Begin typing your search above and press return to search.

ఉగ్రవాది...విశ్వ గురువు ...చంద్రబాబు...ఏంది ఈ లాజిక్...!?

అప్టూ డేట్ గా తాను ఉన్నాను అని అంటారు కానీ చాలా విషయాల్లో ఆయన ఫిలసఫీ వేరుగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   18 March 2024 7:46 AM GMT
ఉగ్రవాది...విశ్వ గురువు ...చంద్రబాబు...ఏంది ఈ లాజిక్...!?
X

ఏ మాట అన్నా కూడా దానికి లాజిక్ ఉండాలి కదా. ఒక మనిషి మీద ఉన్న అభిప్రాయం ఎంత మార్చుకున్నా అది పాతాళానికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉండకూడదు కదా. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు చాలా చిత్రమైన మనిషి. ఆయన ఎర్లీ సెవెంటీస్ పాలిటిక్స్ చేస్తారు.

అప్టూ డేట్ గా తాను ఉన్నాను అని అంటారు కానీ చాలా విషయాల్లో ఆయన ఫిలసఫీ వేరుగా ఉంటుంది. తాను ఏమి చెబితే జనాలు అది నమ్ముతారని అతి విశ్వాసం బాబుకు చాలా ఉంది. అందుకే ఆయన నిన్నటి మాటలు అక్కడే ఉంచి నేడు కొత్త మాట అందుకుంటారు. ఇవన్నీ ఏ ఇరవై పాతికేళ్ల క్రితమైతే చెల్లేవి.

ఎందుకంటే ఆనాడు ఇపుడు ఉన్నంతగా మీడియా లేదు. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా విప్లవం అంతకంటే లేదు, ఇపుడు దానికి మించి ఉంది. సోషల్ మీడియా యుగం ఇది. స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రతీ వారి బుర్ర చాణక్యుడిని మించేలా ఉంది. తెర ముందే కాదు తెర చాటు ఏమి జరిగిందో వారికి తెలుసు. ఇక మరీ వెనక్కి వెళ్ళి అరవై డెబ్బై ఏళ్ల కాలం నాటి మ్యాటర్ ని కూడా వారు ఒక్క సెకన్ లో కనుక్కోగలరు.

కానీ చంద్రబాబు మాత్రం గతం అంతా మరచిపోతారు అని అనుకుంటున్నారు. సరిగ్గా అయిదేళ్ల క్రితం బాబు అన్న మాటలు యూ ట్యూబ్ లో నిక్షేపంగా ఉన్నాయి. మోడీని పట్టుకుని భార్యని వదిలేసారు, కుటుంబం లేదు అంటూ నానా రకాలుగా మాట్లాడారు. వాటికి మించినది మోడీని ఉగ్రవాదితో పోల్చడం. నిజంగా ఇది మోడీ మీద అల్టిమేట్ విమర్శ. ఈ తరహా విమర్శలు ఆయన ప్రత్యర్ధులు ఎవరూ చేయలేదు.

కానీ చంద్రబాబు మోడీని తానే ఢీ కొడుతున్నాను అన్న ఫీల్ లో 2019 ఎన్నికల వేళ నోరారా జారిన ఆణిముత్యాలలో ఇది ఒకటి. మోడీని ఉగ్రవాది అన్న నోటితోనే గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికి విశ్వగురువు అనేశారు. అదీ ఇదీ రెండూ అన్నది బాబే. విన్నది జనాలే. కానీ బాబు ఏ మాత్రం తడుముకోకుండా ఇలా అనేశారు.

మోడీ కళ్లలో ఆనందం చూడాలనో లేక గతంలో తాను తిట్టిన టిట్లకు ప్రాయశ్చిత్తంగా ఈ మాటలతో మోడీని ప్రసన్నం చేసుకోవాలనో చాలా పొగడ్తలు చేశారు. అందులో అందరినీ ఆకట్టుకున్నది గుర్తుండిపోయింది విశ్వ గురువు అన్నదే. నాడు ఉగ్రవాది అని ఎలా ఏ జంకూ గొంకూ లేకుండా అనగలిగారో ఇపుడు కూడా అంతే వాడిగా వేడిగా ఏ మాత్రం శషబిషలకు తావు లేకుండా మోడీని పొగిడేశారు.

ఈ విషయంలో తనకు ఉన్న నాలుగున్నర దశాబ్దాల పొలిటికల్ సీనియారిటీని కూడా పక్కన పెట్టేసారు. మూడు సార్లు సీఎం గా అయ్యాను అన్న అనుభవాన్ని కూడా అసలు తలచుకోలేదు. కేవలం మోడీ కళ్ళలో పడితే చాలు అనుకునే బాబు ఇలా అనేశారు. దాని కంటే ధీమా ఏంటి అంటే జనాలు ఎపుడూ తాను ఏది అంటే అదే వింటారు అదే నమ్ముతారు. తాన కళ్ళలో చూస్తూ తన బుర్రతోనే ఆలోచిస్తారు అన్నదే బాబు అతి విశ్వాసం.

కానీ బాబుకు తెలియనిది ఏమిటి అంటే జనాలు బాబుకు అలాగే చూస్తున్నారు. అయిదేళ్ల క్రితం ఏమన్నారు, ఇపుడు ఎందుకు ఇలా అన్నారు. ఏమిటి ఈ మార్పు. ఎంత రాజకీయం అయినా మరీ ఇంతలా దిగజారిపోవాలా అని కూడా అనుకుంటూ బాబు తీరుని కళ్లార్పకుండా చూస్తున్నారు.

ఇక ఇంకాస్తా ఫ్లాష్ బ్యాక్ లోకి అంటే 2014లోకి వెళ్తే ఇదే మోడీ చంద్రబాబు పవన్ ముగ్గురూ వేదికల మీదకు ఎక్కితే చాలు ఒకరిని ఒకరు తెగ పొగుడుకునేవారు. ఆనాడు వాతావరణం వేరు. ముగ్గురూ విభజన ఏపీకి ఫ్రెష్ గా కనిపించారు కాబట్టి ఎవరు ఏమన్నా కూడా చెల్లిపోయింది. కానీ ఇపుడు అలా కానే కాదు, కాలం మారింది. 2024 వచ్చింది. జనాలు ఇంకా విజ్ఞులు అయ్యారు.

ఇక 2018 దాకా ఈ ముగ్గురు స్నేహం బాగా పండింది. మొదట కూటమి నుంచి బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు అని పవన్ ఏకంగా బహిరంగ సభలలో మోడీ మీద ఊగిపోయారు. ఆ తరువాత వంతు చంద్రబాబుది. ఆయన మోడీని ఉగ్రవాదితో పోల్చి ఊరుకోలేదు, ఉగ్రవాది కంటే ప్రమాదం అని ఒక కఠినమైన విశ్లేషణాన్ని వాడేశారు.

మోడీ ఏదో రోజు దేశాన్ని విడిచి పారిపోతారు అని కూడా అన్నారు. ఇక మోడీ కూడా బాబుని అనాల్సినవి నాలుగు అన్నారు. 2019 ఎన్నికల వేళ ఏలూరులో ప్రచారనికి వచ్చిన మోడీ పోలవరాన్ని ఏటీఎం లా చంద్రబాబు వాడుకుంటున్నారు అని దారుణంగా విమర్శించారు. బాబుని కంపరమెక్కించే విధంగా నాడు మోడీ విమర్శలు ఉన్నాయి.

సీన్ కట్ చేస్తే చిలకలూరిపేట మీటింగులో మోడీని విశ్వ గురువు అనేశారు చంద్రబాబు. అసలు ఉగ్రవాదికి విశ్వ గురువుకు ఏమైనా పొంతన ఉందా. లేక బాబులో వచ్చిన ఈ ఆకస్మిక మార్పు దేని కోసం. మరీ ఇంత చవకబారుగా మాట్లాడితే జనాలలో ఉన్న ఇమేజ్ అయినా పోతుందని ఎందుకు ఆలోచించరు అన్నదే చర్చగా ఉంది.

మోడీ జపం చేయడం ద్వారా బాబు తనను తాను అన్ని విధాలుగా దిగజార్చుకున్నారు అనే అంటున్నారు. మోడీ ఉగ్రవాదా విశ్వగురువా అసలు ఆయన ఏమిటి అన్నది జనాలకు తెలుసు. కానీ ఈ మాటలు అంటూ చంద్రబాబే తన నాలికనే కాదు రాజకీయాన్ని కూడా మడతెట్టేసుకున్నారు అని అంటున్నారు. హుందాగా రాజకీయాలు చేయాలి, విమర్శలు అలాగే ఉండాలి, హద్దు మీరి చేసిన విమర్శలు లేక ప్రశంసలు నవ్వుల పాలు అవుతాయి అనడానికి బాబే నిలువెత్తు ఉదాహరణ అని అంటున్నారు.