నిరుద్యోగ భృతి కూడా...బాబు చేతికి ఎముక లేదుగా !
ఏపీలో చూస్తే ఖజానా దేనికీ పెద్దగా సహకరించని పరిస్థితి ఉంది. నిదులు పెద్దగా లేకుండా పోతోంది.
By: Tupaki Desk | 2 July 2025 9:10 AM ISTచంద్రబాబు పూర్తిగా మారిపోయారు అని అంటునారు. లేకపోతే సంక్షేమ పధకాల పట్ల పెద్దగా మోజు చూపించని చంద్రబాబు ఎన్నికల హామీలను వరసగా నెరవేరుస్తున్నారు. ఆయన మరో వైపు తన అభివృద్ధి అజెండాను అసలు ఆపడంలేదు. నిజంగా ఇది కత్తి మీద సాము లాంటి వ్యవహారమే.
ఏపీలో చూస్తే ఖజానా దేనికీ పెద్దగా సహకరించని పరిస్థితి ఉంది. నిదులు పెద్దగా లేకుండా పోతోంది. అభివృద్ధి అజెండా చాలానే ఉంది. కేంద్రం నుంచి ఎంత సానుకూలత ఉన్నా నిధులు అయితే ఆశించిన స్థాయిలో దక్కడంలేదు.
దాంతో అభివృద్ధి సంక్షేమం ఏకకాలంలో చేయడం అంటే చాలా కష్టం. అందుకే జగన్ కూడా సంక్షేమం మీదనే ఫోకస్ పెట్టి అభివృద్ధిని పక్కన పెట్టేశారు అన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక బాబు వస్తే అభివృద్ధి మీదనే దృష్టి పెడతారు అని అంతా ఊహించారు.
బాబు కూడా మొదటి ఏడాది ఫుల్ ఫోకస్ డెవలప్మెంట్ మీదనే పెట్టారు కానీ రెండవ ఏడాది మొదలు అవుతూనే సంక్షేమం స్పీడ్ పెంచేశారు. తల్లికి వందనం పేరుతో ఏకంగా పది వేల కోట్ల రూపాయలను కేటాయించి అత్యధిక శాతం మందిని నేరుగా నగదు వారి ఖాతాల్లో వేశారు. దీంతో ఈ పధకం అమలు మీద పెద్దగా విమర్శలు అయితే రాలేదు.
ఇక ఈ నెల 20 తరువాత అన్న దాతా సుఖీభవ కింద రాష్ట్రం వాటాగా ఏడు వేల రూపాయలను కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పధకం తో పాటుగా ఇస్తారని అంటున్నారు. ఆగస్టు నుంచి ఉచిత బస్సు పధకం ఉంటుందని బాబు స్వయంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో చెప్పారు. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పధకం పంపిణీ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక సభలో బాబు మరో హామీని నెరవేరుస్తున్నట్లుగా ప్రకటించారు.
తొందరలోనే నిరుద్యోగ భృతిని కూడా ఇస్తామని చంద్రబాబు చెప్పడం విశేషం. వీలైనంత త్వరలో నిరుధ్యోగ భృతికి శ్రీకారం చుడతామని బాబు కీలక ప్రకటన చేశారు. 9.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నామని ఆయన చెప్పారు. వీటి ద్వారా 8 లక్షల 50 వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఇక ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు
అలా వాటి ద్వారా 4 లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. గత పదేళ్లలో ఎంత పెట్టుబడులు వచ్చాయో ఒక్క ఏడాదిలో అంతకంటే ఎక్కువ పెట్టుబడులు తెచ్చామని అన్నారు. అలా ఒక వైపు ఉద్యోగాలను కల్పిస్తూనే మరో వైపు వీలైనంత త్వరలో నిరుధ్యోగ భృతికి శ్రీకారం చుడతామని బాబు కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగులకు నెలకు మూడు వేల భృతిని ఇస్తామని బాబు ఎన్నికల మేనిఫేస్టో చెప్పారు. ఇపుడు దానిని కూడా అమలు చేయడం ద్వారా సూపర్ సిక్స్ లో మరో హామీని నెరవేర్చాలని చూస్తున్నారు అంటున్నారు.
