లవ్ లో పడిన చంద్రబాబు
ఇక కేవలం ఆరు నెలల తేడాలో మరోసారి ప్రధాని మోడీని విశాఖకు చంద్రబాబు రప్పిస్తున్నారు.
By: Tupaki Desk | 17 Jun 2025 9:45 AM ISTఅదేంటి బాబు ఏడున్నర పదుల వయసులో లవ్ లో పడడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారా షాక్ తింటున్నారా. లవ్ అంటే అదేనా ఆ ఒక్క బంధమేనా. కానే కాదు లవ్ అంటే ఎంతో విశాలమైనది. పవిత్రమైనది. బాబుకు అలాంటి పవిత్రమైన ప్రేమ విశాఖతో ఉంది. అందుకే ఆయన విశాఖ వస్తే చాలు మనసు విప్పి మాట్లాడుతారు.
విశాఖను ఆయన పొగడకుండా ఉండలేరు. విశాఖను అంతర్జాతీయంగా యోగా డేని నిర్వహించడానికి వేదికగా మార్చారు అంటే అది బాబుకు విశాఖ మీద ఉన్న ప్రేమతో మాత్రమే. గతంలో బాబు సీఎం గా ఉన్నపుడు విశాఖ నుంచే అనేక కార్యక్రమాలు చేపట్టారు. విశాఖకే ఎంతో మంది ప్రముఖులను తీసుకుని వచ్చి ఇంటర్నేషనల్ సెమినార్స్ పెట్టారు.
ఇక కేవలం ఆరు నెలల తేడాలో మరోసారి ప్రధాని మోడీని విశాఖకు చంద్రబాబు రప్పిస్తున్నారు. ఈ నెల 21న విశాఖ ఆర్కే బీ వద్ద జరిగే యోగా డే కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు అవుతున్నాయి. వాటిని సమీక్షించేందుకు విశాఖ వచ్చిన బాబు విశాఖ అందాలను చూసి మళ్ళీ ప్రేమలో పడ్డారు.
విశాఖ తీరం వంటిది దేశంలో ఎక్కడా లేదని బాబు కితాబు ఇచ్చేశారు. విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఉన్న సువిశాల తీర ప్రాంతం అత్యంత అనువైందని దేశంలో మరెక్కడా ఇటువంటి ప్రదేశం లేదని చంద్రబాబు ప్రశంసించారు. అంతే కాదు విశాఖవాసులు ఎంతో మంచి వారు అన్నారు. వారు నిబద్ధత క్రమశిక్షణ కలిగిన వారు అన్నారు.
తాను విశాఖ వచ్చిన ప్రతీసారీ ముచ్చట పడుతూంటాను అన్నారు చంద్రబాబు. విశాఖ వాసుల కోసం ఎంత చేసినా తక్కువే అని ఆయన అన్నారు. విశాఖ వాసులు ప్రగతి కాముకులు అన్నారు. వారు ఎవరెన్ని చెప్పినా అభివృద్ధి వెంటే ఉంటారు అని అన్నారు. తాను కూడా హుదూద్ తుఫాన్ సమయంలో విశాఖ వచ్చి వారం రోజుల పాటు అక్కడే ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహించి ఒక గాడిన పెట్టాను అని గుర్తు చేసుకున్నారు.
అనాటి పరిస్థితులలో దీపావళి చేసుకుంటే కూలి ఎండిన చెట్ల వల్ల ఇబ్బంది వస్తుందని ప్రజలకు చెబితే వారంతా అలాగే పాటించారు అని అదీ క్రమశిక్షణ అంటే అన్నారు. విశాఖను తాను దేశంలోనే నంబర్ వన్ గా చేస్తాను అని బాబు మాట ఇచ్చారు. విశాఖ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని బాబు చెప్పారు. విశాఖ ది బెస్ట్ సిటీ అని దానికి తగినట్లుగానే కూటమి ప్రభుత్వం కూడా ప్రోత్సాహం ఇచ్చి చేయూతను అందిస్తుందని బాబు చెప్పారు. మొత్తానికి చంద్రబాబు విశాఖను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఒక విధంగా అది విశాఖకు వరంగా మారుతోంది. విశాఖ అభివృద్ధి మరింతగా జరిగేందుకు దోహదపడుతుంది అని అంతా అంటున్నారు.
