Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే అరవిందబాబు ఎపిసోడ్.. సీఎం సీరియస్ వార్నింగ్!

పల్నాడు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ప్రవర్తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

By:  Tupaki Political Desk   |   2 April 2026 1:52 PM IST
ఎమ్మెల్యే అరవిందబాబు ఎపిసోడ్.. సీఎం సీరియస్ వార్నింగ్!
X

పల్నాడు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ప్రవర్తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన అనుచరుడికి కాంట్రాక్టు ఉద్యోగంలో నియమించే విషయమై పల్నాడు జిల్లా ఎప్పీ ఆఫీసులో ఎమ్మెల్యే రచ్చ చేయడాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసినా ఎమ్మెల్యే వినిపించుకోకుండా గొడవ చేశారని ముఖ్యమంత్రికి నివేదిక అందిందని అంటున్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించేలా ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహరించారని భావిస్తూ, ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారని ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యే అరవిందబాబు ఎపిసోడ్ టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక చిన్న ఉద్యోగం విషయంలో ఎమ్మెల్యే అలా ప్రవర్తించడం సరికాదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే స్వయంగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లడం, ఎస్పీతో గొడవ పెట్టుకోవడమే కాకుండా, ఐజీ స్థాయి అధికారి వచ్చి వివరణ ఇస్తున్నా లెక్క చేయకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అంటున్నారు. ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడంగానే భావిస్తూ అరవింద బాబుకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని సీఎం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ఎస్పీ కార్యాలయంలో రచ్చకు దిగిన ఎమ్మెల్యే అరవిందబాబుతో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రయత్నించినా, ఎమ్మెల్యే లెక్క చేయలేదన్న సమాచారంతో సీఎం చంద్రబాబు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఈ పరిణామాలతో షాక్ కు గురైన ఎమ్మెల్యే అరవిందబాబు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు ఫోన్ చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయితే అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఫోన్ లో వివరణ తీసుకునేందుకు పల్లా సైతం అంగీకరించలేదని, పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సూచించినట్లు చెబుతున్నారు.

ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహారంపై బుధవారమే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మైండ్ కంట్రోల్ లో లేకపోవడం వల్లే ఇలాంటి ప్రవర్తనకు కారణమవుతోందని తీవ్రవ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లాలో పర్యటించిన సీఎం ఓ బహిరంగ సభలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఓ ఆఫీసుపై పడ్డాడు. ఎవరైనా మైండ్ కంట్రోల్ లో పెట్టుకోవాలి అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అరవింద బాబు ప్రవర్తనపైనే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరగడంతో ఆయన నష్టనివారణకు దిగినట్లు చెబుతున్నారు. అయితే అప్పటికే ఎమ్మెల్యే అరవింద బాబు విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. గతంలోనూ ఎమ్మెల్యేపై ఇటువంటి ఫిర్యాదులు ఉండటంతో అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.