Begin typing your search above and press return to search.

దళితులను, పేదలను మరోసారి అవమానించిన బాబు... ఇంకా తగ్గలేదా?

తాజాగా సింగనమల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే అని అంటున్నారు పరిశీలకులు.

By:  Tupaki Desk   |   30 March 2024 9:07 AM GMT
దళితులను, పేదలను మరోసారి అవమానించిన బాబు... ఇంకా తగ్గలేదా?
X

నేరుగా పాయింట్ లోకి వచ్చేస్తే... "దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు!?" అంటూ గతంలో కామెంట్ చేశారు చంద్రబాబు! దీంతో... ఈ కామెంట్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. “దళితులుగా పుట్టాలని తామంతా కోరుకుంటాము కానీ... తమరిలా మాత్రం వద్దు” అంటూ దళితులు, మిగిలిన సామాజికవర్గాలకు చెందిన పలువురు విజ్ఞులు స్పందించారు! ఆ ఎఫెక్ట్ 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని చెబుతుంటారు.

దీంతో... దళిత సమాజం, కులరహిత సమాజం కోరుకునే ప్రజానికం.. చంద్రబాబుని చాలా దూరం పెట్టేసిందనే చర్చ బలంగా నడిచింది. ఆ ఎన్నికల్లో 23కి పరిమితం చేసి కుర్చోబెట్టినా.. చంద్రబాబులో ఉన్న ఆ తరహా ఆలోచనా విధానం ఇంకా తగ్గలేదన్నట్లుగా కామెంట్లు వినిపిస్తున్నాయి! దీనికి కారణం.. తాజాగా సింగనమల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే అని అంటున్నారు పరిశీలకులు.

వివరాళ్లోకి వెళ్తే... రానున్న ఎన్నికలకోసం అభ్యర్థుల ఎంపిక చేపట్టిన జగన్... సింగనమలకు టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులు, మడకశిరకు ఉపాధిహామీ కూలీ లక్కప్పను అభ్యర్థులుగా ఎంపిక చేసారు. ఇలా అత్యంత సాధారణమైన వాళ్ళను చట్టసభలకు పంపడం ద్వారా తనకు పేదలపై ఉన్న అభిప్రాయాన్ని జగన్ స్పష్టంగా చెప్పారని అంటున్నారు. ఇదే విషయాన్ని జగన్ మరింత స్పష్టంగా చెప్పారు కూడా.

అయితే ఇది జగన్ కి కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాగే అత్యంత సాధారణ వ్యక్తులుగా ఉన్న మాధవి, నందిగం సురేష్ లను ఎంపీలుగా పంపించారు జగన్. తద్వారా తాను పేదలు, అణగారిన వర్గాల పక్షపాతిని అని చేతల్లో చాటి చాటిచెప్పే ప్రయత్నం చేశారనే కామెంట్లను సొంతం చేసుకున్నారు!

అయితే... జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలను టీడీపీ అధినేత చంద్రబాబు అవహేళన చేస్తున్నారు! ఇందులో భాగంగా... ఎమ్మెల్యే పద్మావతికి కాకుండా ఆమె భర్తకు కాకుండా టిప్పర్ డ్రైవర్ కి టిక్కెట్ ఇచ్చారు.. అవునా.. నిజమేనా? ఎడమ చేతి వేలిముద్ర వేయించుకోవడానికి టిప్పర్ డ్రైవర్ కు టిక్కెట్ ఇచ్చాడు. గొప్పోడయ్యా.. ఆయన తెలివి తేటలకు ధన్యవాదాలు.. శభాష్ అంటూ స్పందించారు!

దీంతో... బాబు కామెంట్లపై దళితులు, పేదలు, మేధావి వర్గాలు, విజ్ఞుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చంద్రబాబేమో సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి డబ్బున్న పెత్తందారులకు టిక్కెట్ ఇస్తారు.. జగన్ మాత్రం సామాన్యులను అభ్యర్థులా ప్రకటించి చట్టసభలకు పంపిస్తూ సరికొత్త రాజకీయ చరిత్రను లిఖిస్తున్నారని వారంతా అంటున్నారు!

ఇదే సమయంలో... రాజకీయాలంటే కులమతాలకు అతీతంగా ఎప్పటికీ డబ్బున్నవారికీ, పెత్తందారులకు.. కులవృత్తో, కుటుంబ వారసత్వ హక్కో కాదని.. సామాన్యులు కూడా చట్టసభల్లోకి రావాలని, తద్వారా సామాన్య ప్రజల కష్టాలు మరింతగా ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుందని, ఫలితంగా పేదల కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఎడమ చేత్తో వేలిముద్ర వేయించుకుకోవడానికా అంటూ చంద్రబాబు కామెంట్ చేసిన వీరాంజనేయులు... ఎంఏ ఎకనామిక్స్, బీఈడీ చదివారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కల్పించలేకపోవడంతో, కుటుంబ పోషణార్ధం టిప్పర్ డ్రైవర్ గా పనిచేసుకుంటున్నారు. అంటే... చంద్రబాబు కంటే రామాంజనేయులు ఎక్కువ విద్యార్థత కలిగి ఉన్నారన్నమాట! కాకపోతే ఉద్యోగం దక్కలేదు!!

ఆ విషయం తెలియకో.. తెలిసినా.. దళితులు, పేదలు, వెనుకబడిన వర్గాలపై తనకున్న అభిప్రాయం మేరకో చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారు. దీంతో... రానున్న ఎన్నికల్లో ఆయా వర్గాల నుంచి బాబుపై ఆగ్రహం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు!