Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి జరిగిన కేసు... కోర్టు సంచలన తీర్పు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అలిపిరి వద్ద బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Dec 2023 5:58 AM GMT
చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి జరిగిన కేసు... కోర్టు సంచలన తీర్పు!
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అలిపిరి వద్ద బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడికి సంబంధించిన కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా నాడు జరిగిన దాడి కేసులో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా సెషన్సు న్యాయస్థానం తీర్పు నిచ్చింది.

అవును... 2003లో అలిపిరి వద్ద జరిగిన దాడి కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ.. తిరుపతి నాలుగో అదనపు జిల్లా సెషన్సు న్యాయస్థానం ఇన్‌ఛార్జి న్యాయమూర్తి జి.అన్వర్‌ బాషా తీర్పు ఇచ్చారు. 2003 అక్టోబరు నెలలో అలిపిరి దగ్గర పీపుల్స్‌ వార్‌ గ్రూపు మందుపాతర పేల్చడంతో చంద్రబాబుకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే!

2003 అక్టోబరులో అలిపిరి వద్ద మందుపాతర పేలడంతో చంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో... ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపింది. ఇందులో భాగంగా నాటి పీపుల్స్‌ వార్‌ అగ్రనేతలతో సహా 33 మందిపై కేసు నమోదు చేసి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

ఈ క్రమంలో.. ఆ 33 మందిలో తిరుపతికి చెందిన జి.రామమోహన్‌ రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఎస్‌.నరసింహారెడ్డి, కేశవలపై విచారణ అనంతరం తిరుపతి సహాయ సెషన్సు కోర్టు ఒక్కొక్కరికి 4ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ 2014లో తీర్పు ఇచ్చింది. దీంతో వారు జిల్లా కోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ అప్పీల్ పై జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరిస్తూ... ఆ ముగ్గురూ నిర్దోషులని ప్రకటించింది.

గతంలో ఈ కేసులో కడప జిల్లాకు చెందిన ముప్పిరెడ్డి రామస్వామిరెడ్డి, కొల్లం గంగిరెడ్డి, ఎన్‌.పాండురంగారెడ్డి, జోతెం నాగార్జునలకు కింది కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది. దీంతో నాడు ఆ నలుగురు నిందితులు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కేసును తిరుపతిలోని నాలుగో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టుకు బదిలీ చేశారు.

ఈ సమయంలో విచారణ అనంతరం కొల్లం గంగిరెడ్డి, ఎన్.పాండురంగారెడ్డిలను న్యాయమూర్తి నిర్దోషులుగా ప్రకటించగా.. ముప్పిరెడ్డి రామస్వామిరెడ్డి, జోతెం నాగార్జునలపై రివిజన్‌ పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌ లో ఉంది.

కాగా... 2003 అక్టోబరులో అప్పటి సీఎం చంద్రబాబు, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వెళ్తున్న సమయంలో... ఆయనపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... నక్సలైట్లు క్లెమోర్‌ మైన్లు అమర్చడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం అప్పటి పీపుల్స్‌ వార్‌ అగ్రనేతలతో పాటు పలువురు ఈ దాడికి సహకరించారంటూ మొత్తం 33మందిపై చార్జిషీటు దాఖలు చేసింది.