Begin typing your search above and press return to search.

చంద్రబాబు, జగన్‌లకు ప్రత్యామ్నాయం లేదా ?

దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రంలోనూ లేని విచిత్ర పరిస్థితి ఏపీలో ఉంది.

By:  Satya P   |   21 Oct 2026 12:00 AM IST
చంద్రబాబు, జగన్‌లకు ప్రత్యామ్నాయం లేదా ?
X

దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రంలోనూ లేని విచిత్ర పరిస్థితి ఏపీలో ఉంది. ఇక్కడ రెండే పార్టీలు. ఇద్దరే నాయకులు. వారి మధ్యనే రాజకీయం. వారితోనే రాజకీయం. అలా ఏపీ పాలిటిక్స్ నిలువునా చీలిపోయింది. చంద్రబాబు జగన్ ఈ ఇద్దరి చుట్టూనే ఏపీ రాజకీయం అంతా ఏళ్ళకు ఏళ్ళుగా తిరుగుతోంది. ఈ ఇద్దరే ఏపీకి గతం, వర్తమానం భవిష్యత్తు అన్నట్లుగా ఉన్నారు. ఈ ఇద్దరే విభజన ఏపీలో పాలకులు అయ్యారు. మరి వీరి ప్రభుత్వాలలో సగటు జనం జీవితాలలో వచ్చిన మార్పు ఎంత, అలాగే కేవలం సంక్షేమ పథకాలు తప్ప రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దారి ఏది ఇవన్నీ ప్రశ్నలు. అంతే కాదు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వినిపిస్తోంది. చంద్రబాబు జగన్ కాకుండా మరో నాయకుడు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగగలడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా అన్నదే కీలకమైన చర్చగా ఉంది.

బాబు జగన్ ల మధ్యనే :

ఏపీలో మూడు ఎన్నికలు చంద్రబాబు జగన్ ల మధ్యనే సాగాయి. వీరిలో ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారు. ఈ ఇద్దరి మధ్య ఢీ కొట్టే రాజకీయ పోటీలో సాధారణ ప్రజలకు దీర్ఘకాలంలో ఎంత ప్రయోజనం కలుగుతోందన్నది అయితే అంతా కచ్చితంగా చర్చించాల్సిన అంశం అని మేధావులు సైతం అంటున్నారు. చంద్రబాబు విషయానికి వస్తే అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతికత, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతారు. జగన్ సంక్షేమం, సామాజిక న్యాయం, పేదల ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతారు. ఇలా చూస్తే ఈ వీరిద్దరి పాలనా విధానాలు పూర్తిగా ఒకటే అనడం సరికాదు. అయితే రాజకీయ శైలి మాత్రం ఒక్కటే అని అంటున్నారు. తామే కీలకంగా ఉంటూ తమ చుట్టూనే అధికార కేంద్రీకరణ చేసుకోవడం, తమ ఇమేజ్ తోనే అంతా అనుకోవడం, ఇక ఖజానాను అసలు ఖాతరు చేయకుండా సంక్షేమ పథకాలపై ఎందాకైనా అన్నట్లుగా పోటీ, పరస్పర రాజకీయ విమర్శలు వంటి అంశాలలో సైతం ఇద్దరూ ఒక్కటే తీరు అని విశ్లేషిస్తున్నారు.

జనంలో చర్చగా :

ఇక ఏపీ అంటే అయిదు కోట్ల జనం, ఎందరో ఆశలు, ఆకాంక్షలు ముడిపడి ఉన్న అతి పెద్ద సమాజం. యువతకు ఉపాధి కావాలి. సగటు జనం ఆర్థికంగా పైకి లేవాలి, రాష్ట్రం సమగ్రమైన అభివృద్ధి సాధించాలి. కానీ బాబు జగన్ ల మధ్యనే పరిమితం అయిన రాజకీయం ఒక అజెండాను సెట్ చేసేసింది. అందుకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలు కీలకమైన రాజకీయ అంశంగా మారుతున్నాయి. చదువుకున్న యువత పరాయి రాష్ట్రంలో కొలువులకు పోతోంది, వారికి ఉద్యోగాలు ఎక్కడ అంటే జవాబు లేదు, సామాజిక పెన్షన్లు, మహిళలకు ఆర్థిక సహాయం, రైతులకు మద్దతు, విద్యార్థులకు సహాయం ఇలా ఎన్నో ఉచిత పథకాలు పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయి. వాటి అవసరాన్ని ఎవరూ తక్కువ చేయలేరు. అదే సమయంలో అభివృద్ధి కూడా ఏపీకి అవసరం అన్నది సగటు జనం ఆలోచిస్తున్న విషయంగా ఉంది.

సొంతంగా ఎదగాలి :

ప్రభుత్వం చేసే ఆర్ధిక సాయం కాదు, ప్రతీ కుటుంబం సొంతంగా ఎదగాలని అంతా కోరుకుంటారు. దాని కోసం రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, స్థిరమైన ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలకు అవకాశాలు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు పెరగాలని కోరుకుంటున్నారు దాంతో బాబు జగన్ రాజకీయ అజెండాలను మించిన కొత్త వ్యూహం అవసరం అని అంటున్నారు. చంద్రబాబుకు పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఐటీ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో ఆయనకు ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉంది. అలాగే జగన్‌కి గ్రామీణ స్థాయిలో బలమైన రాజకీయ పునాది, సంక్షేమ పథకాల ద్వారా ఏర్పడిన గుర్తింపు నిబద్ధత కలిగిన ఓటర్ల వర్గం ఉన్నాయి. అయితే ఈ ఇద్దరి ప్రభుత్వాలలోనూ పరిష్కారం కాని సమస్యలు కూడా ఉన్నాయని మేధ్దావులు గుర్తు చేస్తున్నారు. అందుకే వీరి విధానాలను కలుపుకుంటూనే సమగ్రమైన ఏపీ అభివృద్ధికి సరికొత్త నాయకత్వం రావాలన్నది ఒక బలమైన అభిప్రాయంగా ఉంది.

విధానాల మధ్య పోటీగా :

అసలైన విషయం ఏంటి అంటే వ్యక్తుల మధ్య పోటీ కాదు విధానాల మధ్య పోటీ రావాలి. రాష్ట్రంలో కొత్త ఆర్థిక విధానం, యువతకు ఉద్యోగాల ప్రణాళిక, జిల్లాలవారీ పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయానికి మార్కెట్ అనుసంధానం, విద్యా సంస్కరణలు, అవినీతిని తగ్గించే పరిపాలనా వ్యవస్థ వంటి అంశాలపై స్పష్టమైన విధానాలు అవసరం అన్న భావన గట్టిగా జనంలో బలపడుతోంది. అలాంటి నాయకత్వం వచ్చ్చినపుడు జనాలు జేజేలు పలకడానికి సిద్ధంగా ఉంటారా అంటే అది కూడా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే రాజకీయం ఏపీలో నిలువునా చీలిపోయి ఉంది.

పవన్ జనసేన గురించి :

ఇక జనసేన ఏపీలో పన్నెండేళ్ల క్రితమే మూడవ పార్టీగా అవతరించింది. పవన్ కి యువతలో, అభిమానులలో ఎంతో క్రేజ్ ఉంది. అలాగే ప్రజలను ఆకర్షించే సామర్థ్యం ఉంది. పొత్తులో అయినా సరే 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలన్నింటినీ గెలుచుకోవడం జనసేనకి ఒక సక్సెస్ ఫుల్ జర్నీగానే ఉంది. అయితే ఏపీలో టీడీపీకి వైసీపీకి పవన్ సరైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారా అన్నది మౌలికమైన ప్రశ్న. జనసేన రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే వివిధ ఎన్నికల్లో పొత్తులు రాజకీయ వ్యూహాలతోనే సాగింది. 2024లో టీడీపీ, బీజేపీలతో కలిసి పోటీ చేయడం ద్వారా జనసేన గణనీయమైన ఎన్నికల విజయాన్ని సాధించింది అన్నది గుర్తు పెట్టుకోవాలి. దీని వల్ల జనసేనకు అధికారంలో వాటా దక్కింది కానీ పూర్తిగా స్వతంత్ర మూడో రాజకీయ శక్తిగా పార్టీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అయితే అవకాశం రాలేదు.

రెండు ఆప్షన్లు ఉన్నాయి :

ఇక జనసేన అధినేత పవన్ అధికారం వైపు సాగాలీ అంటే రెండు మార్గాలు ఉన్నాయి. కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూ తన రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవడం ఒకటి. లేదా స్వతంత్ర విధానాలతో విస్తృత సంస్థాగత నిర్మాణంతో భవిష్యత్తులో ప్రత్యేక ప్రత్యామ్నాయంగా ఎదగడం మరొకటి. అయితే ఈ రెండు ఆప్షన్లలో కూడా సవాళ్ళూ సమస్యలు ఉన్నాయి. జనసేనకు కేవలం అభిమానుల బలం మాత్రమే రాజకీయ అధికారానికి సరిపోదు. అందువల్ల మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో పార్టీ నిర్మాణం, స్థానిక నాయకత్వం, సమస్యలపై నిరంతర పోరాటం, స్పష్టమైన పరిపాలనా దృక్పథం కూడా అవసరం అన్నది స్పష్టం. ఇక్కడే తమిళనాడులో విజయ్ రెండు బలమైన పార్టీలను ఢీ కొట్టి కొత్త పార్టీని అధికారంలోకి తీసుకుని రావడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

ఏపీలో ఎందుకు కాదు :

తమిళనాడులో డీఎంకే అన్నా డీఎంకేకి కూడా చెరో నలభై శాతం ఓటు షేర్ ఉంది. అంతలా దశాబ్దాలుగా ఆ పార్టీలు ఉన్నాయి. వాటిని సినీ హీరోగా ఉంటూ టీవీకేని స్థాపించిన విజయ్ ఢీ కొట్టి అధికారం సంపాదించారు. విజయ్ కొత్త దనం రాజకీయం చూపించడం వల్లనే సంప్రదాయ పార్టీలు వెనక్కి పోయాయి అన్నది నిరూపితం అయింది. మరి అదే సూత్రం ఏపీలో ఎందుకు అమలు కాదు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏపీలో వివిధ వర్గాలతో మమేకం అవుతూ వారి సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తే తప్పకుండా ప్రజల విశ్వాసంతో కొత్త రాజకీయ వేదిక నిర్మాణం అవుతుందని అంటున్నారు.

ఓటు బ్యాంక్ స్థిరం కాదు :

ఓటు షేర్ కానీ ఓటు బ్యాంక్ కానీ ఎవరికీ స్థిరం కాదు, కాంగ్రెస్ కి 2014 కి ముందు వరకూ ఏపీలో 40 శాతం ఓటు షేర్ ఉంది. ఆ తరువాత ఏమైంది. అంటే జనం మద్దతు అందుకుంటే ఈ ఓటు షేర్ అన్నది దూది పింజలా ఎగిరిపోతుంది అన్నది రుజువు అవుతోంది. 2019లో వైసీపీ గెలిచి 2024లో ఓడింది. దాన్ని బట్టి చూసినా ప్రజల ఆకాంక్షలే అంతిమ నిర్ణయం అని అంటున్నారు. ఎవరికీ జీవిత కాలం మద్దతు ఇస్తామని ఎక్కడా ప్రజలు ఒట్టేసి చెప్పడం లేదు అన్నది గుర్తెరగాలి. అయితే కొత్తగా రాజకీయ వేదిక ఏర్పాటు చేసే వారు ఎవరైనా గ్రామ స్థాయి నుంచి సంస్థాగత నిర్మాణం బలంగా నిర్మించుకోవాలి. ఏపీలో కుల సామాజిక పరిస్థితులను గమనిస్తూ ఆ విధంగా డిజైన్ చేసుకోవాలి. యువత మద్దతుని కూడా కీలకంగా భావించాలి. వారిలో అభివృద్ధి కోరిక ఉంది. ఇక ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులు, ప్రభుత్వ ఆదాయం, మూలధన వ్యయం, విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు వంటి అంశాలపై కూడా బహిరంగ చర్చ జరగాలి. ప్రత్యర్థులను విమర్శించడం కాదు తామేమి చేస్తామన్నది కనుక జనం ముందు పెడితే మూడవ ఆల్టర్నేషన్ వైపు జనాలు చూస్తారు.