Begin typing your search above and press return to search.

ఆ జిల్లాకు బాబు...పొలిటికల్ హీట్

ఈసారి ఆయన విజయనగరం జిల్లాను ఎంచుకున్నారు. చంద్రబాబు విజయనగరం రాక విషయంలో రాజకీయంగా చర్చ సాగుతోంది.

By:  Satya P   |   24 Feb 2026 7:00 PM IST
ఆ జిల్లాకు బాబు...పొలిటికల్ హీట్
X

ఏపీ సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ప్రతీ నెలా సామాజిక పెన్షన్లు నేరుగా లబ్దిదారుల ఇళ్ళకు వెళ్ళి ఇచ్చేందుకు బాబు ఒక్కో జిల్లాకు వెళ్తూంటారు. ఈసారి ఆయన విజయనగరం జిల్లాను ఎంచుకున్నారు. చంద్రబాబు విజయనగరం రాక విషయంలో రాజకీయంగా చర్చ సాగుతోంది. నిజానికి ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల గురించి జనంలో చెప్పడానికి వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి చంద్రబాబు ఈ విధంగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. అదే విధంగా సామాజిక పెన్షన్లను ఇళ్ళ వద్ద ఇవ్వడం ద్వారా లబ్దిదారుల గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమీపంలోని ప్రజలతో కలసి ఆయన ముచ్చటిస్తూ స్థానిక సమస్యలకు తక్షణ పరిష్కారాలను కూడా కనుగొంటున్నారు. ఈ నేపథ్యంలో బాబు ఈ నెల 28న విజయనగరం జిల్లా పర్యటన అయితే కన్ఫర్మ్ అయింది అని అంటున్నారు.

ఆ నియోజకవర్గంలోనే :

ఇక చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో ఎంచుకున్నది చీపురుపల్లి నియోజకవర్గం కావడం విశేషం. చీపురుపల్లి లోని రావి వలస గ్రామ పంచాయతీకి బాబు వస్తున్నారు. ఆ గ్రామ పంచాయతీకి అతి సమీపంలో ఉన్న పైల పేట గ్రామంలో ఆయన బహిరంగ సభను నిర్వహించనున్నారు. దాంతో అధికారులు సీఎం టూర్ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక చీపురుపల్లి అనగానే జిల్లాలో గుర్తుకు వచ్చేది బొత్స కుటుంబం అన్నది తెలిసిందే. అక్కడ బొత్స బంధువులు సన్నిహితులు అంతా కలసి అతి పెద్ద బలగమే ఉంది. బొత్స చీపురుపల్లి నుంచి అయిదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచారు. మంత్రిగా పదేళ్ళ పాటు ఆయన పనిచేశారు. పీసీసీ చీఫ్ గా ఉమ్మడి ఏపీలో వ్యవహరించారు. అలాగే ఆయన ప్రస్తుతం శాసనమండలి లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటున్నారు.

మండలిలో వైసీపీ రచ్చ :

ఇదిలా ఉంటే శాసనమండలిలో వైసీపీ ఇటీవల కాలంలో రాజకీయ రచ్చ చేస్తోంది. అదే విధంగా ఇందాపూర్ డెయిరీ నెయ్యి అంటూ కూడా బొత్స హాట్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తూ ముందుకు సాగుతునారు. అటు హెరిటేజ్ కి కూడా ముడిపెట్టి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో బొత్సకు హెరిటేజ్ సంస్థ నోటీసులు కూడా ఇచ్చింది. ఇవన్నీ ఇపుడు రాజకీయ కాక పుట్టిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్ట్ గా బొత్సకు బలం ఉన్న ఆయన సొంత నియోజకవర్గాన్ని ఎంచుకోవడంతో అంతా ఆ వైపుగా దృష్టి సారిస్తున్నారు.

బొత్సని టార్గెట్ చేస్తారా :

చంద్రబాబు అయితే బొత్సకు బలమైన రాజకీయ స్థావరంగా ఉన్న చీపురుపల్లి పర్యటన పెట్టుకున్నారు. ఆ సందర్భంగా ఆయన అక్కడ సభలో ఏమి మాట్లాడుతారు అన్నది అంతా చర్చిస్తున్నారు. బొత్స సత్యనారాయణ మీద బాబు హాట్ కామెంట్స్ చేసే అవకాశం ఉందా అని అంతా ఆలోచిస్తున్నారు. దీంతో ఈ నెల 28న సీఎం సభ మీద అందరి ఫోకస్ పెడుతోంది. బాబు ఏమి మాట్లాడుతారు, వైసీపీ నేతల గురించి ఏమి చెబుతారు అన్నది చూడాల్సి ఉంది.