కలెక్టర్లు-చంద్రబాబు: కొన్ని సంగతులు.. !
రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించాలన్నది ఆయన ఆశయం.
By: Garuda Media | 16 Sept 2025 3:53 PM ISTరాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించాలన్నది ఆయన ఆశయం. ఈ క్రమంలో పార్టీ కంటే కూడా చంద్రబాబుకు కలిసి వచ్చేది.. రావాల్సింది కూడా.. జిల్లాల కలెక్టర్లు. పైస్థాయిలో చంద్రబాబు ఎంత చేసినా.. క్షేత్రస్థాయిలో అధికారులు సరిగా పనిచేయకపోతే.. పనిచేసే వాతావరణం కల్పించకపోతే.. మాత్రం బాబు పెట్టుకున్న లక్ష్యాలకు గండి తప్పదు. ఇది.. ఎవరో చెబుతున్నమాట కాదు.. నేరుగా కలెక్టర్లలో సీనియర్ల మధ్య జరుగుతున్న చర్చ.
తాజాగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు.. కలెక్టర్ల సదస్సును చంద్రబాబు చేపట్టారు. దీనిలో ఆయన కలెక్టర్లకు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా విజన్ - 2047, అభివృద్ధి, ప్రజాసంక్షేమం, సమస్యల పరిష్కారం, ఆర్టీజీఎస్ సహా పెట్టుబడులు, పీ-4 వంటి కీలక అంశాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సదస్సులో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అదేవిధంగా జిల్లాల అభివృద్ధికి సంబంధించి కలెక్టర్లు... పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు.
ఇంత వరకు ఒకే.. కానీ, అసలువిషయానికి వస్తే.. కలెక్టర్ల అంశంలో వారికి సీఎం చంద్రబాబు నుంచి కానీ.. నాయకుల నుంచి కానీ.. ప్రజా ప్రతినిధుల నుంచి కానీ.. అందుతున్న సహకారం ఎంత? ఇస్తున్న సమయం ఎంత? అనేది కీలకంగా మారాయి. ఎందుకంటే.. పొద్దస్తమానూ.. కలెక్టర్లను నివేదికలు ఇవ్వాలని.. వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించాలని మాత్రమే చెబుతున్నారు. అంతేకాదు.. ఉన్నది ఉన్నట్టు ఇస్తు న్న కలెక్టర్లపై ఓ వర్గం మీడియా.. వైసీపీ ముద్ర వేస్తోంది. వారంతా వైసీపీకి అనుకూలం అనే మాట చెబుతోంది.
దీంతో ఏం చేయాలన్నా కూడా.. కలెక్టర్లకు నిప్పులపై నడిచినట్టుగా పరిస్థితి మారిపోయింది. దీంతో పని చేసే అధికారులు కూడా పనిని పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక, నిరంతరం.. పనితో కుటుంబాల కు కూడా దూరమైన అధికారులు ఉన్నారు. హైదరాబాద్‌లో నివసిందే.. ఇద్దరు కలెక్టర్ల కుటుంబాలు.. ఈ నెల ప్రారంభంలో అమరావతికి వచ్చాయి. దీనికి కారణం.. నెల రోజులుగా సదరు కలెక్టర్లకు తీరిక లేకపోవడంతో కుటుంబాలను కూడా పట్టించుకోలేక పోయారట. ఇలాంటి వాటిని త్యజించాల్సిన అవసరం ఉంది. ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం మరింతగా ఉంది. నాయకుల నుంచి ఒత్తిళ్లు.. తగ్గించి.. కలెక్టర్లు పారదర్శకంగా పనిచేసేలా ప్రోత్సహిస్తేనే చంద్రబాబు లక్ష్యాలు నెరవేరతాయి.
