Begin typing your search above and press return to search.

మంత్రులకు చంద్రబాబు క్లాస్.. ఏసీ గదులు వీడాల్సిందే!!

మంత్రులకు సీఎం చంద్రబాబు మరోసారి క్లాస్ పీకారు. అమాత్య పదవులతో ఎంజాయ్ చేయడం కాదు ఫీల్డ్ విజిట్ చేస్తూ వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలని హితబోధ చేశారు.

By:  Tupaki Political Desk   |   9 Feb 2026 6:30 PM IST
మంత్రులకు చంద్రబాబు క్లాస్.. ఏసీ గదులు వీడాల్సిందే!!
X

మంత్రులకు సీఎం చంద్రబాబు మరోసారి క్లాస్ పీకారు. అమాత్య పదవులతో ఎంజాయ్ చేయడం కాదు ఫీల్డ్ విజిట్ చేస్తూ వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలని హితబోధ చేశారు. ఏసీ గదులు వీడి జనం బాట పట్టాలని, మంత్రులతోపాటు సంబంధిత శాఖల కార్యదర్శులు సైతం ప్రజల్లో తిరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్లు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రుల పనితీరుపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం పెరగాలంటే మంత్రులు అంతా ఏసీ గదులను వీడి జనంలో తిరగాల్సిందేనంటూ సీఎం స్పష్టం చేశారు.

ఇక నుంచి మంత్రులు, కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందోననే అంశంపై ప్రత్యక్షంగా చూడాలని సూచించారు. పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా... క్షేత్ర స్థాయిలో పాలసీలు అమలుకానప్పుడు ఫలితం ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. వారి వారి శాఖల పనితీరు ఎలా ఉందన్న అంశంపై పరిశీలించడానికి తరుచూ ఫీల్డ్ విజిట్స్ చేపట్టాలని సీఎం సూచించారు. వివిధ వర్గాల ప్రజలతో అధికారులు తరుచూ మాట్లాడుతూ ఉంటే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రస్తుతం సీఎం చంద్రబాబు ప్రతినెలా ఏదో ఒక కార్యక్రమం కింద జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. ప్రతినెల 1వ తేదీన పింఛన్ల పంపిణీకి తప్పనిసరిగా హాజరవుతున్నారు. ఆ సమయంలో ప్రజలతో సమావేశమవుతూ వారి సాధక బాధలు తెలుసుకుంటున్నారు. ఇది కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించే సమయంలోనూ జిల్లాల పర్యటనకు సీఎం వెళుతున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సైతం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సీఎం తరువాత ఆ స్థాయిలో పవన్ మాత్రమే జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మంత్రి లోకేశ్ కూడా అడపాదడపానే జిల్లాల్లో తిరుగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మంత్రివర్గంలో మిగిలిన మంత్రులు ఎవరూ క్షేత్రస్థాయి పర్యటనలను చేపట్టడం లేదని సీఎం అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. చాలా మంది మంత్రులు తమ సొంత జిల్లాలు, సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని అంటున్నారు. మంత్రులకు అదనంగా అప్పగించిన ఇంచార్జి బాధ్యతలను కూడా తూతూమంత్రంగానే నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా ఇంచార్జి మంత్రులుగా ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనులతోపాటు పాలన వ్యవహారాలను పర్యవేక్షించాలని సీఎం తరచూ మంత్రులకు చెబుతూనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

అయితే ఎక్కువ మంది మంత్రులు ఇంచార్జిలు ఆయా జిల్లాల్లో సమావేశాల నిర్వహణకే పరిమితమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రజల సాదక బాధలు తెలుసుకోడానికి ఎవరూ ప్రయత్నించడం లేదని సీఎం చెబుతున్నారు. ఇకపై అందరూ క్షేత్రస్థాయికి వెళితేనే మంచి ఫలితాలు సాధించగలమని సీఎం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి సీఎం ఇలాంటి సూచనలే చేస్తున్నా, మంత్రుల్లో పెద్దగా మార్పు ఉండటం లేదని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

కాగా, సచివాలయంలోని 5వ బ్లాకులో మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం పలు అంశాలపై సమీక్షించారు. జీఎస్డీపీ, వైద్య, ఆరోగ్యం, విద్యాశాఖలపై సుదీర్ఘంగా సమీక్షించారు. అదేవిధంగా రైతుల ఆదాయం పెంచే మార్గాలపైనా నిర్దిష్ట సూచనలు చేశారు. అల్లూరి జిల్లా లంబసింగిలో కుంకుమ పువ్వు ఉత్పత్తికి అవకాశాలు కన్పిస్తున్నాయని, అధికారులు ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు సమీపంలో కోకో సిటీ నిర్మాణంపై ఫోకస్ చేయాలని సూచించారు. ఇక పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని సూచించారు.