Begin typing your search above and press return to search.

బాబు ఒక్క ఫోన్ కాల్ తో విజయ్ డీకే ఓకే

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించి ఆర్నాబ్ తుఫాన్ మిగిల్చిన విషాదాన్ని తుడిచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Satya P   |   2 Nov 2026 9:23 AM IST
బాబు ఒక్క ఫోన్ కాల్ తో విజయ్ డీకే ఓకే
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించి ఆర్నాబ్ తుఫాన్ మిగిల్చిన విషాదాన్ని తుడిచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఆర్నాబ్ పెను తుఫాన్ గా మారి కోస్తా గుండె కోసింది. ఇపుడు మురసు తుఫాన్ రాబోతోంది. ఆర్నాబ్ విసిరిన పంజా దెబ్బకు మౌలిక సదుపాయాలు కుప్ప కూలాయి. వేలల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాంతో వాటిని వేగంగా పునరుద్ధరించే పనులలో ఏపీ ప్రభుత్వం ఉంది. సాయానికి తెలంగాణా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మురసు తుఫాన్ ముంచుకు వస్తే మరింత నష్టం వాటిల్లుతుందని ఆందోళనతో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు సీఎం విజయ్ తో అలాగే కర్ణాటక సీం డీకే శివ కుమార్ తోనూ ఫోన్ కలిపారు. ఈ కీలక సమయంలో సహకారం అందించాలని కోరారు.

వివరించిన బాబు :

ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో తీవ్ర నష్టం కలిగించి విద్యుత్ కి తీవ్ర అంతరాయం గా మారిన పరిస్థితుల నుంచి పునరుద్దరణ పనులకు తమ రాష్ట్రాల నుంచి సిబ్బందిని పంపాలని పొరుగు రాష్ట్రాల సీఎంలను కోరిన చంద్రబాబు ఫోన్ కాల్ ద్వారా కోరారు. ఒక వైపు మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ప్రమాదం ఉందనే సూచనలను దృష్టిలో పెట్టుకుని పొరుగు రాష్ట్రాలతో ఏపీ ప్రభుత్వం సమన్వయం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇద్దరు సీఎంలకు స్వయంగా బాబు ఫోన్ చేసి మాట్లాడారు.

అవసరమైన సిబ్బందితో :

ఇక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయ్, డీకే శివకుమార్ లతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. తుఫాను నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణ పనులకు అవసరమైన సిబ్బందిని అలాగే అవసరమైన యంత్రాలను పంపాలని రెండు రాష్ట్రాల సీఎంలను ఈ సందర్భంగా ఆయన కోరారు. బాబు చేసిన ఈ విన్నపానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. ఈ విపత్తు వేళ ఏపీకి అవసరమైన మేరకు సహకరిస్తామని ఇద్దరు ముఖ్యమంత్రులూ చెప్పారని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ అధికారులు ఇరు రాష్ట్రాలకు చెందిన శాఖాధికారులను సంప్రదిస్తారని సీఎం చంద్రబాబు వారితో చెప్పారు.

చురుగ్గా పనులు :

ఇక గత వారం పెద్ద ఎత్తున విరుచుకుపడిన అర్నబ్ తుఫాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించే పనుల నిమిత్తం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన సిబ్బంది క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నారు. మరోవైపు అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్దరణ పనులను ముగించుకున్న పలువురు విద్యుత్ శాఖ సిబ్బందిని ముందు జాగ్రత్తగా మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉంచింది. దాంతో అదనపు సాయం కోసం పొరుగు సీఎంలకు బాబు ఈ విధంగా కోరారని అంటున్నారు. నిజానికి చూస్తే బాబు ఎన్డీయేలో ఉన్నారు. ఆ ఇద్దరు సీఎంలూ ఇండియా కూటమిలో ఉన్నారు. అలాగే వేరే పార్టీలకు చెందిన వారు. అయినా సరే బాబుతో వారికి ఉన్న అనుబంధం వేరు. అందుకే ఈ కీలకమైన సందర్భంలో రాష్ట్రం కోసం వారి సహకారాన్ని బాబు కోరుతున్నారని అంటున్నారు. మొత్తం మీద బాబు తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యలు ఏపీని ఒడ్డున పడేస్తాయని అంతా నమ్ముతున్నారు.