Begin typing your search above and press return to search.

బాబు.. బీజేపీతో పొత్తుపై ఆ మాటలు అవసరమా?

చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్లుగా చంద్రబాబు తీరులో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   27 March 2024 6:14 AM GMT
బాబు.. బీజేపీతో పొత్తుపై ఆ మాటలు అవసరమా?
X

కొన్ని అంశాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇంకా క్లారిటీ రావట్లేదా? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. గతంలో తాను చేసిన తప్పులకు మాటలు పడుతూనే ఉన్నారు. మిత్రులతో ఆయన వ్యవహరించే తీరుపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. అదే పనిగా ఎదురుదెబ్బలు తింటూ.. తరచూ కాలపరీక్షను ఎదుర్కొనే చంద్రబాబుకు తోడుగా నిలిచే వారు పెద్దగా కనిపించరు. రాజకీయాల్లో ఇలాంటివి మామూలేగా? అన్న మాట వినిపిస్తుంది కానీ చంద్రబాబు విషయంలో మాత్రం ఈ తీరు మరింత ఎక్కువన్నట్లుగా ఉంటుంది.

చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్లుగా చంద్రబాబు తీరులో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒకవైపు సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్ని ఒకేసారి ఎదుర్కొంటున్న చంద్రబాబు.. బీజేపీతో పొత్తు కోసం ఆయన పడిన ఆరాటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిందా మీదా పడి మొత్తానికి మోడీ జట్టులో మిత్రుడి స్థానాన్ని సొంతం చేసుకున్న ఆయన.. ఆ సందర్భంలో తాను పడిన శ్రమను మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది.

స్నేహధర్మాన్ని పక్కన పెట్టేసి.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కమలనాథులకు మంట పుట్టేలా మారాయి. తాజాగా కుప్పం జిల్లాలో ముస్లింలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత యువతతోనూ.. హంద్రీనీవా వద్ద జరిగిన సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తు అంశం ఆయన మాటల్లో వచ్చింది. పొత్తు కావాలని తాను వెళ్లలేదని.. వాళ్లు వస్తేనే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందన్న చంద్రబాబు తాను పెట్టుకున్న పొత్తు సీట్ల కోసం కాదని వ్యాఖ్యానించటం గమనార్హం.

అవునన్నా.. కాదన్నా ఒకసారి మిత్రుడిగా మారిపోయిన తర్వాత మాటల్లో తేడా రాకూడదు. అందుకు భిన్నంగా బాబు మాటలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీతో పొత్తు కోసం బాబు పడిన ఆరాటం తెలియంది కాదు. అలాంటిది.. అందరికి తెలిసిన విషయంలో ఈ పిల్లి మొగ్గలు ఏమిటి? అన్న ప్రశ్న వినిపిస్తోంది. అంతేకాదు.. బీజేపీతో పొత్తుపై బాబు చేసిన తాజా వ్యాఖ్యల్ని కమలం పార్టీ పెద్దల వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. చూస్తే.. చూస్తూ తలనొప్పులు తెచ్చుకోవటంలో చంద్రబాబు ఎంతటి ఘనాపాఠి అన్నది మరోసారి నిరూపితమైందంటున్నారు.