వస్తున్నాయని అంటారు. సరిగ్గా చంద్రబాబు & కో స్టైల్ దందా కూడా ఇలానే సాగిందనే చర్చ తాజా ఐటీ నోటీసులతో తెరపైకి వచ్చింది.

అవును... అచ్చం డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాళ్ళ మాదిరి... అంతర్జాతీయ మాఫియా డాన్లు తరహా... అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసే అరాచకశక్తుల స్థాయిల్లో.. చంద్రబాబు అండ్ గ్యాంగ్ కూడా కోడ్ భాష వాడి రూ.కోట్లు కొట్టేసిందని తెలుస్తుంది! సుమారు రూ. 8వేలకోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు అప్పగించిన షాపూర్జీ-పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల నుంచి ముడుపులు రూపేణా చంద్రబాబు తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా రూ. 118 కోట్లు తీసుకున్నారని ఐటీ శాఖ గుర్తించింది.

ఆయితే ఈ వ్యవహారంలో ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు అంతా కోడ్ భాషను వినియోగించారట బాబు & కో! ఇందులో భాగంగా... డబ్బును ఏయే ప్రాంతాలకు ఎలా బదిలీ చేయాలన్న దానికి సంబంధించి కూడా పగడ్బందీగా ఉండేలా ఒక కోడ్ భాషను ఉపయోగించారని తెలుస్తుంది. హైదరాబాద్ లోని వారికీ డబ్బు వేయాలంటే "హె.ఐ.డి."అని రాశారు. విజయవాడలోని తమ అనుయాయులకు పంపాలి అంటే "విజయ్" అని, విశాఖలోని వారికి పంపాలి అంటే "విష్" అని, బెంగళూరు వారికి ఐతే "బాంగ్" అని వారిమధ్య వాట్సాప్ చాట్ సంభాషణ నడిచిందని తెలుస్తుంది.

ఈ మేరకు దానికి సంబంధించిన ఈమెయిల్ స్క్రీన్ షాట్స్ వెలుగులోకి వచ్చాయి! ఇదే సమయంలో ఎక్కడా కూడా డబ్బుకు సంబంధించి క్యాష్ అనే పదం వాడకపోవడం గమనార్హం. వీరు డబ్బుకి పెట్టిన కోడ్ నేం "స్టీల్"! అంటే... స్టీల్ అంటే డబ్బు అని చెబుతూ దాన్ని టన్నుల్లో పేర్కొన్నారట! టన్ను అంటే కోటి అనే అర్థం వచ్చేలా వారిమధ్య కోడ్ భాషను ఏర్పాటు చేసుకుని టన్నుల్లో కోట్లను కొట్టేశారని అంటున్నారు!

సదరు కాంట్రాక్ట్ కంపెనీలకు కన్సల్టెంట్ గా పని చేస్తున్న మనోజ్ వాసుదేవ్ పార్థసానికి, చంద్రబాబు పీఏకు మధ్య నడిచిన చాట్ సంభాషణ, డబ్బుల చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్ తదితర ఆధారాలకు సంబంధించిన వాట్సప్ స్క్రీన్ షాట్స్ సైతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది.

అలవాటులో భాగంగా... అడ్డం తిరిగిన బాబు!:

చంద్రబాబు సదరు సంస్థలనుంచి ముడుపులు మింగినట్లుగా గుర్తించిన ఐటి అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు! అయితే ఆ నొటీసులకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు సరికదా... ఎదురు దాడి చేసే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… “మీ అధికార పరిధి ఏమిటో తెలుసుకోండి, నాకు నోటీసులు ఇచ్చే అధికారం హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ కు లేదు, సెంట్రల్ కార్యాలయానికి ఏ కేసును బదిలీ చేయకుండానే తనకు నోటీసులు ఇచ్చారు” అంటూ ఎదురుదాడి చేశారు!

తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సీబీఐ ని రాకుండా చేసినట్లుగా ఐటీని చేయలేకపోవడమే కారణమో ఏమో కానీ... ఈ మేరకు అయన 2022 అక్టోబర్ 10, 2023 జనవరి 31, జూన్ 20 తేదీల్లో ఆదాయపుపన్ను శాఖవారికి లేఖలు రాశారు. అయితే... ఈ లేఖలకు అధికారుల నుంచి కూడా అంతే స్ట్రాంగ్ గా సమాధానం వచ్చింది.

"మా నియమ, నిబంధనలు మాకు తెలుసు.. ముందు ఈ డబ్బుకు సంబంధించి వివరణ ఇవ్వండి" అంటూ దాదాపు 46 పేజీల నోటీసులు పంపించారు! దీంతో ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అత్యంత దయణీయంగా ఉందని.. దీంతో ఏమిచేయాలో దిక్కుతోచక ఢిల్లీ వెళ్లారని.. ఈ ప్రయత్నంలో భాగంగానే పెద్దల ప్రసన్నత కోసం ప్రాకులాడుతున్నారని అంటున్నారు!

మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరగబోతోంది.. బాబు భవిష్యత్తుపై ఏ మేరకు ప్రభావం చూపబోతోంది అనేది వేచి చూడాలి!