ఎన్నికల వరకు వెయిట్ చేయనని చెప్పే చంద్రబాబు.. చేతల్లో చేసి చూపిస్తే సరి!
తాజాగా మరోసారి తన పాత తీరును ప్రదర్శించారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు.. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జులు సక్రమంగా పని చేయకపోతే వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేయనని.. ఈలోపే వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటామని చెప్పుకొచ్చారు.
By: Garuda Media | 13 Nov 2025 9:46 AM ISTక్రమశిక్షణ లేకపోవటం.. పార్టీ లైన్ కు భిన్నంగా.. ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా.. అధినేత అంచనాలకు దూరంగా పని తీరు ఉండటం లాంటి వాటి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి కం టీడీపీ అధినేత చంద్రబాబు మాటలకు చేతలకు మధ్య ఉండే అంతరం అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు మాటల హెచ్చరికలు తప్పించి.. చేతల్లో చూపించే తరహాలో చర్యలు లేకపోవటం తెలిసిందే. తాజాగా మరోసారి తన పాత తీరును ప్రదర్శించారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు.. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జులు సక్రమంగా పని చేయకపోతే వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేయనని.. ఈలోపే వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటామని చెప్పుకొచ్చారు.
వెయిట్ చేయటం ద్వారా జరగాల్సిన నష్టం జరుగుతుందని.. అందుకే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వారి విషయంలో ఎన్నికల వరకు వెయిట్ చేస్తాం.. అప్పుడు చూసుకుందామంటే ఎవరూ క్షమించరన్నారు. నెల వారీగా నియోజకవర్గాలపై అభిప్రాయ సేకరణ చేపట్టి వార్నింగ్ లు జారీ చేస్తామని.. అప్పటికి మార్పు రాకుంటే ప్రత్యామ్నాయం వెతుకుతామని తేల్చి చెప్పారు.
అయితే.. ఈ తరహా మాటలు ఇప్పటికే కొన్ని వందల సార్లు చంద్రబాబు నోటి నుంచి రావటం తెలిసిందే. చెప్పిన మాటల్నే పదే పదే.. వేర్వేరు వేదికల మీద ప్రస్తావించే చంద్రబాబు.. అదేదో చేతల్లో ఒకరిద్దరి మీద చర్యలు తీసుకోవటం ద్వారా మిగిలిన వారు అప్రమత్తం అయ్యే అవకాశాన్ని వదులుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
అంతేకాదు.. తప్పు చేసిన వారి మీదా.. పార్టీకి నష్టం కలిగిస్తున్న తమ్ముళ్లలో ఒకరిద్దరిపై వేటు వేయటం.. అలాంటి వారిని మళ్లీ పార్టీ దరిదాపుల్లోకి రానివ్వకుండా చూసుకోవటం లాంటివి చేస్తే.. కట్టు దాటే తమ్ముళ్లను కట్టడి చేసేందుకు వీలవుతుంది. అందుకు భిన్నంగా వేర్వేరు వేదికల మీద పదే పదే ఇదే తరహాలో మాటలు చెప్పటం ద్వారా ప్రయోజనం శూన్యమన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు మైండ్ సెట్ కు ఈ తరహా వ్యవహారశైలి ఆశించటం అత్యాశే అవుతుందనే పార్టీ సీనియర్ నేతల ఫీడ్ బ్యాక్ టీడీపీ అధినేత వద్దకు వెళుతుందా? అన్నది అసలుసిసలైన ప్రశ్న.
