Begin typing your search above and press return to search.

40 ఇయర్స్ ఇండస్ట్రీ ఏమైంది? చేయకూడని తప్పు చేస్తున్న చంద్రబాబు?

ఒకటా రెండా ఏకంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. అంత అనుభవం ఉన్న అధినేత తప్పులు చేస్తారా? అది కూడా కీలకమైన ఎన్నికల వేళలో..?

By:  Tupaki Desk   |   24 Feb 2024 6:00 AM GMT
40 ఇయర్స్ ఇండస్ట్రీ ఏమైంది? చేయకూడని తప్పు చేస్తున్న చంద్రబాబు?
X

ఒకటా రెండా ఏకంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. అంత అనుభవం ఉన్న అధినేత తప్పులు చేస్తారా? అది కూడా కీలకమైన ఎన్నికల వేళలో..? తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనంత ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న చంద్రబాబు.. వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు అధికారమే ఆలంబనగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఇదే చివరి ఎన్నికలన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. తన రాజకీయ అనుభవం మొత్తాన్ని రంగరించి మరీ అధికారంలోకి వచ్చేందుకు విపరీతంగా శ్రమిస్తున్నారు. మరి.. ఆయన శ్రమ బూడిదలో పోసిన పన్నీరు కానుందా?

పొత్తుల చిక్కుల్లోకి చిక్కుకున్న చంద్రబాబు.. ఆ దిశగా మరింత విష వలయంలోకి వెళ్లిపోతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. బలమైన ప్రత్యర్థి బరిలో ఉన్నప్పుడు.. ఆద్యంతం అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకుంటే అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. పొత్తులతో గెలుపు ధీమాతో ఉన్న చంద్రబాబు చేయకూడని తప్పు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కారణం.. ఆయన పొత్తుల్లో భాగంగా సీట్ల త్యాగం అవసరానికి మించినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

175 స్థానాలున్న ఏపీలో చంద్రబాబు కూటమిగా ప్రచారం జరుగుతున్న టీడీపీ.. జనసేన.. బీజేపీల్లో తెలుగుదేశం పార్టీదే తిరుగులేని అధిక్యత. జనసేనకు ప్రజాకర్షణ మెండుగా ఉన్న పవన్ కల్యాణ్ అధినేతగా ఉన్నప్పటికీ.. సభలకు క్రౌడ్ ఫుల్లర్ గా ఉండగలరే కానీ.. బ్యాలెట్ యుద్దంలో మాత్రం ఆయనది వెనకడుగే. ఏళ్లకు ఏళ్లు రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ క్రమపద్దతిలో పార్టీ నిర్మాణం జరపకపోవటం.. బలమైన అభ్యర్థులు లేకపోవటం ఆ పార్టీకి పెద్ద లోటుగా చెప్పాలి. ఇక.. బీజేపీ విషయానికి వస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మరి.. పొత్తు కోసం చంద్రబాబు ఎందుకంత ప్రాకులాడుతున్నారంటే.. కాల మహిమ అని చెప్పక తప్పదు.

ఎవరిని కాదనుకోలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు.. కాదనలేనిది వరంగా మారాలే కానీ శాపం కాకూడదంటున్నారు. మొన్నటివరకు పొత్తులు ప్లస్ అవుతాయన్న ప్రచారం జరిగింది. కానీ.. ఇప్పుడదే పెద్ద మైనస్ అన్న మాట చెబుతున్నారు. కారణం.. పొత్తులో భాగంగా జనసేన.. బీజేపీలు కోరుకుంటున్న సీట్ల సంఖ్యనే. తెలుగుదేశం బలంగా ఉన్న స్థానాల్ని జనసేన.. బీజేపీలు ఎంచుకుంటే.. టీడీపీ పరిస్థితి ఏంటి? అన్నది ప్రశ్న. రాజకీయాల్లో తలపండిన పలువురి అంచనా ప్రకారం పొత్తుల్లో భాగంగా జనసేన.. బీజేపీకి 30 కంటే ఎక్కువ సీట్లు ఇవ్వటం ప్రమాదకరమంటున్నారు. తాజాగా పరిణామాల్ని చూస్తే.. దాదాపు 50కు పైగా సీట్ల త్యాగం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. డేంజర్ లైన్ లోకి చంద్రబాబు వెళుతున్నట్లేనని చెప్పాలి.

దీనికి కారణం.. టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో టికెట్లను ఆశించటం ద్వారాకూటమి మిత్రులు గెలుపును అప్పనంగా ఆశిస్తున్నారు. మరి.. ఇంతకాలం టికెట్ కోసం కాచుకున్న తెలుగు తమ్ముళ్ల సీట్లను తన్నుకుపోయిన మిత్రులకు ఎంతవరకు సహకరిస్తారు? అన్నది ప్రశ్న. అదే సమయంలో బలహీనంగా ఉండే స్థానాల్లో గెలుపు అవకాశాలు ఏ లెక్కన చూసుకున్నా తక్కువే. అంటే.. గెలవాల్సిన స్థానాల్లో మిత్రులు గెలవక.. గెలవలేని స్థానాల్లో బరిలోకి దిగి తమ్ముళ్ల విజయానికి దెబ్బ పడితే.. చంద్రబాబు పొత్తు వ్యూహం వికటించటం ఖాయమంటున్నారు. పొత్తు లెక్కల్లో ఏ చిన్న పొరపాటు చేసినా చంద్రబాబు దిద్దుకోలేని తప్పు చేసినట్లేనని చెప్పాలి.

అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిత్రుల్ని కంట్రోల్ చేసే కన్నా.. రివర్సులో వారే ఆయన్ను కంట్రోల్ చేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి వేళ చంద్రబాబు చేయకూడని తప్పు చేయటానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉండి.. ఏం చేస్తే ఏం జరుగుతుందన్న అవగాహన ఉన్నప్పటికీ.. ఏం చేయకూడదో అదే చేయాల్సి రావటానికి మించిన బ్యాడ్ లక్ ఇంకేం ఉంటుంది? చంద్రబాబు తాజా పరిస్థితి కూడా అలానే ఉందన్న అభిప్రాయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.