చంద్రబాబు ఇలా మారిపోయారేంటి..
నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్టైల్ ను పూర్తిగా మార్చేశారంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.
By: Tupaki Desk | 6 April 2025 12:48 AM ISTనాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్టైల్ ను పూర్తిగా మార్చేశారంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఎప్పుడూ సీరియస్ గా ఉంటూ పూర్తిగా అధికార కార్యక్రమాలతో బిజీబిజీ ఉంటూ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ హైటెక్ నేతగా గుర్తుంపు తెచ్చుకున్న చంద్రబాబు.. ఇప్పుడు పూర్తిగా సాధారణ నాయకుడిగా ఉండేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. గత ఏడాది జూన్ లో నాలుగో సారి సీఎంగా ప్రమాణం చేసిన నుంచి ఆయన తీరు చూస్తే బాబు మారిపోయారనే దానికీ ఎవరైనా ఏకీభవించకతప్పదంటున్నారు.
1995లో తొలిసారి సీఎం అయినప్పుడు నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబును పరిశీలిస్తున్నవారు చెబుతున్నదొక్కటే.. బాబులో ఎంతో మార్పు కనిపిస్తుందన్న మాటే.. నిజం, చంద్రబాబు మారిపోయారు. ఎప్పుడు సీఎంగా ఉన్నా ఆకస్మిక పర్యటనలు, సుదీర్ఘ సమీక్షలతో హడలెత్తించే చంద్రబాబు.. తన 4.0 ప్రభుత్వంలో మాత్రం సాదాసీదాగా గడుపుతున్నారు. ఓ సామాన్యుడిలా అందరితో కలుపుగోరుగా ఉంటూ తాను మనస్ఫూర్తిగా నవ్వుతూ తన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ గడుపుతున్నారు. పేదల సేవలో.. పీ4 వంటి కార్యక్రమాలతో పేదల ఇంటికి వెళుతున్న చంద్రబాబు వారితో మనసు విప్పి మాట్లాడటమే కాకుండా, ఏం చేస్తే వారి జీవితాలు బాగుంటాయో చెబుతూ ఓ కుటుంబ పెద్దలా వ్యవహరిస్తున్నారంటున్నారు.
శనివారం ఎన్టీఆర్ జిల్లా నందిగాం నియోజకవర్గం ముప్పాళ్లలో పర్యటించిన చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపరిచారు. నెలనెల పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వెళుతూ పేదల ఇళ్లలో టీ, కాఫీ చేస్తూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఈ రోజు అదే ఆనవాయితీ కొనసాగించారు. అయితే కాస్త డిఫరెంటుగా బాలికల హాస్టల్ ను కూడా విజట్ చేసి విద్యార్థులకు తీపి గుర్తు మిగిల్చారు. సాధారణంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇలాంటి సందర్శనలకు వెళితే అక్కడ పనిచేసే ఉద్యోగులకు మూడినట్లేనని భావించేవారు. కానీ, ఈ సారి చంద్రబాబు ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ముప్పాళ్ల హాస్టల్ ను కలియతిరిగిన చంద్రబాబు అక్కడి విద్యార్థినులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి అక్కడే తేనీరు సేవించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలను చూసిన వారు బాబు గారు ఇలా మారిపోతారని అస్సలు ఊహించలేదని అంటున్నారు.
