Begin typing your search above and press return to search.

బీజేపీ కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు ...అందుకే...!?

భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తెగ ఆరాటపడుతున్నారు.

By:  Tupaki Desk   |   24 Feb 2024 9:06 AM GMT
బీజేపీ కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు ...అందుకే...!?
X

భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తెగ ఆరాటపడుతున్నారు. ఏపీలో అర శాతం ఓటు షేర్ మాత్రమే కలిగి ఉన్న బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు ఎదురు చూస్తున్నరు. ఈ నెల మొదటివారంలో ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలసివచ్చిన తరువాత ఆ పార్టీ ఏమి చెప్పిందో ఏ రకమైన ప్రతిపాదనలు చేసిందో తెలియదు కానీ ఇన్నాళ్ళూ ఆగి ఇపుడు ఏకంగా 118 మంది అభ్యర్ధులతో జనసేనతో కలసి టీడీపీ ఉమ్మడి జాబితాను రిలీజ్ చేసింది.

అందులో జనసేనకు ముష్టి వేసినట్లుగా కొన్ని సీట్లు విదిలించేసింది. ఆ సీట్లు చాలు అని జనసేన అధినాయకత్వం భావిస్తోంది. ఇక బీజేపీ కి ఎన్ని సీట్లు ఇస్తారో అన్నది ఒక చర్చగా ఉంది. బీజేపీ జాతీయ స్థాయిలో బలమైన పార్టీ. గట్టి పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న పార్టీ అందుకే బీజేపీ కోసం అన్నట్లుగా మూడవ వంతు సీట్లనే బాబు రిజర్వ్ చేసి పెట్టారు అని అంటున్నారు.

ఏపీలో ఉన్న మొత్తం 175 సీట్లలో 118 సీట్లను ప్రకటించిన బాబు 57 సీట్లను మాత్రం అలాగే పక్కన ఉంచేశారు. అంటే ఇందులో బీజేపీ కోరిన సీట్లు ఇచ్చేందుకే అని అంటున్నారు. బీజేపీతో సీట్ల పితలాటకం ఇంకా తెగలేదు అనడానికి ఈ రిజర్వ్ చేసిన సీట్ల నంబరే సాక్ష్యం అని అంటున్నారు.

ఒక వైపు బీజేపీకి ఏపీలో బలం లేకపోయినా సీట్లు ఎక్కువ ఇచ్చేందుకే చంద్రబాబు సిద్ధపడుతున్నారు అని అంటున్నారు. బీజేపీ ఎన్ని అడిగితే అన్ని సీట్లు ఇస్తారా అంటే బాబు సొంతంగా నెగ్గలేమన్న భయంతోనే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. బీజేపీకి సీట్లు ఇచ్చిన తరువాతనే టీడీపీ చివరి జాబితా రిలీజ్ అవుతుంది అన్నది చూస్తే కనుక టీడీపీ దైన్యానికి ఇది ఒక నిదర్శనం అని అంటున్నారు.

టీడీపీ గతంలో ఎపుడూ ఇలా లేదని ఇపుడు మాత్రం సొంతంగా ఎన్నికలకు పోకూడదు అన్న ఉద్దేశ్యంతోనే ఎంతకైనా తగ్గాలని చూస్తోందని, ఫలితంగా అడుగులు పాతాళం వైపే పడుతున్నాయని అంటున్నారు. బీజేపీ ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు ఓకే అన్నట్లుగా బాబు 57 సీట్లు అలా రిజర్వ్ చేయడాన్ని చూసిన వారు టీడీపీ హిస్టరీ గత వైభోగం ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో తమకు తిరుగులేదని వైసీపీ పని అయిపోయిందని బాబు చెబుతున్నారు. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్న నాడే వైసీపీకి ఓటమి అన్నది అర్ధం అయిందని గంభీరంగా ప్రకటిస్తున్నారు. మరి అంత నిబ్బరంగా ఉన్న బాబు మొత్తానికి మొత్తం లిస్ట్ ని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు అన్న చర్చ వస్తోంది.

ఏపీలో బీజేపీ పెద్ద నంబర్ అడిగితే ఇచ్చేందుకు కూడా బాబు సిద్ధమా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అలా కనుక చూస్తే అది టీడీపీ పొత్తులతోనే తన అసమర్ధతను చాటుకుంటున్నట్లు కాదా అని కూడా అడుగుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతూ గెలిచేది మేమే అని చెబుతూ ఏపీలో ఎక్కడా లేని బీజేపీ కోసం భారీ సీట్ల మూటను ఉంచడంలోనే టీడీపీ భయం కనిపిస్తోంది అని అంటున్నారు.

పొత్తులు ఎక్కడైనా ఉభయతారకంగా ఉండాలి. కానీ టీడీపీ ఈ విషయంలో అన్ని రకాలుగా తిలోదకాలు ఇస్తూ రాజకీయంగా పార్టీని పతనానికి చేరుస్తూ తామే గెలుస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకోవడం పైనే అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రకటించిన లిస్ట్ తీరు చూస్తే కనీసం 120 సీట్లలోను అయినా పోటీ చేస్తుందా లేదా అన్న డౌట్లు కూడా వస్తున్నాయని అంటున్నారు.

ఏది ఏమైనా రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి హత్యలు ఉండవు అనడానికి బీజేపీతో పొత్తులే నిదర్శనం అంటున్నారు. చంద్రబాబు తెలివితో చేస్తున్నారా లేదా అన్నది తొందరలోనే తెలుస్తుంది అని కూడా అంటున్నారు.