Begin typing your search above and press return to search.

బాబుకు ష్యూరిటీ ఇచ్చింది వీరే... జడ్జి అడిగిన ప్రశ్నలివే!

అనంతరం చంద్రబాబు బయటకు రావడంతో సాయంత్రం 4:45 గంటలకు జైలు చంద్రబాబు వాహనశ్రేణికి బయలుదేరింది

By:  Tupaki Desk   |   1 Nov 2023 5:25 AM GMT
బాబుకు ష్యూరిటీ ఇచ్చింది వీరే... జడ్జి అడిగిన ప్రశ్నలివే!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి 52 రోజుల తర్వాత మంగళవారం మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. కేసు మెరిట్స్ తో సంబంధం లేకుండా కేవలం ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో... విధించిన షరతుల్లో ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ కూడా ఒకటిగా ఉంది. ఈ సమయంలో ఇద్దరు టీడీపీ నేతలు ముందుకొచ్చారు!

అవును... స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ష్యూరిటీలు సమర్పించడానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు హైకోర్టు తీర్పు రాగానే విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరయ్యారు!

ఈ సందర్భంగా... ఇద్దరూ చెరో రూ.లక్ష చెల్లించి, చంద్రబాబు కోసం ష్యూరిటీలను సమర్పించారు. తర్వాత న్యాయమూర్తి జస్టిస్ హిమబిందు వీరిద్దరినీ ప్రశ్నించారు. అందులో భాగంగా ఇద్దరి పేర్లూ అడిగిన ఆమె.. ఎవరికి ష్యూరిటీ ఇస్తున్నారో తెలుసా..? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... చంద్రబాబుకు అని వారు చెప్పారు. అనంతరం... ష్యూరిటీగా ఎంత మొత్తం చెల్లించారు? అని ప్రశ్నించగా.. రూ.లక్ష చెల్లించామని సమాధానమిచ్చారు.

కాగా... మంగళవారం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వార్త రాగానే 3 గంటల సమయంలో లోకేశ్‌, బ్రాహ్మణి, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి చంద్రబాబుతో ములాఖత్‌ కు జైల్లోకి వెళ్లారు. 4 గంటల సమయంలో వారు బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జైలు బయట ఎదురుచూస్తున్న టీడీపీ నాయకులను భుజం తట్టి పలకరించారు. అంతకముందు అచ్చెన్నాయుడిని ఆలింగనం చేసుకున్నారు.

అనంతరం చంద్రబాబు బయటకు రావడంతో సాయంత్రం 4:45 గంటలకు జైలు చంద్రబాబు వాహనశ్రేణికి బయలుదేరింది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి రావడంతో... కొన్నిచోట్ల గంటకు పది కి.మీ. వేగంతో కూడా ప్రయాణం సాగలేని పరిష్తితి నెలకొంది. దీంతో సుమారు పదమూడున్నర గంటల ప్రయాణం తర్వాత బుధవారం ఉదయం 6:00 గంటల ప్రాంతంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.