Begin typing your search above and press return to search.

చంద్రబాబు సీక్రెట్ అదే.. పిఠాపురం వర్మ విషయంలో బయటపెట్టిన సీఎం

రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ నాయకులకు, అధిష్టానానికి మధ్య ఉండే మానవతా సంబంధాలే పార్టీని చిరకాలం నిలబెడతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

By:  Tupaki Political Desk   |   2 Aug 2026 5:25 PM IST
చంద్రబాబు సీక్రెట్ అదే.. పిఠాపురం వర్మ విషయంలో బయటపెట్టిన సీఎం
X

రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ నాయకులకు, అధిష్టానానికి మధ్య ఉండే మానవతా సంబంధాలే పార్టీని చిరకాలం నిలబెడతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయంలో అధికార టీడీపీకి ప్రత్యేకమైన చరిత్ర ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ నేతల పనితీరుతోపాటు వ్యక్తిగత క్రమశిక్షణను అనుక్షణం పర్యవేక్షించడం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ప్రత్యేకం అంటున్నారు. ఈ విషయంలో కార్యకర్త నుంచి అధినేత వరకు ఎవరైనా ఒకటే అంటున్నారు. ఇదే సమయంలో నాయకులతో వ్యక్తిగత అనుబంధంపై కూడా పార్టీ పెద్దలు ఎక్కువ ఫోకస్ చేస్తుంటారని అంటున్నారు. దీంతో టీడీపీలో ప్రతి నేత కూడా పార్టీ తన సొంత ఆస్తిగా భావిస్తారని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా తనకు ఎదురైన మాజీ ఎమ్మెల్యే వర్మను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారని చెబుతున్నారు. అంతేకాకుండా ఇద్దరూ కలిసి నవ్వుతూ ఫొటోలకు ఫోజు ఇచ్చారు. పార్టీకి చెందిన నేతలతో అధినేత ఇలా ఫొటోలు దిగడం సాధారణమే అయినప్పటికి మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో మాత్రం చాలా ప్రత్యేకంగానే చూడాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోసం తన ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ రెండేళ్లుగా నామినేటెడ్ పదవి కోసం ఎదురుచూస్తున్నారు.

2019 ఎన్నికల తర్వాత పిఠాపురంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి వర్మ తీవ్రంగా కష్టపడ్డారు. చాలా వరకు డబ్బు కూడా ఖర్చుపెట్టారు. ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటే మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటును త్యాగం చేశారు. ఈ సమయంలో ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తామని అధిష్టానంతోపాటు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కూడా హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో పవన్ గెలిచిన తర్వాత సీన్ మారిపోయింది. ఎన్నికలు ముగిసి రెండేళ్లు అవుతుండగా, పిఠాపురంలో జనసేన-టీడీపీ సంబంధాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. ఇరుపార్టీల నేతలు ఎవరికి వారు మనుగడ కోసం సొంతంగా పనిచేయడంతో కూటమి ఐక్యతపై అనేక అనుమానాలు తలెత్తాయి.

అయితే, ఈ పరిస్థితిపై ఆందోళన చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మను పార్టీ పదవి నుంచి తప్పించింది. సహజంగా ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏ నేత అయినా అవమానకరంగా భావిస్తారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రం తనను పక్కన పెట్టిన అధిష్టానం చర్యతో బాధపడినప్పటికీ అది తమ పార్టీ అంతర్గత విషయంగా సర్దుకుపోయారు. దీంతోనే అధిష్టానం కూడా ఆయన విషయంలో తీవ్ర తర్జనభర్జనకు గురవుతోందని అంటున్నారు. ఇందుకే మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సానుకూలంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం సందర్భంగా చాలా మంది నేతలు వచ్చినప్పటికీ మాజీ ఎమ్మెల్యే వర్మను మాత్రం ప్రత్యేకంగా పలకరించి తన ఆత్మీయతను సీఎం ప్రదర్శించారని చెబుతున్నారు. ఈ చర్య వర్మ ఒక్కరికే కాకుండా తెలుగుదేశం పార్టీలో మానవ విలువలకు ఇచ్చే గౌరవంగా చెబుతున్నారు. కూటమి పటిష్టంగా ఉన్న ఈ దిశలో ఉప ముఖ్యమంత్రితో రాజకీయ బంధం కోరుకుంటూనే వర్మను దూరం చేసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శిస్తున్న రాజకీయ, వ్యక్తిగత అనుబంధాలు హాట్ టాపిక్ అవుతున్నాయని అంటున్నారు.